క్రీస్తు కేంద్రకంగా దేవుడు సంకల్పం చేశాడు. ఇందులో క్రీస్తు మరణం అత్యంత ప్రధానం. ఈ సర్వ జగత్తుకు పూర్వమే క్రీస్తు బలి ఏర్పాటు చేయబడింది. పాపము లేనప్పుడే క్రీస్తు పరిశుద్ధ రక్తానికి ప్రాధాన్యం ఇవ్వడం అంటేనే దేవుడు అద్వితీయ జ్ఞాన సంపన్నుడుగా మనకు దర్శనమిస్తున్నాడు. దూరదృష్టి, ముందుచూపు అనేవి దేవుని నుండి నేర్చుకోగలిగే జీవితాలు ఏంతో ఉన్నతంగా ఉంటాయి. మానవాళి పాపాలకు ప్రతిగా యేసును నలగగొట్టడం దేవుడైన యెహోవాకు ఇష్టమైంది. క్రీస్తు వారి మరణం దేవుని చిత్తం. నీ చిత్తమే సిద్ధించును గాక అంటూ తలవంచిన క్రీస్తు ముందుకు అడుగు వేశాడు. దేవుడు తన ప్రజల పరిశుద్ధత కొరకు యుక్త కాలాన యేసును ప్రాణం పెట్టమన్నాడు. అందుకు క్రీస్తు సంతోషంగా సమ్మతించాడు. బలి ఆగుటకు ఏంతో ఇష్టపూర్వకంగా విధేయంగా తన తండ్రియైన దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు .
యేసు తనను గూర్చి తన రాకను గూర్చి ఇలా వివరణ ఇచ్చుకున్నారు. నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము ఇచ్చుటకు వచ్చాను (మత్త 20:28). ప్రాణత్యాగాన్ని మించిన గొప్ప పరిచర్య ఏముంటుంది? నీతి కలిగిన మంచి వ్యక్తులకొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవతెగించవచ్చు. మంచి వాడైనా చెడ్డ వాడైనా ’తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు’ అన్నది ఆయన ఉన్నత బోధే (యోహాను 15:13). ఒక్క దేవుని మెప్పు ఉంటే కోల్పోయేది ఎలాంటిదైనా ఎంతటిదైనా ఏముంది? తనదైన బోధలకు అనుగుణంగా అనగా, సాహసొపేతంగా జీవిస్తూ ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన వాడు యేసు. ప్రత్యేకంగా ఇదే యేసు జీవితానుభావం నుండి మనం నేర్చుకొనేది. క్రీస్తు భక్తిహీనులైన పాపుల కొరకు చని΄ోయారు (రోమా 5:6–8 ).
క్రీస్తు మరణానికి కొద్దిరోజుల ముందు ప్రధాన యాజకుడైన కయప ఇలా ప్రవచించాడు. ‘మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తం... యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరి΄ోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనైయున్నాడు’ ( యోహాను 11:49–52 ) అంటూ..
దేవునిలో స్థిరపడి నిలకడగా ఉన్న యూదులైన దేవుని పిల్లలు, దారితప్పి చెదరి దూరమైన వేరే దొడ్డి గొర్రెలు అనబడే అన్యజనులు ఇప్పుడు క్రీస్తు మరణం వలన ఏకం కాబోతున్నారు. విద్వేషం లేని ఆత్మ సంబంధ ఏక ప్రపంచం త్వరలో రూపుదిద్దుకోబోతోంది. ఈ పై రెండు వచనాలు క్రీస్తు ’మరణ శాసనం’ గుర్తు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి
యేసు తన మరణాన్ని తానే నిర్ణయించుకొని అనగా ప్రాణం పెట్టుటకును తిరిగి తీసికొనుటకును దేవుని వలన అధికారం పొందియున్నారు. యేసుక్రీస్తు తన మరణ శాసనాన్ని అనగా కొత్త నిబంధన లేదా నూతన ఒడంబడికను తన రక్తంతో వ్రాసుసుకున్నారు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటూ తన మరణానికి ముందే చెప్పకనే చెప్పారు. క్రీస్తును బట్టే దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. అట్టి నిబంధనకు తన దైన సొంత రక్తం ద్వారా రూపకల్పన చేసినది మాత్రం క్రీస్తు వారే. రక్తము లేకుండా ఏ నిబంధన లేదు. క్రొత్త నిబంధన ఎంత ఉన్నతమైనదంటే ఇది క్రీస్తు వారి రక్తంతోనే ప్రతిష్టించబడింది.
– జేతమ్


