వారెవ్వా.. ఎల్లవ్వ

Woman Farmer Manchala Yellavva Success Story - Sakshi

కట్టుకున్నవాడు కాదన్నా పిల్లలకు ఏ లోటూ రాకుండా..

ఎవుసం చేస్తూ కుటుంబ పోషణ

పలుగు, పార, అరక, గొర్రు ఆమె చేతిలో అరిగిన పనిముట్లే

65 ఏళ్ల వయసులోనూ ఏటికి ఎదురీత

ఆమె వయస్సు 65 ఏళ్లు. అయితేనేం వ్యవసాయ పనుల్లో తాను ఎవరికీ తక్కువకాదు అన్నట్లు పొలం పనులు చేస్తోంది. చిన్న వయసులోనే తల్లి దూరమైంది. అప్పటినుంచే కష్టాలతో సావాసం చేయడం నేర్చుకుంది. 15వ ఏటనే పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టగానే తాగుబోతు భర్త విడిచిపెట్టేశాడు. దీంతో పిల్లలను తీసుకుని తండ్రి దగ్గరకు చేరింది. వృద్ధాప్యం లో తండ్రి కష్టం చూడలేక తాను వ్యవసాయం చేస్తూ కుటుంబ బాధ్యతలను మోస్తూ ఏటికి ఎదురీదుతోంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గాంధీనగర్‌కు చెందిన మంచాల ఎల్లవ్వ. ఈ వయసులోనూ నెలకు రూ.8 వేల చొప్పున వ్యవసాయ పనులు చేయడానికి ఓ ఆసామి దగ్గర పాలేరుగా పని చేస్తూ మగవారికి సరితోడుగా పనులు చేస్తూ ఔరా అనిపిస్తోంది.

ఏటికి ఏతం పెట్టి పంటల సాగు
భర్త నుంచి విడిపోయిన తర్వాత అయ్య వ్యవసాయ భూమి పక్కనే రెండు ఎకరాల భూమిని బిడ్డకు ఇవ్వడంతో ఎల్లవ్వ చెరువుకు ఏతం పెట్టి రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేసి ధాన్యం పండించగా వచ్చిన వాటిని విక్రయించి ఒంటిచేత్తో పిల్లలను పోషించుకుంటూనే చదువులు కూడా చెప్పించింది. అయ్య నేర్పిన మోట తోలుడు అనుభవమో ఏతం వేసిన అనుభవమో ఆమెకు బతుకు బాటను చూపించాయి. 15 ఏళ్ల వరకు వ్యవసాయం చేసి పిల్లలను పెద్ద చేసి 25 ఏళ్ల క్రితమే కూతురుకు రూ.50వేల కట్నం ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు బిడ్డ కూతురే డిగ్రీ చదువుతోంది. కొడుకు రమేశ్‌ పెద్దగా చదువుకోకపోవడంతో ఆటో కొనిచ్చి బతుకు చూపించిన తాను ఇంటి దగ్గర కూర్చోలేక తన వ్యవసాయ బావి దగ్గర ఓ ఆసామికి వ్యవసాయ పనులు చేయడానికి పసల్‌ అంటే ఒక సీజ¯Œ కు రూ.32వేలకు పాలేరుగా పనికి కుదిరి సాగు పనులు చేస్తోంది. ఎన్ని కష్టాలొచ్చినా అధైర్యపడకుండా మట్టిని నమ్ముకొని చెమటోడ్చి 45 ఏళ్లుగా కష్టాలతో కాపురం కొనసాగిస్తోంది.

పిల్లలే నా ఆస్తి
పేదరికంలో పుట్టిన ఎల్లవ్వకు చిన్నప్పటి నుంచి కష్టాలే ఎదురొచ్చినా ఎక్కడా రాజీపడకుండా మొండి ధైర్యంతో శ్రమను నమ్ముకొని సేద్యం చేసి పిల్లలను సాదుకుంది. పిల్లలే నాకు కోట్ల ఆస్తి అన్నట్లు మనుమలతో ముచ్చటిస్తూ మురిసిపోతోంది. చెరువు దగ్గర తండ్రి ఇచ్చిన రెండు ఎకరాల భూమి తప్ప ఎల్లవ్వకు ఎలాంటి ఆస్తులు లేవు. చెరువు నిండితే ఏతం ఏసుకొంటేనే పొలం పారుతుంది. 20 ఏళ్ల క్రితం కరువచ్చి ఎవుసం సాగకపోవడంతో ఎల్లవ్వ పొరుగువారికి వ్యవసాయ పనులు చేయడానికి పాలేరుగానే పని చేసి పిల్లలను పోషించుకుంది. ఇప్పుడు చెరువు నిండటంతో మళ్లీ తన పొలంలో వరి నాట్లు వేయడానికి సిద్ధమవుతోంది. ధైర్యం చెప్పే తండ్రి అసువులు బాసినా ఎల్లవ్వ గుండె చెదరలేదు. అయ్య నేర్పిన వ్యవసాయ పనులనే బతుకు బాటలుగా వేసుకొని ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసి వృద్ధాప్యంలో సైతం వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

అస్తులు కూడబెట్టాలనే ఆశ ఎన్నడూ లేదు
నా చిన్నప్పటి నుంచి అయ్యతోనే ఎవుసం పనులకు పోయేది. అయ్య మోట తోలితే సద్ది తినే యాళ్లకు వెళ్లి నేను మోట తోలి పొలానికి నీళ్లు పెట్టేదాన్ని. చెరువు మీది పొలానికి ఏరుకు ఏతం పెట్టి రెండు ఎకరాలకు నీళ్లు పారించేదాన్ని. ముసిముసి మబ్బులోనే పొలం కాడికి పోయి సాయంత్రం కనుమసుక అయ్యేదాకా ఏతం ఏసి ఇల్లు చేరుకోనేది. ఎనుక ముందు దిక్కు అసరా లేని దాన్ని. పిల్లలు, నేను బతికితే చాలనుకున్న. అస్తులు కూడబెట్టాలనే ఆశ ఎప్పుడు రాలేదు. ఇద్దరు మనుమలు, ఇద్దరు మనుమ రాళ్లే నేను సంపాదించిన అస్తి.
– మంచాల ఎల్లవ్వ,  మహిళా రైతు

– దుండ్ర ఎల్లయ్య, సాక్షి, హుస్నాబాద్‌ రూరల్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top