ప్రముఖ రచయిత, ఉత్తమ అవార్డు గ్రహీత భయ్యా కన్నుమూత.. హుష్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.అదేమిటి మొన్న సాయంత్రం వరకు బాగానే ఉన్నారు కదా... విజయవాడ పుస్తక మహోత్సవంలో వేదికపై నేను రాసిన ‘బతుకు బస్టాండు’ పుస్తకం ఆవిష్కరించి నాతో చాలాసేపు మాట్లాడారు. ఇంతలోనే ఏమైంది?.. నాలో ఆదుర్దా మొదలైంది.రిమోట్ అందుకుని వేరే చానల్ మార్చా. అందులోనూ ఇదే వార్త స్క్రోలవుతోంది. మనసాగక మరో చానల్‌కు వెళ్లా.. ఇదే సమాచారం ఫ్లాష్ న్యూస్‌గా వేస్తూ ఆయన ఫొటోలు చూపుతున్నారు. లైవ్ దృశ్యాలు ఇంకా ఏ చానల్‌లోనూ ప్రసారం కావడం లేదు. వెంటనే ఆయన అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసి వార్తను నిర్ధారించుకున్నాను.
భయ్యాగారు నాకంటే ఇరవై రెండేళ్లు పెద్ద. రచనాపరంగా ఆయన శైలి, భాష, ముక్కుసూటిగా చెప్పే తత్వం బాగా నచ్చి ఆయనకు వీరాభిమానినయ్యా. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఆయన మా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు. కళాశాల సావనీరులో నేను రాసిన కథ చదివి అభినందించారు. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి పిలిపించి కథలు రాయడంలో మెలకువలు నేర్పారు. అందుకే ఆయన్ను రచనా వ్యాసంగానికి తొలి గురువుగా స్వీకరించాను. అత్యంత నిరాడంబరంగా ఉండే రచయితల్లో భయ్యా ఒకరు. నేను పుస్తకాలు చదవడం ప్రారంభించిన రోజుల్లో ఏ దినపత్రిక, వారపత్రిక, మాసపత్రిక చూసినా ఆయన రచనలే కనిపించేవి. ప్రతి కథనూ, వ్యాసాన్ని మొదటి నుంచి చివరి వరకూ పొల్లు పోకుండా చదివేవాడిని.
ఆయనంటే నాకెంతటి అభిమానమో.. ఆయనకూ నేనంటే అంతే ఇష్టం. ఆయనతో సన్నిహితంగా మెలిగిన క్షణాలు, ఆయన చెప్పిన మాటలు నా కళ్ల ముందు సినిమా రీల్లా తిరుగుతుంటే ఫోన్ రింగయింది. మా ఇద్దరితో పరిచయం ఉన్న మిత్రుడు సారథి చేశాడు.. ‘భయ్యాగారు ఎలా పోయారు?’ అని.ఆ...ఆ.. ఇప్పుడే తెలిసింది. రాత్రి టిఫిన్ తిని ‘ఖ్యాతిముత్యం’ సీరియల్ రాస్తున్నారట. అలా రాస్తుండగా గుండెపోటు వచ్చింది. ఒంటరిగా ఉంటారేమో ఉదయం పేపర్ బోయ్ వచ్చేవరకు ఎవరూ చూడలేదు. ఆ కుర్రోడు అంబులెన్స్‌కు కాల్ చేస్తే వాళ్లొచ్చి చూసి రాత్రే చనిపోయారని నిర్ధారించారు..మిత్రుడితో మాట్లాడుతూనే ఆషామాషీ టీవీ చానల్ మార్చాను.భయ్యా ఆకస్మిక మృతిని మేజర్ వార్తగా కవరేజి ఇస్తున్నారు.భయ్యా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. అసలు పేరు భగవంతం బలరామయ్య.
మొదటి అక్షరం ‘భ’, చివరి అక్షరం ‘య్య’ను కలిపి ‘భయ్యా’గా కలం పేరు పెట్టుకుని అమూల్యమైన, స్ఫూర్తిదాయకమైన రచనలు చేశారు. యువత వికాసానికి చాలా పుస్తకాలు వెలువరించారు.. నాటకాలు, సినిమాలకు కథలు సమకూర్చారు. వందలకొద్దీ అవార్డులు, రివార్డులు అందుకున్న ఘనత భయ్యా సొంతం. ఆయన వయసు 77 ఏళ్లు. రచనా వ్యాసంగానికి అడ్డుకాకూడదనుకుని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయారు.. అంటూ న్యూస్ రీడర్ గుక్కతిప్పుకోకుండా చెబుతోంది. ఆయన పాత ఫొటోలు, పుస్తకాల కవర్ పేజీ క్లిప్పింగులు, సాహితీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటి వీడియోలు చూపిస్తూ అక్షర నివాళి అర్పిస్తున్నారు. పార్థివ దేహాన్ని విజయవాడలోని స్వగృహానికి తరలించినట్లు చెబుతూ.. అంత్యక్రియలు ఎప్పుడు జరిగేదీ ఇంకా స్పష్టత రాలేదన్నారు.
నాకేమో ఎప్పుడెప్పుడు వెళ్లి ఆయన పార్థివదేహాన్ని చూద్దామా అని మనసు పీకుతోంది. అనుకోకుండా ఆరోజు విజయవాడలో ఆటోవాలాలు సమ్మె చేస్తున్నారు. నాకైతే యాక్టివా ఉంది.. భుజం నొప్పితో బాధపడుతూ డాక్టర్ సలహా మేరకు నెల రోజులుగా బండి నడపడం లేదు.వెంటనే మిత్రుడు సారథికి ఫోన్ చేస్తే మంగళగిరి నుంచి హడావుడిగా వచ్చాడు. ఇద్దరం కలిసి వాడి కారులో లబ్బీపేటలోని భయ్యాగారింటికి బయలుదేరాం. దగ్గరలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద కారు నిలిపి నడుచుకుంటూ వెళ్లాం. ఆ ఇల్లు వారి తాతల నుంచి వచ్చిన వారసత్వపు ఆస్తి. నాలుగు గదుల డబుల్ పోర్షన్ డాబా ఇల్లు. దాదాపు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుత మార్కెట్ ధరను బట్టి మూడు కోట్లకు పైనే పలుకుతుంది.
అప్పటికే నగరంలోని సాహితీ మిత్రులందరూ భయ్యా పార్ధివదేహం వద్ద పూలు జల్లి నివాళులర్పిస్తున్నారు. నేను తీసుకెళ్లిన ఆయన ఫొటోను, రాసిన కొన్ని ప్రముఖ పుస్తకాలనూ అక్కడున్న చెక్క కుర్చీమీద పెట్టి నమస్కరించాను. టీవీ చానల్స్‌వారు లైవ్ కవరేజి కోసం హడావుడి చేస్తున్నారు. బందరు రోడ్డుపై ఓబీ వ్యాన్లన్నీ కవాతు చేస్తున్న సైనికుల్లా వరుసగా నిలిపి ఉన్నాయి. ఒక యాంకరమ్మ వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తోంది. నన్ను చూడగానే ఇంకో చానల్ యాంకర్ నా వద్దకు వచ్చి ఆయన గురించి నాలుగు ముక్కలు చెప్పాలని గొట్టం నా ముఖం మీద పెట్టింది.రెండు మూడు గంటల్లో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ వీధిలోని వారంతా వలంటీర్లుగా మారిపోయారు. వచ్చినవారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. మరికొంతసేపటికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేశారు.
నిజానికి భయ్యాగారు ఒంటరి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరు. పెద్దమ్మ పిల్లలు, బాబాయి పిల్లలు ఉన్నప్పటికీ వారంతా అమెరికాలో సెటిలయ్యారు. పాతికేళ్లుగా ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు లేవు. కనీసం ఫోను సంభాషణలు కూడా శూన్యం. భయ్యా తదనంతరం ఆస్తిపాస్తుల్ని, సంపాదించిన డబ్బును కొట్టేయాలన్న కాంక్షతో బందరు, నూజివీడు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఉన్న బీరకాయ పీచు చుట్టాలు టీవీలో వార్తలు చూసి మధ్యాహ్నానికల్లా కార్లలో వాలిపోయారు. ఎవరికి వారే ఖరీదైన పూలదండలు మోసుకొచ్చారు. తమకు భయ్యాతో ఉన్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకుంటూ ఆరున్నొక్క రాగం ఆలపించారు. ‘ఆస్తి మూరెడు..ఆశ బారెడు’ నవల్లో రాసినట్లు వాళ్లంతా తమలోని నటులను వెలికితీశారు. ఒక పెద్దాయనైతే ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందాన్ని మరిపించాడు.మధ్యాహ్నం 2 గంటలు.
ఆగస్టు నెలలోనూ ఎండ ప్రచండంగా మండిపోతోంది. సందర్శకులు ఆకలి దప్పులను సయితం మరిచి ఉదయం నుంచి షామియానాల కింద ఉసూరుమంటూ కూర్చుని సెల్‌ఫోన్లో వీడియోలు చూసుకుంటున్నారు. ఇంకొందరేమో ఆయన పార్థివదేహం వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాను పిచ్చపిచ్చగా వాడేసుకుంటున్నారు.యూట్యూబర్లయితే ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది మాట్లాడించి రికార్డు చేస్తున్నారు. తమ చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయించాలని బతిమలాడుతున్నారు.భయ్యా అభిమానులు అందరికీ పెరుగన్నం పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు.ఓ బీరకాయ పీచు చుట్టం వాలంటీర్‌ను పిలిచి ‘వీటన్నింటికీ డబ్బులెక్కడివి? మీరే పెట్టుకుంటున్నారా? లేక మా బాబాయి ఖాతాకు కన్నం పెడుతున్నారా?’ చెవిలో గొణిగాడు.
ఆ కుర్రాడు ఆయన్ను ఎగాదిగా చూసి ‘మీ బాబాయెవరు?’ అంటూ అయోమయంగా ప్రశ్నించాడు.‘అదేనయ్యా! మెడనిండా పూలదండలేసుకుని శాశ్వత నిద్ర పోతున్న ఆ పెద్దాయన’ అంటూ భయ్యా గారి శవపేటిక వైపు వేలు చూపెట్టాడు.వాలంటీర్ ఆయన్ను కూరలో కరివేపాకులా తీసిపారేసి ముందుకు సాగాడు.బీరకాయ పీచులు మెల్లగా జారుకుని బందరు రోడ్డెక్కారు. పీకల్దాకా బిర్యానీలు మెక్కి తిరిగొచ్చారు.ఒక తెలివైన ప్రచురణకర్త భయ్యాగారు రాసిన పుస్తకాలను ఆటోలో తీసుకొచ్చి విక్రయాలు ప్రారంభించాడు. తెచ్చిన గంటసేపట్లోనే సరుకంతా అయిపోగా, మళ్లీ తేవడానికి నిష్క్రమించాడు.భయ్యాగారి అభిమానులను, వాడకట్టు నివాసితులను చూసి ఆనందపడాలో.. ధనార్జనే ధ్యేయంగా శవం ముందు డబ్బులేరుకుంటున్న ప్రచురణకర్తను చూసి బాధపడాలో అర్థం కాక మిన్నకుండిపోయాను.
∙∙
మధ్యాహ్నం 3 గంటలు. కర్మకాండలు నిర్వహించేందుకు ఇద్దరు పురోహితులు, సహాయకుడు ఇల్లు వెతుక్కుంటూ చేరుకున్నారు. అందుకు కావాల్సిన సరంజామా వెనకాలే ఆటోలో వచ్చింది.అంత్యక్రియలు ఎన్ని గంటలకు చేస్తారండి అని ఒకరు, ఎవరు చేస్తారండి అని మరొకరు నా వద్దకొచ్చి అడిగారు.ఇంకా ఏమీ అనుకోలేదండి.. ఆయనకు కావాల్సినవాళ్లమంతా కూర్చుని మాట్లాడాక నిర్ణయిస్తాం.. చెప్పాను.‘మేం కావాల్సినవాళ్లం కాదా?’ అని ఓ బీరకాయ పీచు మైండ్ వాయిస్ బయటికి వినిపించింది.భయ్యాగారికి అంత్యక్రియలు ఎవరు చేయాలనే విషయమై అంతా తర్జనభర్జన పడుతున్నారు.
ఆయన అభిమాన సంఘం అధ్యక్షుడు ముందుకొచ్చి ‘మా సంస్థ తరఫున నేనే తలకొరివి పెడతా’నని చెప్పాడు.నగరంలోని రచయితల సంఘాలన్నీ కలిసి ఈ తంతు పూర్తిచేస్తే బాగుంటుందని నా అభిప్రాయం కుండబద్దలు కొట్టాను.‘బంధువుని నేనుంటే.. మీరెలా పెడతారు?’ ఆవేశంగా అడిగాడు గుంటూరు గురునాథం.‘భయ్యా బాబాయికి తలకొరివి నన్నే పెట్టమని పైలోకంలో ఉన్న అమ్మ నాకు పదేళ్ల కిందటే చెప్పింది’ బందరు బాబు లైన్లోకి వచ్చాడు. ‘గతంలో అమ్మ బెజవాడ వచ్చినప్పుడల్లా బందరు లడ్డూలు, నల్ల హల్వా తెచ్చిస్తే బాబాయి ఇష్టంగా తినేవాడురా.. నేను పోయాక ఆయనకు ఏ కష్టం రాకుండా చూసుకోరా.. అని చాలాసార్లు నాతో అంది’.. అంటూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు.
‘మీకు మీరే నిర్ణయాలు తీసేసుకునే లెక్కయితే ఇక మేమొచ్చిందెందుకు? నలుగురం కూర్చొని మన శంకర వరప్రసాదుగారిలా టీమ్ మీటింగు పెట్టుకుని ఒక అంగీకారానికి వద్దాం’ నూజివీడు, ఒంగోలు నుంచి వచ్చిన నీలాంబరం, రామ్మూర్తి ముక్తకంఠంతో పలికారు. అప్పటివరకు నాకు వాళ్లేమిటో, వారి వైఖరేమిటో పూర్తిగా అర్థం కాలేదు. వాళ్లొచ్చింది ఆయనపై ప్రేమతో కాదు, ఆస్తిమీద ఆశతోనని నిర్ధారించుకోవడానికి అట్టే సమయం పట్టలేదు.పట్టరాని కోపంతో నీలాంబరం, రామ్మూర్తి జుత్తు పట్టుకుని పక్కకు ఈడ్చేద్దామనుకున్నాను. ఇద్దరిదీ బట్టతలే కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేనా ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది.
చర్చోపచర్చలు, వాదోపవాదాలు సీరియస్‌గా సీరియల్‌గా నడుస్తూనే ఉన్నాయి శిఖరాగ్ర సమావేశాలకు దీటుగా.‘ఏదో ఒకటి త్వరగా తేల్చండి.. ఆవతల సూర్యాస్తమయం కావస్తోంది’ పొరుగింట్లో ఉండే వృద్ధమనిషి తొందరపెట్టారు.ఇంతలో అక్కడికి నల్లకోటు వేసుకున్న వ్యక్తి జనాలను తోసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. వస్తూనే అందరికీ నమస్కరించాడు. ఆయన వాలకం చూస్తే లాయర్ అని గ్రహించడానికి నాకెంతో సమయం పట్టలేదు.నా పేరు విశ్వనాథ్. పాతికేళ్లుగా భయ్యాగారితో పరిచయం ఉంది. కోవిడ్ సోకి దాదాపు చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆయన కోలుకున్న తర్వాత వీలునామా రాశారు. దాన్ని ఇంతకాలం నావద్ద భద్రంగా ఉంచారు. తాను మరణించాక దాన్ని బహిర్గతం చేయాలని నాతో చెప్పి మాట తీసుకున్నారు. ఆ ప్రకారం ఇప్పుడు నేనొచ్చా అంటూ బ్యాగ్‌లోంచి వీలునామా బయటికి తీశాడు.అందరి కళ్లూ ఆ వీలునామాపైనే కేంద్రీకృతమయ్యాయి.
మరీ ముఖ్యంగా బీరకాయ పీచులు గోతికాడ నక్కల్లా అందులో ఏం రాశారోనని ఆబగా ఎదురుచూస్తున్నారు.ఎవరికీ నోట మాట రావడం లేదు. నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. ముఖంపై చెమటను కర్చీఫ్‌తో ఒకటికి పదిసార్లు అద్దుకుంటున్నారు. టాంటాం టీవీ చానల్ కెమెరామేన్ రాంబాబు కెమెరా జూమ్ చేశాడు. రిపోర్టర్ గంగ జింకపిల్లలా చెంగు చెంగున గెంతుతూ జనాలను తోసుకుని ముందుకొచ్చింది.ఏదో అయిపోతుందని హడావుడిగా మరో రెండు మూడు చానల్స్ కెమెరామెన్, కొంతమంది యూట్యూబర్లు అనుసరించారు.ఈ హడావుడి చూసి ప్రతి ఒక్కరూ జేబులోంచి ఫోన్ తీసి ఫొటోలు తీయసాగారు.ఈ తంతు నిశితంగా గమనిస్తున్న బీరకాయ పీచు చుట్టాలు... ముసలోడు గట్టిగానే సంపాదించి ఉంటాడనుకున్నారు. ఆమధ్య చెన్నయ్‌లో లావుపాటి గండపెండేరం తొడిగినప్పుడు టీవీలో చూసిన సన్నివేశం వారి మదిలో మెదిలింది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఎవరికి వారు ఆశ పడుతున్నారు.
ఈ ఆలోచనల నుంచి వారు పూర్తిగా తేరుకోకముందే లాయర్ అందులో ఏముందో చదివి వినిపించారు. భయ్యాగారు రాసినట్లు డాబా ఇంటిని జిల్లా గ్రంథాలయ సంస్థకు అప్పజెప్పాలి. తనకు ఎవరైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో వారికి తన కావిడిపెట్టె కానుకగా అందజేయాలని పేర్కొన్నారు. అది కూడా దశ దిన కర్మ రోజు వారికి స్వాధీనపరచాలని స్పష్టంగా రాశారు.నేనూ ఆయన అభిమానులూ అందరం పెద్దగా చప్పట్లు చరిచాం.‘భయ్యాజీ అమర్ రహే’ అని కొందరు, ‘కలం సలాం’ అని ఇంకొందరు జేబుల్లోంచి పెన్నులు తీసి పైకెత్తి పట్టుకుని నినదించారు.అంతా పెద్దాయన దొడ్డ మనసుకు జోహార్లర్పించి అభినందిస్తుంటే ఆ నలుగురు బంధువుల ముఖాలు ఫిల్మంటు తెగిన బల్బుల్లా మాడిపోయాయి.
‘ఇంతకీ విల్లు రిజిస్ట్రీ గట్రా చేశారా?’ ఒకాయన అడిగాడు..‘రిజిస్టర్ చేశారండి.. ఇవిగో చూడండి’.. అంటూ స్టాంపు పేపర్లు అందరికీ చూపించాడు విశ్వనాథ్. పనిలో పనిగా జిరాక్సు కాపీ సెట్టొకటి ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా వారంతా టీమ్ మీటింగు పెట్టుకున్నారు. రహస్య మంతనాలు జరిపి తామంతా ఉమ్మడిగా అంత్యక్రియలు నిర్వహిస్తాం.. ఆ కావిడిపెట్టెను తమకివ్వాలని లాయర్‌ను అభ్యర్థించారు... డబ్బూదస్కం, గండపెండేరాల్లాంటి బంగారు వస్తువులు అందులో ఉంటాయని భావించి!ముందుచూపంటే అదే మరి... వెనకాల ఎవరో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.‘ఏం ముందుచూపో ఏమో... ముసలాడు ఘటికుడే.
గట్టిగానే మెలికపెట్టాడు. ఎంతైనా రచయిత కదా! ఇంకొక డైలాగు గుంపులోంచి వినిపించింది.లాయర్ ఏం చెబుతారా అని అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సరే.. ఏం చేద్దాం.. చెప్పండి సార్.. నలుగురు బంధువులు లాయర్ వంక తేరిపార చూశారు.‘భయ్యాగారికి దూరపు బంధువులాయె.. మీరు దహనక్రియలు నిర్వహిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది’ అని చెప్పగానే ఆనందంతో ఎగిరి గంతేయాలనుకున్నారు. మరీ అతి చేసినట్లవుతుందని భావించి ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అభిమానులంతా కార్యకర్తల్లా ముందుకొచ్చి ఏర్పాట్లు చకచకా చేసేశారు. అంతిమయాత్ర శకటాన్ని పచ్చిపూలతో అందంగా అలంకరించారు.
ఆయన పుస్తకాల తాలూకు కవర్ పేజీ ఫొటోలతో ఫ్లెక్సీలు ముద్రించి వ్యాన్ చుట్టూ తోరణాల్లా కట్టారు. నగరంలోని ప్రముఖులతోపాటు పాటు పొరుగూళ్ల నుంచి వచ్చిన కవులు, రచయితలు కొంత దూరం భయ్యా పాడె మోశారు. ఆ తర్వాత భౌతికకాయాన్ని వ్యానెక్కించారు. పెళ్లికొడుకును ఊరేగించినట్లు ఊరేగించగా... సాహితీ లోకమంతా ఆయన వెంట కృష్ణలంకలోని మరుభూమి వరకు నడిచింది.ఆ విధంగా భయ్యాగారి అంతిమ సంస్కారం అంగరంగ వైభవంగా ముగిసింది. మరుసటి రోజు అన్ని పత్రికల్లోనూ ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ఆరోజు భయ్యాగారి పెద్దకర్మ. ఇంటి వద్దే ఏర్పాటుచేశారు. బీరకాయ పీచు చుట్టాలు కర్మకాండలకు కావాల్సినవన్నీ సమకూర్చారు.
అన్ని రకాల దానాలు ఘనంగా జరిపించారు. వచ్చిన వారందరికీ పెన్నులూ, పుస్తకాలు పంచిపెట్టారు. నభూతో నభవిష్యతి అన్నట్లు పసందైన విందు భోజనం పెట్టారు.జనం తిరునాళ్లలా వచ్చి పోతున్నారు. సాయంత్రం నాలుగింటి వరకు తింటూనే ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు లాయర్ విశ్వనాథ్ ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు అన్ని చానళ్లలో స్క్రోలింగ్ వస్తోంది. ఆ వీలునామాలో ఏముందోనని అందరూ టీవీలకు అతుక్కుపోయారు. భయ్యా ఇంటి వద్దా అదే పరిస్థితి. అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆ నలుగురిలో ఇద్దరు చేతి గడియారం వంక పదేపదే చూసుకుంటున్నారు. మరో ఇద్దరికి వాచీ లేదేమో సెల్‌ఫోన్లో టైం చూసుకుంటూ గోళ్లు కొరుక్కుంటున్నారు. సాయంత్రం ఐదు గంటలు... లాయర్ విశ్వనాథ్ మీడియా సమావేశం ప్రారంభించారు. గుండుసూది కిందపడినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది వాతావరణం.
భయ్యా గురించి నాలుగు మంచి మాటలు చెప్పి.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకుని నివాళులర్పించారు. అనంతరం పెద్దాయన కోరిక మేరకు కావిడి పెట్టె తాళం చెవిని మీడియా సమక్షంలో ఆ నలుగురు బంధువులకూ అప్పచెప్పడంతో అప్పగింతల తంతు ముగిసింది.లోపల ఏముందో చూడాలని తెగ ఆరాటపడిపోతున్నారంతా. చానల్స్ కెమెరాలన్నీ కావిడిపెట్టె వైపే చూస్తున్నాయి. గురునాథం తాళం తెరిచాడు. కెమెరాలు ముందుకొచ్చాయి .. మూత పైకి లేవనెత్తాడు. కెమెరాలు జూమ్ చేసేశారు. అందరూ ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. లోపల భయ్యాగారు ప్రచురించిన పుస్తకాలు, శాలువాల దొంతర, మరికొన్ని జ్ఞాపికలు, సర్టిఫికెట్లు బూజుపట్టి దర్శనమిచ్చాయి. అతి కష్టం మీద అన్నింటినీ వెలికితీసి దుమ్ము దులిపారు. అందరూ ఊహించిన డబ్బుగాని, నిధిగాని అందులో లేదు. నలుగురూ కంగుతిన్నారు. ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోక స్థాణువుల్లా నిలబడిపోయారు.
ఒకటికి రెండుసార్లు కార్లేసుకుని బెజవాడ వచ్చినందుకు అయిన పెట్రోలు ఖర్చు, హోటల్ ఖర్చు, పెద్దకర్మ ఖర్చులు.. అన్నీ ఒక్కొక్కటిగా మదిలో మెలిగాయి. అబ్బో చేతిచమురు గట్టిగానే వదిలింది.. అని తెగ బాధపడిపోయారు.ఏదో లప్ప వస్తుందని ఆశపడి ఇంత దూరం వచ్చి ఇన్ని పాట్లు పడితే .. ఇత్తడి తాళం కప్ప దక్కిందని బావురుమన్నారు. సమయమూ డబ్బూ రెండు వృథా చేసుకుని ప్రయాస పడ్డామని ఎవరికి వారే ఘొల్లుమన్నారు.టీవీ యాంకర్లు నలుగురి ముఖాల ముందు గొట్టాలు పెట్టి స్పందన తెలియజేయాలని అడుగుతుంటే.. ఎవరి ముఖంలోనూ నెత్తుటి చుక్క లేదు. ఏడుపొక్కటే తక్కువ!

∙చెన్నాప్రగడ శర్మ


