ఫ్రెండ్స్, మీరెప్పుడైనా మన తెలుగు సామెతలు విన్నారా? ‘చాలా విన్నాను’... ‘కొన్ని విన్నాను’ అనేవారితోపాటు... ‘సామెత అంటే ఏమిటి?’ అని అడిగేవారు కూడా మీలో ఉన్నారు.వినడానికి సామెతలు సరదాగా ఉంటాయి గానీ... అవి మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వాటిలో మంచి ఉంది. మనల్ని నవ్వించే కామెడీ ఉంది. జీవిత సత్యాలు ఉన్నాయి.లాంగ్వేజ్ స్కిల్స్‌లో సామెతలు ఉపయోగించడం కూడా ఒకటని మీరు గుర్తు పెట్టుకోవాలి.‘మన సామెతలను మనం తెలుసుకోవడం అంటే... మన ముత్తాతలతో మూడువేల సార్లు మాట్లాడినట్లు’ అనే సామెత కాని సామెత ఉంది. సామెతలు అనేవి సముద్రంలాంటివి. అందులో మనకు ఎన్ని తెలిస్తే అంతమంచిది. ఈరోజు మనం కొన్ని సామెతలు తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదు వాటిని ఎక్కడో ఒకచోట ఉపయోగించాలి కూడా!
కొయ్యర కొయ్యర పోలిగా అంటే... టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట!
వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి. అలా కాకుండా లేని విషయాన్ని బాగా పెద్దగా చేసి చెప్పడం మంచిది కాదు. దానివల్ల రకరకాల సమస్యలు వస్తాయి. మిరియాలు చిన్న సైజ్‌లో ఉంటాయి. ‘మా ఊళ్లో అలా కాదు... తాటికాయలంత ఉంటాయి’ అనడం అబద్ధం చెప్పడమే కదా! ఒక విషయాన్ని పదింతలు చేసి చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది.
తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే... దూడకు గడ్డి కోయడానికి అన్నాడట!
కొందరు వ్యక్తులు, మనం ఒకటి అడిగితే వారొకటి చెబుతారు. వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ΄పొంతన లేని సమాధానాలు ఇచ్చి నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి వాడే సామెత...‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే... దూడకు గడ్డి కోయడానికి అన్నట్లు!’
దీనికి సంబంధించి ఒక జోక్...
రాత్రి బ్యాంకు దొంగతనానికి వచ్చిన దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. ‘దొంగతనానికి వచ్చాను. తప్పయిపోయింది’ అనలేదు. ఏదోరకంగా తప్పించుకోవాలని... ‘సార్... మీరు పొరబడుతున్నారు. రాత్రిపూట కూడా బ్యాంక్ పనిచేస్తుందా లేదా? అనేది తెలుసుకోవడానికి వచ్చాను’ అన్నాడట!
కుక్కను పెంచి...తానేమొరిగినట్లు!
‘అనవసరంగా కష్టపడుతున్నారు’ అని చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత... కుక్కను పెంచి తానే మొరిగినట్లు!ఉదాహరణకు....ఒక వ్యక్తి తన ఇంటికాపలాకు వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ‘నువ్వు రెస్ట్ తీసుకో...నేను చూస్తాను’ అని వాచ్‌మెన్‌తో యజమాని అంటే ఎలా ఉంటుంది చెప్పండి!
...ఇవే కాదు ఇంకా ఎన్నో సామెతలు ఉన్నాయి. పెద్దలను అడిగి వాటిని తెలుసుకోండి. నోట్‌బుక్‌లో రాసుకోండి. అన్ని ్ర΄ాంతాలకు తెలిసిన సామెతలతో పాటు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పాపులర్ అయిన సామెతలు కూడా ఉంటాయి. మీ ప్రాంతంలో పాపులర్ అయిన సామెతలు ఏమిటో తెలుసుకోండి.
ఘడియ పురుసత్తు లేదు... దమ్మిడీ ఆదాయం లేదు!
మనం కష్టపడ్డామంటే దానికి ఫలితం ఉండాలి. మనం ఒక పని మీద టైమ్ పెట్టామంటే ప్రయోజనం ఉండాలి. అలా కాకపోతే... టైమ్ వేస్ట్ చేసినట్లే కదా! ఇలాంటి సందర్భంలో ఉపయోగించే సామెత ఇది.
సామెతల సముద్రంలో నుంచి కొన్ని సామెతలు...
ఆశ దోషమెరుగదు
అంగట్లో అరువు తల మీద బరువు
అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు
అండ ఉంటే కొండలు దాటొచ్చు
ప్రీతితో పెట్టింది పిడికెడు చాలు
ఎంత చెట్టుకు అంతగాలి
చేటు కాలానికి చెడు బుద్దులు
మన దీపమని ముద్దాడితే మూతి మీది మీసాలు కాలకుండా ఉంటాయా!
కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు
కడివెడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ
పంచాంగం ΄పోయిందని తిథివారాలు పోతాయా?
గుర్రాన్ని గుగ్గిళ్లకు అమ్మినట్లు
కుక్క సింహం కాదు, కుందేలు తోడేలు కాదు
నలుగురు నడిచేది దారి... పదుగురు చెప్పేది నీతి.


