ట్రాన్స్‌... అప్‌డేట్‌ వెర్షన్‌

Trans News magazine into the world of transgender community - Sakshi

చలం స్త్రీవాద రచయిత. ఇప్పుడు లేరు. ఆయన రచనలు, కోట్స్‌ ఉన్నాయి. ‘‘స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి..’’ అనేది చలంగారి పాపులర్‌ కోట్‌. శరీరం, మెదడు, హృదయం ఈ మూడూ ట్రాన్స్‌జెండర్‌లకు కూడా ఉన్నాయని ప్రియా బాబు అంటున్నారు! తమిళనాడు మదురైలో ఉండే ఆయన.. చలం రచనల్ని చదివి ఉండకపోవచ్చు. అయితే తనూ ఒక ట్రాన్స్‌జెండర్‌ కావడంతో తనలాంటి వారి మనసును చదవగలిగారు. ట్రాన్స్‌ జెండర్‌లకు అవసరమైన వ్యాయామం, జ్ఞానం, అనుభవం ఇచ్చే ఒక పత్రికను నడుపుతున్నారు. ఆ పత్రిక పేరు.. ‘టాన్స్‌ న్యూస్‌’.

‘ట్రాన్స్‌ న్యూస్‌’ పక్షపత్రిక. ప్రింట్‌లో రాదు. డిజిటల్‌లో వస్తుంది. గత ఏడాది నవంబర్‌లో పత్రిక ప్రారంభమైంది. ఇప్పుడా పత్రికకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ పత్రికను పెట్టిన ప్రియ కన్నా ఎక్కువగా! అందులో అప్‌డేట్‌ న్యూస్‌ ఉంటాయి. బ్యూటీ టిప్స్‌ ఉంటాయి. స్కిన్‌ కేర్‌ గురించి ఉంటుంది. ఇంకా ఆరోగ్యం, గృహాలంకరణ.. ఇలాంటివన్నీ. స్త్రీల కోసం పత్రికలు ఏవైతే ఇస్తుంటాయో ట్రాన్స్‌ మహిళల కోసం ‘ట్రాన్స్‌ న్యూస్‌’ అవన్నీ ఇస్తుంటుంది. ఇంకా.. ట్రాన్స్‌ ఉమెన్‌ తయారు చేసిన ఉత్పత్తులకు ఈ పత్రిక మార్కెటింగ్‌ కల్పిస్తుంది. ఉద్యోగావకాశాల సమాచారాన్ని కూడా అందజేస్తుంది. ‘టాన్స్‌ న్యూస్‌’ పత్రికను ఒక మనిషి అనుకుంటే ఆ మనిషి ఆత్మ ప్రియా బాబు. ఆమెకు 50 ఏళ్లుంటాయి. ఎవరైనా తనని ‘ఆమె’ అని పిలవడానికే అతడు ఇష్టపడతారు. కనుక మనమూ ప్రియ అనే చెప్పుకుందాం.
∙∙
ప్రియ ‘ట్రాన్స్‌ ఉమన్‌’. యాక్టివిస్ట్, కౌన్సెలర్‌.. ఇప్పుడిక మ్యాగజీన్‌ ఎడిటర్‌. ఆరేళ్ల క్రితం ప్రియ, ముగ్గురు స్నేహితులు కలిసి ముదురైలో ‘ట్రాన్స్‌ జెండర్‌ రిసోర్స్‌ సెంటర్‌’ స్థాపించారు! 2017లో లాభార్జన ధ్యేయం లేని సంస్థగా ఆ సెంటర్‌ రిజిస్టర్‌ అయింది. అందులో ట్రాన్స్‌ జెండర్‌ల న్యూస్‌ పేపర్‌ క్లిప్పింగులు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్ములు, ప్రభుత్వ విధానాలు, జీవోలు ఉంటాయి. ట్రాన్స్‌ జెండర్‌లు ఈ రిసోర్స్‌నంతటికీ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. రిసోర్స్‌ సెంటర్‌కు చక్కటి ఆదరణ లభించడంతో గత నవంబర్‌ 1న ‘ట్రాన్స్‌ న్యూస్‌’ అన్‌లైన్‌ పత్రిక కూడా మొదలైంది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జనం తమనెంత చిన్నచూపు చూస్తుంటారో ఎవరైనా అడిగినప్పుడు చెప్పడం తప్పితే అదే పనిగా చెప్పరు ప్రియ.ఆమె బిజీలో ఆమె ఉంటారు. ప్రియ చదువు ఇంటర్‌ మధ్యలోనే ఆగిపోయింది. తోటి విద్యార్థుల మాటలు, చూపులు పడలేక ఆమె కాలేజ్‌కి వెళ్లడం మానేశారు. ఆ సమయంలోనే తమిళ రచయిత సూ.సమిథిరం ఓ ట్రాన్స్‌ఉమన్‌ యాక్టివిస్టుపై రాసిన ‘వాడమల్లి’ అనే పుస్తకం చదివారు.

అది చదివాక, తనూ ట్రాన్స్‌ ఉమెన్‌ కోసం ఏదైనా చేయాలని బలంగా అనుకున్నారు. ఫలితమే రిసోర్స్‌ సెంటర్, పత్రిక. మనసులో మాట చెప్పుకోడానికి కూడా ట్రాన్స్‌ ఉమెన్‌కు రిసోర్స్‌ సెంటర్‌ తోడ్పడింది. పాఠశాలలో సెమినార్‌లు నిర్వహించింది. మంచి మంచి వక్తల చేత మాట్లాడించింది. అవన్నీ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పత్రికలోనైతే ఇప్పుడు ట్రాన్స్‌ ఉమెన్‌ మోడలింగ్‌ ఫొటోలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సంచికల్లో 13 మంది ట్రాన్స్‌ ఉమెన్, ఇద్దరు ట్రాన్స్‌మెన్‌ ఫొటోలు వేశారు. తాజాసంచికలో మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన భుజారియా ట్రాన్స్‌జెండర్‌ ఉత్సవాలను గురించి ప్రముఖంగా వేశారు. ఇండియాలో తొలి ట్రాన్స్‌జెండర్‌ న్యూస్‌ రీడర్‌ పద్మినీప్రకాశ్‌ గురించి రాశారు. ట్రాన్స్‌ ఆంట్రప్రెన్యూర్‌ జీవా రెంగరాజ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే జుట్టు రాలకుండా కొన్ని టిప్స్‌ కూడా. ప్రియ తమిళ్‌ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించగలరు. ఆ విద్య ఆమెకు చాలావరకు పత్రికను అప్‌డేట్‌ చెయ్యడంతో తోడ్పడుతోంది. తమిళ్, ఇంగ్లీషు.. రెండో భాషల్లో వస్తున్న ఈ డిజిటల్‌ మ్యాగజీన్‌కు వీక్షకుల సంఖ్య కూడా బాగానే ఉంది.
∙∙
ప్రియ ఎడిటర్‌ అయితే ఆమె కింద ఐదుగురు రిపోర్టర్‌లు, ఐదుగురు ఇంటెర్న్‌లు ఉన్నారు. వాళ్లంతా ట్రాన్స్‌ ఉమనే. పత్రిక నడపడానికి అవసరమైన ఫండింగ్‌ను ఇచ్చేందుకు ‘హై–టెక్‌ అరై’ అనే ఆయిల్‌ సీల్‌ను ఉత్పత్తి చేసే సంస్థ ముందుకు వచ్చింది. అది దీర్ఘకాల హామీ. ఎన్నాళ్లు ‘ట్రాన్స్‌ న్యూస్‌’ వస్తే అన్నాళ్లూ ఫండ్స్‌ వస్తుంటాయి. ఫండ్స్‌ అంటే పెద్దగా ఏం అవసరం లేదు. జీతాలు, ఆఫీస్‌ అద్దె. వ్యాపార ప్రకటనలైతే ఇంకా రావడం మొదలు పెట్టలేదు. అవొస్తే తమకు ఆర్థికంగా బాగుంటుందని ప్రియ ఆశిస్తున్నారు. పత్రిక చందా ఉచితం. త్వరలోనే హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా ‘ట్రాన్స్‌ న్యూస్‌’ తీసుకురానున్నామని చెబుతున్న ప్రియ బాబు తన గురించి చెప్పుకోడానికి మాత్రం ఆసక్తి చూపరు. ‘మా జీవితాలన్నీ ఒకేలా ప్రారంభం అవుతాయి. వాటి గురించి చెప్పవలసింది ఏముంటుంది?’ అని నవ్వేస్తారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top