క్యాష్‌ ఇస్తారా? కేటాయిస్తారా?

Womens big hopes from the  Nirmala Sitaraman budget 2021 - Sakshi

ఇది సామాన్యుల బడ్జెట్‌ అని, ఇది రైతుల బడ్జెట్‌ అని, ఇది వ్యాపారుల బడ్జెట్‌ అని, ఇది ఉద్యోగుల బడ్జెట్‌ అని ఏటా ఏదో ఒక వ్యాఖ్యానం వినిపిస్తుంది. ఈసారి మాత్రం ఇది పూర్తిగా ‘మహిళా బడ్జెట్‌’ అవవలసిన అవసరమైతే ఉంది.

కొద్ది గంటల్లో బడ్జెట్‌! కష్టకాలంలో వస్తున్న బడ్జెట్‌. కరోనా వల్ల అందరూ కష్టపడ్డారు. అందరికన్న ఎక్కువ కష్టం అనుభవించింది మహిళలు, బాలికలు, బాలలే! లాక్‌డౌన్‌ సమయంలో వారికి రక్షణ, భద్రత లేకుండా పోయాయి. వారిపై లైంగిక హింసకు అడ్డు లేకుండా పోయింది! సొంత ఇంట్లోనే వారికొక ‘స్పేస్‌’ కరువై పోయింది. ఆ స్పేస్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో ఇవ్వబోతున్నారా? లైంగిక హింసను నిరోధించడానికి కొత్త విధానాలు, కేటాయింపులు బడ్జెట్‌లో ఏమైనా ఉంటాయా? అయితే అవి ఎలాంటివి అయి ఉంటాయి?! ధీమా కోసం మహిళల కొంగుకు పది రూపాయలు ముడేస్తారా? భారీ నిధుల ప్రణాళిలతోనే ధైర్యం కల్పిస్తారా?

స్త్రీ శిశు సంక్షేమానికి యేటా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయి. ఈసారి సంక్షేమం కన్నా కూడా లైంగిక హింస నుంచి మహిళలకు రక్షణ, భద్రత కల్పించడానికి బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరాన్ని కరోనా కలిగించింది. ఈ సంగతి బడ్జెట్‌ వేసే వాళ్ల దృష్టికి చేరనిదేమీ కాదు. నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇండియా లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో ఒక్క జూన్‌ నెలలోనే మహిళలు, బాలలపై లైంగిక నేరాలు జరిగినట్లు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ కు 2043 ఫిర్యాదులు అందాయి! ఇక పిల్లలపై జరిగిన హింసకైతే అంతే లేకుండా పోయింది. లాక్‌ డౌన్‌ మొదలైన తొలి 11 రోజుల్లో చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌కు 3 లక్షల కాల్స్‌ వెళ్లాయి! కరోనా పరిస్థితులు తెచ్చిపెట్టిన మానసిక ఒత్తిడి కారణం గా మహిళలు, బాలలు లాక్‌డౌన్‌ మొత్తం  క్షణక్షణం భయం భయం అన్నట్లుగానే గడిపారని మరికొన్ని నివేదికలు వచ్చాయి.

స్కూళ్లు మూత పడటం, ఆన్‌లైన్‌ చదువులకు సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఇరవై నాలుగు గంటలూ ఒకరి కళ్లెదురుగా ఒకరు ఉండిపోవడం, అభిప్రాయభేదాలు, అనవసర ఘర్షణలు, దంపతుల మధ్య మనస్పర్థలు అన్ని కలసి మహిళలు, పిల్లలపైనే దుష్ప్రభావం చూపించాయని స్వచ్ఛంద సంస్థల సర్వే నిపుణులు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, ఆర్థిక శాఖకు, పోలీసు శాఖకు తమ నివేదికలను అందించారు. ఆ సమాచారం ఆధారంగానైనా నేటి బడ్జెట్‌లో మహిళలు బాలల భద్రతకు, రక్షణకు మరింతగా నిధులను కేటాయించడం, కొత్తగా ప్రభుత్వ విధానాలను రూపొందించడం వంటివి ఉండొచ్చని, ఉంటే బాగుంటుందని ఒక ఆశ, ఒక ఆకాంక్ష ఈసారి వ్యక్తం అవుతోంది.
∙∙
మహిళా సంక్షేమం కోసం ఇప్పటికే అనేక చట్టాలు, శాసనాలు, పథకాలు, ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. మళ్లీ కొత్తగా బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి అనే సందేహాన్ని రానివ్వనంతగా మహిళల జీవితాన్ని దుర్భరం చేసేసింది లాక్‌డౌన్‌. వారి ఉద్యోగాలు పోయాయి. ఉపాధులు కొండెక్కాయి. ఇంటెడు చాకిరి కొండంతైంది. ఇంట్లో హింస పెరిగింది. పర్యవసానంగా మహిళల ఆరోగ్యం క్షీణించింది. శారీరకంగా, మానసికంగా కృంగిపోయారు. అంతకన్నా దారుణం వారికి వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడం. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, కరోనా కాలపు అగమ్యగోచరం రెండూ కలిసి మహిళల్ని జీవచ్ఛవాలను చేశాయి.

ఈ దుస్థితి నుంచి వారిని తెరిపిన పడేసే ప్రాధాన్యాలు, నిధులు బడ్జెట్‌లో లేకుంటే.. స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికి ఉన్న మహిళల శ్రమ శక్తి వాటా పదిహేడు శాతానికంటే తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గత శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును కనీసం 11 శాతానికైనా పెంచుకోవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం అందుకు అవసరమైన మహిళల శక్తి సామర్థ్యాలను, వాళ్లకు కల్పించవలసిన రక్షణ భద్రతలను కూడా గుర్తించి నేటి బడ్జెట్‌కు తుది రూపును ఇచ్చి ఉంటుందనే అనుకోవాలి. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్‌–స్టాప్‌ సెంటర్‌లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉండొచ్చు.

విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడూ మహిళలపై జరిగే లైంగిక నేరాలను తగ్గించే విషయంలో పరోక్షమైన పాత్రను వహిస్తాయి. షెల్టర్‌ హోమ్‌లు ప్రత్యక్ష నరక కూపాల నుంచి కాపాడతాయి. ఈ హోమ్‌ల సంఖ్య పెంచేందుకు, సమర్థవంతంగా వాటిని నిర్వహించేందుకు అవసరమైన నిధులు కూడా ఈ బడ్జెట్‌లో ఉండాలని సూచిస్తున్న ఆర్థిక రంగ నిపుణులు.. ‘క్యాష్‌ బేస్డ్‌ సోషల్‌ ప్రొటెక్షన్‌’ ని కూడా నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌లో కల్పించవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు. క్రమం తప్పకుండా మహిళల అకౌంట్‌లో కొంత డబ్బును విధిగా జమ చేయడమే నగదు రక్షణ విధానం. గ్రామీణ ప్రాంత మహిళల సంక్షేమానికి, లైంగిక హింస నుంచి రక్షణకు ఈ మనీ ట్రాన్స్‌ఫర్‌ చాలా వరకు తోడ్పడుతుంది. పై పెచ్చు వారికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. దీనిపైన కూడా ఇవాళ్టి బడ్జెట్‌లో విధానం నిర్ణయమై ఉంటుందని నేషనల్‌ ఉమెన్‌ కమిషన్‌ అంచనా వేస్తోంది.

లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్‌–స్టాప్‌ సెంటర్‌లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉండొచ్చు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top