Men's Hockey: ‘మా ఇంటిని.. నా కొడుకు చేతిలోని హాకీ స్టిక్‌ నిలబెట్టింది’

Tokyo Bronze Medal Hockey Team Players Mothers And Family Celebrations - Sakshi

కొడుకు ఫీల్డ్‌లో పరిగెడుతుంటే అమ్మ గుండెలు పరిగెడతాయి. కొడుకు చెమటలు కక్కుతుంటే అమ్మ కళ్లు కన్నీరు చిందుతాయి. అమ్మ రెండు చేతులు ఎప్పుడూ కొడుకు విజయం కోసమే కదా ప్రార్థిస్తాయి. 41 సంవత్సరాల తర్వాత హాకీలో విజయం సాధించిన భారత జట్టు వెనుక ఉన్నది ఈ దేశమే కావచ్చు. కాని వారి తల్లులు కూడా. దేశం కోసం గెలిచిన కొడుకులను చూసి చూపుడు వేలికి కాటుక రాసుకుని దిష్టి చుక్క పెట్టడానికి ఎదురు చూస్తున్నారా తల్లులు. సంతోషంతో తబ్బిబ్బవుతున్నారని వేరే చెప్పాలా?

పంజాబ్‌ క్రీడా శాఖామంత్రి గుర్‌మిత్‌ సింగ్‌ సోధి తమ రాష్ట్రం నుంచి హాకీ టీమ్‌లో ఉండి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ప్రతి ఒక్క సభ్యుడికి కోటి రూపాయలు అనౌన్స్‌ చేసి వారు రావడంతోటే చెక్‌ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.కాని ఆ కోటి రూపాయల సంగతి తర్వాత. జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ మాత్రం తన తల్లి మంజిత్‌ కౌర్‌ చేసే ఆలూ పరాఠాల కోసం కాచుకుని ఉన్నాడు. భారతదేశం చేరుకుని ఇంటికి వచ్చిన వెంటనే అతడు తినాలనుకుంటున్నది తల్లి చేతి ఆలూ పరాఠానే. ‘నా కొడుకు కోసం స్వహస్తాలతో ఆలూ పరాఠాలు చేస్తా. ఆలుగడ్డ కూర కూడా చేస్తా’ అని ఆమె అంది. 

మన్‌ప్రీత్‌ ఇంటి బయట కోలాహలం
జలంధర్‌ జిల్లాలోని మిథాపూర్‌ అనే చిన్న ఊరు ఇప్పుడు సంతోషంతో కేరింతలు కొడుతోంది. మన్‌ప్రీత్‌ సింగ్‌ది ఆ ఊరే. అతనిదే కాదు... ప్రస్తుతం హాకీ టీమ్‌లో ఉన్న మరో ఇద్దరు కూడా ఆ ఊరివారే. అందుకే దానిని ‘ఒలింపిక్‌ గ్రామం’ అని అంటారు. కాంస్యం కోసం జర్మనీతో హోరాహోరి పోరు గురువారం జరుగుతున్నప్పుడు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ తల్లి చేత హాకీ బ్యాట్‌ పట్టుకుని ఇరుగుపొరుగు వారితో కలిసి ఇంట్లో ఉత్కంఠగా మేచ్‌ చూసింది.

కుటుంబసభ్యులతో కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌, గ్రౌండ్‌లోమన్‌ప్రీత్‌సింగ్‌
‘ఈ బ్యాటే నా కొడుకును అంత దూరం తీసుకెళ్లింది’ అందామె మేచ్‌ గెలిచాక ఉద్వేగపడుతూ. మేచ్‌ మొదలయ్యే ముందు మన్‌ప్రీత్‌ తల్లికి వీడియో కాల్‌ చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ‘బాగా ఆడు నాన్నా... కాని జర్మనీని తక్కువ తీస్కోవద్దు’ అని హెచ్చరించింది ఆమె. ‘వాహె గురు నా ప్రార్థనలు ఆలకించాడు. గురుద్వార్‌ వెళ్లి ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు చేస్తాను’ అని చెప్పిందామె. 2016లో మన్‌ప్రీత్‌ తండ్రి మరణించాడు. అప్పటి నుంచి తల్లే మన్‌ప్రీత్‌ ఆటకు వెన్నుదన్నుగా ఉంది. అతణ్ణి ముందుకు తీసుకెళ్లింది. తన శ్రమ ఫలించిన సంతృప్తి ఆమె కళ్లల్లో కనిపించింది.

ఉంగరం కానుక
ఇక మరో ఆటగాడు హార్దిక్‌ సింగ్‌ తల్లి కన్వల్‌జిత్‌ కౌర్‌ కొడుకు కోసం ఒలింపిక్‌ రింగ్స్‌ను పోలిన బంగారు ఉంగరం చేయించి సిద్ధంగా ఉంది. ‘నా కొడుకు విజయానికి నేనిచ్చే కానుక ఇది’ అని ఆ తల్లి చెప్పింది. 22 ఏళ్ల మిడ్‌ఫీల్డ్‌ ఆటగాడు హార్దిక్‌ సింగ్‌ ఒలింపిక్స్‌ జట్టులో ఎంపికైయ్యాక అతని తమ్ముడు ‘అన్నయ్యా... మన కారు మీద ఒలింపిక్స్‌ లోగో వేయించేదా’ అని అడిగాడు. దానికి హార్దిక్‌ ‘ఇప్పుడే వద్దురా. టైమ్‌ వచ్చినప్పుడు చెప్తాను’ అని జవాబు ఇచ్చాడు. ‘ఇప్పుడు ఆ టైమ్‌ వచ్చింది. నా కొడుకు కారు మీద ఒలింపిక్స్‌ లోగో ఉంటుంది’ అని కన్వల్‌జిత్‌ కౌర్‌ తన చుట్టుపక్కల వారికి ఒకటి రెండు స్వీట్లు పంచుతోంది.

తల్లి ఉషతో గోల్‌కీపర్‌ శ్రీజేష్‌, ఆనందంలో శ్రీజేష్‌
గోడ కట్టిన కొడుకు
ఇక కొచ్చిలో హాకీ టీమ్‌ గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ ఇంటి దగ్గర హడావిడి అంతా ఇంతా లేదు. టపాకాయలు మోగిపోతున్నాయి. ‘కాంస్యమైతే ఏంటి... బంగారంతో సమానం’ అని శ్రీజేష్‌ తల్లి ఉషా అంది. వచ్చిపోయే వారిని, కొడుకు గొప్పతనం గురించి పొగుడుతున్నవాళ్లను ఎక్కడ దిష్టి తగులుతుందో అని కంగారుగానే వింటూ తబ్బిబ్బవుతోంది ఆమె. ‘నా కొడుకు శత్రువులకు అడ్డంగా గోడలా నిలబడ్డాడు’ అని ఆమె అంది. నిజంగానే జర్మనీతో సాగిన మేచ్‌లో గోల్‌ కీపర్‌గా శ్రీజేష్‌ ఎదుర్కొన్న వొత్తిడి తక్కువది కాదు. శ్రీజేష్‌ భార్య అనీషా ఆయుర్వేద డాక్టర్‌. ‘ఆయన రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను’ అంది సంబరంగా.

ఒరిస్సా వీరుడు
ఐదు మంది సంతానంలో చివరివాడుగా పుట్టిన ఒరిస్సా ఆటగాడు అమిత్‌ రోహిదాస్‌ ఇంటికే కాదు దేశానికి కూడా కీలకంగా మారడం అతడి తల్లిని గర్వపడేలా చేస్తోంది. ‘మేము పేదరైతులం. నా కొడుకే మా ఇంటిని నిలబెట్టాడు. నా కొడుకు చేతిలోని హాకీ స్టిక్‌ నిలబెట్టింది’ అని అతని తల్లి అంది. వాళ్ల  గ్రామం సౌనామోరా (రూర్కెలా నుంచి 120 కి.మీ) ఇప్పుడు అమిత్‌ తల్లిని ప్రశంసలతో ముంచెత్తుతోంది. కేవలం ప్లాస్టిక్‌ కుర్చీలు ఉన్న ఇంటిలో ఊపిరి బిగపట్టి మేచ్‌ చూసిన అమిత్‌ తల్లి గెలిచాక మురిసిపోయింది.

మరి కాసేపటికి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆమెతో మాట్లాడటం కూడా చిన్న అనుభవం కాదు. అన్నట్టు ఒరిస్సా ముఖ్యమంత్రి తమ రాష్ట్రం నుంచి కాంస్యం తెచ్చిన ప్రతి ఆటగాడికి రెండున్నర కోట్లు ప్రకటించారు. అమిత్‌కు కూడా ఆ నగదు కాచుకుని ఉంది. దానికంటే ముందు ఆ తల్లి ఆలింగనం కూడా.

తల్లిదండ్రులు తమ సంతానం కోసం జీవితాలను త్యాగం చేస్తారు. వాటిలో చాలామటుకు పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడతారు. పిల్లలు విజయం సాధించినప్పుడు ఆ త్యాగాలకు ఒక అర్థం దొరికి సంతృప్తిపడతారు. ఇవాళ భారత హాకీటీమ్‌లోని ప్రతి సభ్యుని తల్లిదండ్రులు ఈ అద్భుత సంతృప్తితో తల ఎత్తుకు తిరుగుతారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top