అక్షరాల... సినిమా బయోపిక్‌ | Telugu Actress Krishnaveni Book Mirzapuram Rani Krishnaveni Review | Sakshi
Sakshi News home page

మీర్జాపురం రాణి... కృష్ణవేణి

Mar 30 2026 3:50 PM | Updated on Mar 30 2026 4:38 PM

Telugu Actress Krishnaveni Book Mirzapuram Rani Krishnaveni Review

ప్రముఖుల జీవితకథలు పుస్తకాలుగా నిరంతర ఆదరణకు నోచుకుంటాయి. అందులోనూ వారు సినీ తారలైతే ఇక చెప్పేది ఏముంది! సినీ తారల పట్ల అందరికీ ఉండే ఆసక్తి అలాంటిది. సదరు సినిమా తార అనేక విధాలుగా ప్రథమశ్రేణిలో నిలిచిన వ్యక్తి అయితే, చారిత్రకంగానూ ఆ రచనకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి భారతీయ బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’ (1936)లో టైటిల్‌ రోల్‌ ధరించడంతో మొదలుపెట్టి, హీరోయిన్‌గా ఎదిగి, దర్శక – నిర్మాత మీర్జాపురం రాజా వారితో వివాహంతో మహారాణిగా మారి, స్వయంగా నిర్మాత అయి, శోభనాచలా సినీ స్టూడియో అధినేత్రిగా నిరూపించుకొని, నూరేళ్ళ నిండు జీవితం గడిపి, ఇటీవలే మరణించిన చిత్తజల్లు కృష్ణవేణి (1924 – 2025) జీవిత కథ అందుకనే ఆసక్తిగా అనిపిస్తుంది.

జీవితచరిత్రను సైతం కేవలం వివరాలు, విశేషాలను ఏకరవు పెట్టే రూపంలో కాకుండా, కాల్పనిక సాహిత్య మార్గంలో ఒక మంచి నవలను చదువుతున్న పద్ధతిలో అందించడం ఎప్పుడైనా ఆకర్షించే పద్ధతే. సమకాలీన రచయితలు కొందరు ఆ కోవలో అక్షరబద్ధం చేసిన జీవిత కథలు సాహితీ లోకానికి ఇప్పటికే సుపరిచితం. పైగా, రచయిత్రి పల్లవి రాసిన మహానటి సావిత్రి జీవితకథ ‘సావిత్రి’ లాంటివి గతంలో బెస్ట్‌ సెల్లర్స్‌ కావడమూ అందుకు నిదర్శనం. ఆ రకమైన రచనా సంవిధానంలో మెప్పించే మెరుపులు చాలానే ఉంటాయి కానీ, కొన్నిసార్లు... అసలు జరిగిన వాస్తవమేదో, కొసరు కవికల్పన ఏదో తెలియనంతగా పాలు, నీళ్ళు కలసినట్టు సాగిపోతాయి. వీలైనంత వరకు చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను పేర్కొంటూనే, సంఘటనను నాటకీయంగా చెప్పడంలో రచయిత నిజాయతీ, నైపుణ్యం రాణకెక్కుతాయి.  ఉత్తమ పత్రికా రచయితగా నంది అవార్డులు అందుకున్న సీనియర్‌ జర్నలిస్ట్‌ భగీరథ తన తాజా ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచనలో అక్షరాలా చేసినది అదే!

ఒక మంచి ఇతివృత్తం చేయి తిరిగిన వ్యక్తి చేతిలో పడినప్పుడు అది కొత్త సొబగులు సంతరించుకోవడం సహజం. రచయితగా, పత్రికా రచయితగా ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న భగీరథ ఈ రచనలో దాన్ని సమర్థంగా వినియోగించారు. ఇటీవల ఎన్టీఆర్‌పై ‘తారకరామం’, ‘శకపురుషుడు’ లాంటి పుస్తకాలు, అలాగే కృష్ణదేవరాయల కాలంపై రాసిన చారిత్రక నవల ‘నాగలాదేవి’ ద్వారా నవతరం పాఠకులకు సైతం ఆయన సుపరిచితులే. సినీ సుప్రసిద్ధుల జీవిత కథలు రాయడం కూడా ఆయనకేమీ కొత్త కాదు. గతంలో నటి జమున అంతరంగావిష్కరణ ‘జమునా తీరం’, భాగ్యనగర్‌ స్టూడియోస్‌ వ్యవస్థాపక అధినేత బాదం రామస్వామిపై ‘మహర్జాతకుడు’, హీరో జగపతి బాబు తండ్రి – ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్‌పై ‘దసరా బుల్లోడు’ లాంటి సినీ జీవిత కథలు ఆయన కలం నుంచి వచ్చి, అశేష ఆదరణకు నోచుకున్నాయి. 

ఇప్పుడు అలనాటి హీరోయిన్‌ కృష్ణవేణి కుమార్తె, ప్రముఖ నిర్మాత ఎన్‌.ఆర్‌. అనూరాధాదేవి పనుపున భగీరథ ఈ ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచన చేశారు. కృష్ణవేణి జీవితంతో పాటు ఆ సమకాలీన పరిస్థితుల్ని రచనలో ప్రతిబింబించేందుకు రచయిత కసరత్తు చేశారు. నిజానికి, నటుడు ఎన్టీఆర్‌ – సంగీత దర్శకుడు ఘంటసాల – సుస్వరాల రమేశ్‌ నాయుడు... ఇలా ఎందరో మహామహుల్ని సినీ రంగానికి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది.

చిన్న వయసులోనే తల్లి లేని బిడ్డగా సవతి తల్లితో ఇబ్బందులు పడడం, పిన్ని – బాబాయ్‌ వద్ద పెరగడం, రంగస్థలంపై ఆసక్తి పెరగడం, అప్పట్లో భానుమతి, రేలంగి, అంజలీదేవి సహా ఎందరినో స్టార్లుగా తీర్చిదిద్ది ‘తారాబ్రహ్మ’గా పేరొందిన సినీ దర్శక – నిర్మాత చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహం లభించడం, ఎనిమిది – తొమ్మిదేళ్ళ వయసులోనే తొలి బాలల చిత్రం ‘సతీ అనసూయ’లో టైటిల్‌ రోల్‌ పోషించడం, పితృసమానుడైన పుల్లయ్య గారి మీద అపార గౌరవంతో యర్రంశెట్టి కృష్ణవేణి కాస్తా చిత్తజల్లు కృష్ణవేణిగా మారడం, ఆ పైన హీరోయిన్‌గా రాణించడం, మీర్జాపురం రాజా వారు (మేకా వెంకట్రామయ్య అప్పారావు)తో వివాహం, భర్త జస్టిస్‌ పార్టీ అయితే తాను కాంగ్రెస్‌ సానుభూతిపరురాలిగా ‘మన దేశం’ (1949) లాంటి చిత్ర నిర్మాణం సాగించడం,  ‘కీలుగుర్రం’ – ‘గొల్లభామ’,  'లక్ష్మమ్మ' లాంటి బాక్సాఫీస్‌ హిట్‌ చిత్రాల రూపకల్పన లాంటి తొలినాళ్ళ సినీ చరిత్రలోని ఆసక్తికరమైన ఘట్టాలెన్నో ఈ రచనలో చదవవచ్చు. నిండు నూరేళ్ళు జీవించిన ఆమె ప్రస్థానంలోని అనేక ఘట్టాలను చదువుతుంటే... అచ్చంగా ఓ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేలా ఈ రచనా శైలి సాగుతుంది. ప్రతి సంఘటననూ దృశ్యమానమయ్యే రీతిలో రాయడంతో... ఒక రకంగా ఇది కాగితంపై అక్షరాలలో కనిపించే ఓ బయోపిక్‌ అనవచ్చు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ మొదలు ‘సాక్షి – ఎక్సలెన్స్‌ అవార్డ్‌’ (లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌) సహా ఎన్నో గుర్తింపులు పొందిన సి. కృష్ణవేణి జీవితకథ చదువుతుంటే... కేవలం ఓ వ్యక్తి జీవితంగా అనిపించదు. దాదాపు నూరేళ్ళ కాలగతిలో సమాజంలోనూ, సినిమాలోనూ వచ్చిన మార్పులు సైతం కళ్ళ ముందు రీళ్ళు తిరుగుతాయి. మహిళలను ద్వితీయశ్రేణి వ్యక్తులుగా చూస్తూ, సమాజం ఇంతగా పురోగమించని రోజుల్లోనే... కృష్ణవేణి సాగించిన జీవితం, సాధించిన విజయం అబ్బురపరుస్తాయి. ఇవాళ్టికీ ఎందరికో స్ఫూర్తిమంత్రంగా నిలుస్తాయి. 

అరుదైన ఫోటోలతో పాటు, అవి అందుబాటులో లేని కీలక ఘట్టాలకు రేఖాచిత్రాలను సుప్రసిద్ధ చిత్రకారుడు దాకోజు శివప్రసాద్‌తో ప్రత్యేకంగా గీయించడం ఈ 516 పేజీల రచనకు వన్నె తెచ్చింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అనేక అడ్డంకులున్న ఆ రోజుల్లోనే ఎంత సమున్నత స్థాయికి చేరి, నూరేళ్ళ జీవితాన్ని పండించుకుందో తెలిపే ఈ రచన నేటి తరానికీ ప్రేరణనిచ్చే పాఠం. ఆపకుండా చదివించడంతో పాటు... అన్నీ కళ్ళ ముందే జరుగుతున్న అనుభూతిని కలిగించడంతో... ఈ జీవితకథ సినీచరిత్రపై ఆసక్తి గలవారికి అందమైన బహుమానం.

మీర్జాపురం రాణి... కృష్ణవేణి  (నటి కృష్ణవేణి జీవితకథ), రచన – భగీరథ, ప్రతులకు – నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్‌. మొబైల్‌ – 92474 71361).

– రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement