
ఇది వానాకాలం...సిటీలో ఉన్నవారికి ఈ సీజన్‌లో ఏవేవో గుర్తు రావచ్చు గానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి మాత్రం వెంటనే గుర్తొచ్చేవి, వారిని అప్రమత్తం చేసేవి పాములు అని చెప్పాలి. ఈ సమయంలో పాములు పొలాల్లో నుంచి ఇళ్లలోకి కూడా ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్రామీణులు, నగర శివార్లలో ఉన్నవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సందర్భంగా అసలు ప్రపంచంలో పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలు ఏవేవి? ఎన్నెన్ని జాతులు పాములు ఉన్నాయి? మన దేశం ఏ స్థానంలో ఉంది? ఒక్కసారి పరిశీలిస్తే...
పాముల సంఖ్యలో తొలిస్థానం మెక్సికో దేశం దక్కించుకుంటోంది. ఈ దేశంలో దాదాపుగా 400కిపైగా సర్ప జాతులు ఉన్నట్టు అంచనా. వీటిలో రాటిల్ స్నేక్స్, కోరల్ స్నేక్స్, బోవా పాములు వంటివి ఉన్నాయి.
పాముల సంఖ్యలో 2వ స్థానాన్ని దక్కించుకుంది బ్రెజిల్. అయితే జాతుల రీత్యా చూస్తే ఈ దేశంలో 420కిపైగా పాములు ఉన్నట్టు లెక్కించారు. వీటిలో చెట్లలో నివసించే వాటి నుంచి అనకొండ వంటి భారీ సర్పాల వరకూ ఉన్నాయి.
ఈ జాబితాలో ఇండోనేసియా 3వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో సముద్ర సర్పాలు, పైథాన్స్ వంటి రకాలతో కూడిన 376 సర్ప జాతులకు ఈ దేశం నిలయంగా ఉంది.
పామును దైవంగా కొలిచే కోట్లాది మంది ప్రజలున్న మన భారత దేశం ఈ లిస్ట్‌లో 4వ ప్లేస్ దక్కించుకుంది. కోబ్రాలు, పచ్చని పల్లి పాములు, క్రైట్స్ సహా 305 సర్ప జాతులు మన దేశంలో ఉన్నాయట.
దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలకు చిరునామా అయిన కొలంబియా మన తర్వాత 5వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో మొత్తం 305 రకాల స్నేక్ వెరైటీలు ఉన్నాయి. బుష్ మాస్టర్స్, కోరల్ స్నేక్స్ వంటి పాముల జాతులకు ఈ దేశం పేరొందింది.
జనాభాలో నెం2గా ఉన్న చైనా పాముల జనాభాలో 6వ స్థానం చేజిక్కించుకుంది. పిట్ వైపర్స్ వంటి అరుదైన జాతులతో సహా 246 వెరైటీలు చైనాలో ఉన్నాయి.
సైజులో చిన్న అయినా పాముల పాప్యులేషన్‌లో పెద్ద దేశాల సరసన చోటు సంపాదించింది ఈక్వడార్. ఈ దేశంలో అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్, క్లౌడ్ ఫారెస్ట్స్ వంటివి పాముల నిలయాలుగా మారి 241 సర్పజాతులకు ఈ దేశాన్ని అడ్రెస్‌గా మార్చాయి.
మొత్తం 226 సర్ప జాతులతో వియత్నాం 8వ స్థానం అందుకుంది. కోబ్రాలు, కీల్ బ్యాక్స్ వంటి వెరైటీలతో ఈ దేశంలోని అడవులు సర్ప నిలయాలుగా పేరొందాయి.
ప్రకృతి సౌందర్యంతో, పర్యాటకుల ఆకర్షణలో ముందున్న మలేషియా 9వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో రంగురంగుల పాములు ప్రత్యేక ఆకర్షణ. మొత్తంగా 216 స్నేక్ వెరైటీలు ఉన్నాయట.
టాప్ 10లో చివరి దేశంగా నిలిచిన ఆస్ట్రేలియాలో 215 సర్పజాతులు ఉన్నాయని లెక్కించారు. అత్యంత ప్రమాదకరమైన టైపాన్స్, బ్రౌన్ స్నేక్స్, టైగర్ స్నేక్స్‌కు ఈ దేశం కేరాఫ్‌గా ఉంది.