
దృష్టి లోపం ఉన్న వ్యక్తులు పరిసరాలను నావిగేట్ చేయడానికి ప్రత్యూష, ఐశ్వర్య ‘స్పేస్‌ఫెల్ట్’ అనే పేరుతో అప్లికేషన్‌ను రూపొందించారు. దృష్టి లోపం సమస్యతో బాధపడిన ప్రత్యూష, ఐశ్వర్యలు కలిసి ఈ అప్లికేషన్‌ను రూపొందించారు. హైదరాబాద్‌లో గ్రెయల్ మేకర్ ఇన్నోవేషన్ ద్వారా వీరు తమ సేవలను నాలుగేళ్లుగా అందిస్తున్నారు. పిల్లలు ఇంట్లోనే ఉండి చూపును పెంచుకునేందుకు, వారి తల్లిదండ్రులకు ‘విజన్ నానీ డిజిటల్ యాప్’ ద్వారా పనులను సులభతరం చేస్తున్నారు.
దృష్టి లోపం ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సాంకేతికంగా ఉపయోగపడేలా తమ జీవన ప్రయాణాన్ని మార్చుకున్నారు స్పేస్‌ఫెల్ట్, విజన్ నానీ యాప్ ఫౌండర్స్ ప్రత్యూష, ఐశ్వర్య.
పిల్లల మెరుగైన భవిష్యత్తుకు
తమ వర్క్ గురించి ప్రత్యూష మాట్లాడుతూ – ‘‘కార్టికల్ విజువల్ ఇంపెయిర్‌మెంట్ ఉన్న పిల్లలు, ఏదైనా కారణాల వల్ల మెదడు పనితీరులో లోపాలు ఉన్నా వారు చూసింది త్వరగా అర్థం చేసుకోలేరు. చదువుతో పాటు జీవనంలో వెనకబడి పోతుంటారు. ఇలాంటప్పుడు వారి తల్లితండ్రులు స్పెషల్ సెంటర్స్ కోసం వెతుకుతుంటారు. హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రధాన పట్టణాలలోనే ఈ సెంటర్లు, అవీ చాలా తక్కువ శాతంలో ఉంటాయి. అలాంటి తల్లితండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఉన్న చోటును వదులుకొని నగరాలకు వలస వెళ్లాల్సి ఉంటుంది.
దీనివల్ల వారి కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతుంటుంది. అందుకని, ‘విజన్ నానీ’ పేరుతో దృష్టి లోపం ఉన్న పిల్లల కోసం డిజిటల్ ప్రోడక్ట్‌ను రూపొందించాం. తమ ఇంటినుంచే బాల్య అంధత్వానికి కారణమేంటో తెలుసుకునేలా, వారికి సరైన మార్గదర్శకం చూపేలా దీనిని తయారుచేశాం.దీనిని తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. కమ్యూనిటీ సెంటర్లలో కూడా వీటిని ఉపయోగిస్తున్నాం. తల్లిదండ్రులకు, సంరక్షకులకు, స్పెషల్ టీచర్స్‌కు అనుకూలమైన విజన్ థెరపీ యాక్సెస్‌ను కూడా ఈ యాప్ అందిస్తుంది.
స్వయంగా అర్థం చేసుకొని...
చిన్నప్పుడు నేను చూపు సమస్యలను ఎదుర్కొన్నాను. దీంతో చదువులో వెనకబడేదాన్ని. మా అమ్మ నా సమస్యను నివారించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. పెద్దయ్యాక నాలాంటి వారికోసం ఉపయోగపడే పనిచేయాలని అనుకునేదాన్ని. అందుకే ఎంతో కష్టపడి పట్టుదలతో ఐఐటీ హైదరాబాద్‌లో బయోటెక్నాలజీ డిగ్రీ చేశాను. విజన్ సమస్య ఉన్నవారు టెక్నాలజీ ఉపయోగించడంతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలని, ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో వాలెంటీర్‌గా చేరాను. అక్కడ దృష్టి లోపంతో వచ్చే పిల్లల సమస్యలను స్వయంగా చూస్తూ అర్థం చేసుకునేదాన్ని.
వాస్తవానికి విజన్ థెరపీకి 3–5 ఏళ్ల వరకు క్రమం తప్పకుండా రావాలి. కానీ, తల్లిదండ్రులకు కుదరక మిస్ చేసేవారు. దీంతో వారి సమస్య అలాగే ఉండేది. ఇంటి నుంచే వారి సమస్యను పరిష్కరించే విధానం ఉంటే బాగుంటుందనుకున్నాం. ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఐశ్వర్య పరిచయం అయ్యింది. తను 18 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్ వల్ల చూపు కోల్పోయింది. కోలుకున్నాక చూపు లేని వారికి సాయం చేయాలనుకుంది. తను ఎదుర్కొన్న సంఘటనలను, తనకు ఎదురైన అనుభవాలను తెలుసుకొని, ఈ డిజిటల్ ప్రోడక్ట్‌ని డెవలప్ చేశాం. ఇప్పటి వరకు 7000 మంది పిల్లలు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దేశంలోని అన్నిప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా ఈ యాప్‌కి యూజర్స్ ఉన్నారు.
పబ్లిక్ ప్లేసులో క్యూఆర్
చూపులేని వారిని బయటకు తీసుకెళ్లినప్పుడు, అక్కడ పబ్లిక్ వాష్‌రూమ్ వరకు ఒకరు తోడుగా వెళ్లినా, ఆ డోర్ వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. కానీ, వారు వాష్ రూమ్‌లో చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు యాప్‌లోని క్యూఆర్ కోడ్ (మనీ పే యాప్స్ ఏ విధంగా వాడతారో అలా)ని ఉపయోగించి, లోపల వాష్‌రూమ్‌లో ఏ వస్తువులు ఎక్కడ, ఏ డైరెక్షన్‌లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇదేవిధంగా పబ్లిక్ ప్లేస్‌లో ఉన్న లొకేషన్స్, ఆడియో విని, ఎవరి సాయం లేకుండానే వాటిని ఉపయోగించవచ్చు. మ్యూజియంకు వెళితే చూపులేనివారికి అక్కడ ఏమీ తెలియదు. యాప్ క్యూఆర్ కోడ్ ను ఉపయోగిస్తే ఆడియో విని అక్కడి స్టోరీ తెలుసుకోవచ్చు. దీనిని లాంచ్ చేసింది చూపులేనివారికోసమే అయినా ఇప్పుడు ఈ యాప్ మిగతావారికీ ఉపయోగపడుతోంది. హైదరాబాద్‌లో ఉన్న అభయ స్వచ్ఛంద సంస్థ, ఎల్.వి.ప్రసాద్ వారితో కలిసి వర్క్ చేస్తున్నాం’’ అని వివరించారు ఈ యాప్ డెవలపర్.
సమస్యకు పరిష్కారం
నాకు సమస్య ఉన్నప్పుడు మా అమ్మ నాకు చాలా సాయంగా ఉన్నారు. అందరికీ ఆ స పోర్ట్ ఉండక పోవచ్చు. వాలెంటీర్‌గా చేసినప్పుడు అక్కడికి వచ్చిన పిల్లలను చూసి చాలా బాధనిపించేది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ప్రగతి సాధిస్తున్నాం. కానీ, మన పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యను తీర్చలేక పోతున్నాం అనిపించింది. టెక్నాలజీని ఉపయోగించే దృష్టి లోపంతో బాధపడుతున్నవారికి పరిష్కారం కనుక్కోవాలని ఈ యాప్‌ను తీసుకువచ్చాం.
– ప్రత్యూష
పనులు సులువయ్యాయి
దృష్టిలోపంతో జీవిస్తున్న వ్యక్తిగా నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంటో నాకు బాగా తెలుసు. నాలాంటి వారు ఆ సమస్యలను ఎదుర్కోకూడదు అనే ఆలోచన నుంచి ఈ యాప్‌ని డిజైన్ చేశాం. పబ్లిక్ టాయిలెట్లు, మ్యూజియం.. మొదలైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు వారు ‘క్యూఆర్’ కోడ్ సాయంతో ఇబ్బందులు లేకుండా సందర్శించవచ్చు. పిల్లల్లో కంటి సమస్య ఉన్నవారి పేరెంట్స్‌కి ఇప్పుడు వర్క్ సులువుగా మారింది. అదే విషయాన్ని రివ్యూస్ ద్వారా తల్లిదండ్రులు తెలియజేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది.
– ఐశ్వర్య
– నిర్మలారెడ్డి