నవతరం నయా ట్రెండ్‌ ‘వీ’ ట్యూబింగ్‌.. ఇంతకి ఏంటది?

VTubing Is A Fresh Evolution Of Live Streaming Virtual YouTuber - Sakshi

మన దేశంలో టాప్‌ యూట్యూబర్స్‌ ఎవరు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘వీట్యూబర్స్‌ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం రాకపోగా ‘ఇంతకీ వారు ఎవరు?’ అనే ఎదురు ప్రశ్న ఎదురుకావచ్చు. జపాన్‌లో మంచి ఆదరణ ఉన్న వీట్యూబింగ్‌ (వర్చువల్‌ యూట్యూబ్‌ స్టార్స్‌) మన దేశంలోకి ప్రవేశించింది. పాపులర్‌ కావడానికి రెడీగా ఉంది...

వెండిరంగు జుట్టు, వెరైటీ కళ్లద్దాలతో ఆకట్టుకునే జాక్‌నిఎక్స్‌ తన యూట్యూబ్‌ చానల్‌లో పాపులర్‌ వీడియో గేమ్స్‌ ఆడుతుంటాడు. జాక్‌నిఎక్స్‌కు ఎంతోమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అతడి ఆటను, మాటను అమితంగా ఇష్టపడుతుంటారు. నిజానికి జాక్‌నిఎక్స్‌ నిజం కాదు. దక్షిణాదికి చెందిక ఒక స్టూడెంట్‌ సృష్టించిన డిజిటల్‌ అవతార్‌!
మన దేశంలో 90కి పైగా వీట్యూబ్‌ అవతార్స్‌ ఉన్నాయి. సాధారణంగా వీట్యూబ్‌ అవతార్స్‌ జపనీస్‌ యానిమేషన్‌ స్టైల్‌ ఫీచర్స్‌తో కనిపిస్తుంటాయి. ‘వీట్యూబింగ్‌’  అనేది 2016లో జపాన్‌కు పరిచయమైంది. స్ట్రీమ్‌గేమ్స్, ఇంటర్‌నెట్‌ ట్రెండ్స్, మ్యూజిక్, ఆర్ట్‌...ఇలా రకరకాల విభాగాల్లో వీట్యూబ్‌ అవతార్స్‌ వీక్షకులను వినోదపరుస్తున్నాయి. ‘వీట్యూబర్స్‌’ అనే పదం జపాన్‌లోనే పుట్టింది.

రికు తజుమితో జపాన్‌లో ‘వీట్యూబర్స్‌’ ట్రెండ్‌ అగ్రస్థాయికి చేరుకుంది. 26 సంవత్సరాల రికు తజుమి జపాన్‌లోని యంగెస్ట్‌ బిలియనీర్‌లలో ఒకరు కావడానికి కారణం ‘ఎనీ కలర్‌’ అనే స్టార్టప్‌. యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే 21 సంవత్సరాల వయసులో ఇచికర (శూన్యం నుంచి) అనే ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టార్టప్‌ను మొదలు పెట్టాడు రికు. ఆ తరువాత దీని పేరును ‘ఎనీ కలర్‌’గా మార్చాడు. వీట్యూబర్స్‌ ప్రపంచంలో ‘ఎనీ కలర్‌’ అగ్రస్థానంలోకి దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు.

‘ఏ న్యూ మ్యాజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌’ అనే నినాదంతో నిజజీవితానికి చెందిన వందమంది వర్చువల్‌ క్యారెక్టర్స్‌ను ఇది సృష్టించింది.
యూజర్స్, క్రియేటర్స్‌కు మధ్య సరిహద్దులు లేకుండా చేయడమే తన విధానం అని చెబుతోంది. ఎన్నో వీట్యూబర్స్‌ ఏజెన్సీలకు ‘ఎనీ కలర్‌’ మాతృసంస్థగా ఉంది.
‘కోవిడ్‌ సమయంలో మన దేశంలో ఊపందుకున్న వర్చువల్‌ యూట్యూబర్‌ ధోరణి మెయిన్‌స్ట్రీమ్‌ పాపులారిటీకి దగ్గరలో ఉంది’ అంటున్నాడు వీట్యూబర్‌ టాలెంట్‌ ఏజెన్సీ ‘ప్రాజెక్ట్‌ స్టార్‌స్కేప్‌’ ఫౌండర్‌ వేణు జీ జోషి.

‘వీట్యూబింగ్‌ అనేది ప్రైవసీని కాపాడుకోవడానికి, ముఖ్యంగా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. మీ ముఖం బాగాలేదు, మీ గొంతు బాగలేదు... వంటి విషపూరితమైన ట్రోలింగ్‌ నుంచి బయటపడవచ్చు. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ఏమో అనే సంశయం లేకుండా ధైర్యంగా కంటెంట్‌ను క్రియేట్‌ చేయవచ్చు’ అంటుంది అసలు పేరే ఏమిటో తెలియని దిల్లీకి చెందిన వర్చువల్‌ అవతార్‌ సకుర.
వర్చువల్‌ అవతార్స్‌ పరిచయం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక అవతార్‌ పరిచయం ఇలా ఉంటుంది: ‘రెండు వందల సంవత్సరాల వయసు ఉన్న ఈ బాలికకు అపారమైన మాంత్రిక శక్తులు ఉన్నాయి’

చాలామంది మోడల్స్‌ జపనీస్‌ యానిమేషన్‌ స్టైల్‌ డిజైన్‌లకు ప్రాధాన్యత ఇస్తుండగా కొందరు మాత్రం పురాణాలలోని చిత్ర విచిత్ర పాత్రలను ఎంచుకుంటున్నారు. 19 సంవత్సరాల వీట్యూబర్‌ ‘మియో’ సగం మనిషి, సగం భూతంతో కూడిన అవతార్‌ను సృష్టించుకుంది. కొందరు తమ అవతార్‌లకు తామే గొంతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం గొంతులో వైవిధ్యం కోసం వాయిస్‌ మాడ్యులేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇండియన్‌ వీట్యూబ్‌ కమ్యూనిటీస్‌ కోసం రెడిట్‌లో ప్రత్యేకమైన పేజీ నిర్వహిస్తున్న హర్ష్‌ ‘వీట్యూబర్స్‌’కు వీరాభిమాని. ‘వీట్యూబర్‌ను చూస్తే స్నేహితుడిని చూసినట్లుగానే ఉంటుంది. వారి షోలో భాగమైతే రియాలిటీ షోలో భాగమైనట్లు అనిపిస్తుంది’ అంటున్నాడు హర్ష్‌. అభిమానం, విశ్లేషణ సంగతి ఎలా ఉన్నా అప్‌కమింగ్‌ వీట్యూబర్స్‌ కోసం ‘వర్చువలిజం’లాంటి కంపెనీలు వచ్చాయి. వీట్యూబర్‌గా మారాలని, తమను తాము నిరూపించుకోవాలనే ఆసక్తి యూత్‌లో పెరిగింది.

ఇదీ చదవండి: చైతన్యపథం: గేమ్‌ఛేంజర్‌.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top