గోంగూరతో చికెన్‌, మటన్‌.. అద్భుతః అనాల్సిందే

Tasty Gongura Chicken Curry Recipe In telugu - Sakshi

పుల్లకూర ముక్క

ఆవకాయ తరువాత తెలుగువారు అధికంగా ఇష్టపడే గోంగూరను ఏ కూరలో వేసి వండినారుచి అమోఘంగా ఉంటుంది. ఘాటు మసాలాలతో ఘుమఘుమలాడే మాంసాహారాన్ని పుల్లని గోంగూరతో వండితే అద్భుతః అనాల్సిందే.

గోంగూర చికెన్‌ ఫ్రై

కావలసినవి: గోంగూర – రెండు కట్టలు. పెద్ద ఉల్లిపాయ – ఒకటి సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిరపకాయలు – ఐదు, కరివేపాకు – రెండు రెమ్మలు, జీలకర్ర – అరటీస్పూను, గరం మసాలా – అర టీస్పూను, ఆయిల్‌ – నాలుగు టీస్పూన్లు, నెయ్యి – టేబుల్‌ స్పూను. మ్యారినేషన్‌ కోసం.. చికెన్‌ – అరకేజీ, నిమ్మరసం – అర టీస్పూను, కారం – టీ స్పూను, ధనియాల పొడి – అర టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు – టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ.
►  
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి మ్యారినేషన్‌ కోసం తీసుకున్న పదార్థాలన్నీ కలిపి అరగంటపాటు నానబెట్టాలి.
► స్టవ్‌ మీద పాన్‌ పెట్టి టీ స్పూను ఆయిల్‌ వేసి గోంగూరను వేసి వేయించి, చల్లారనివ్వాలి.
► తరువాత వేయించిన గోంగూర, పచ్చిమిరపకాయలను మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
► నానబెట్టిన చికెన్‌ మిశ్రమాన్ని మూతపెట్టి మీడియం మంట మీద పదినిమిషాలు ఉడకనివ్వాలి.
► మధ్యలో కలుపుతూ చికెన్‌లో వచ్చిన నీళ్లు మొత్తం ఇగిరిపోయేంత వరకు ఉడికించాలి.
► ఇప్పుడు స్టవ్‌ మీద మరో పాన్‌ పెట్టి నెయ్యి, మూడు స్పూన్ల ఆయిల్‌ వేసి వేడెక్కాక ఉల్లి తరుగు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి.
► ఇవి వేగాక ఉడికిన చికెన్, గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాలు వేగనివ్వాలి.
► ఇప్పుడు గోంగూర పేస్టు వేసి చికెన్‌ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి, అవసరమైతే మరికాస్త వేసుకుని, ఆయిల్‌ పైకి తేలేంత వరకు చికెన్‌ను వేయిస్తే గోంగూర చికెన్‌ఫ్రై రెడీ. 

గోంగూర మటన్‌ కర్రీ

కావలసినవి: మటన్‌ – అరకేజి, పసుపు – చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్టు – టీ స్పూను, పెద్ద ఉల్లిపాయ – ఒకటి, ఆయిల్‌ – ఆరు టీ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, కారం – మూడు టీ స్పూన్లు, ధనియాల పొడి – టీ స్పూను, జీలకర్ర పొడి – అర టీ స్పూను, పచ్చిమిరపకాయలు – ఐదు, గోంగూర – మీడియం సైజు ఐదు కట్టలు, కొత్తిమీర – చిన్న కట్ట ఒకటి, గరం మసాలా పొడి – టీ స్పూను, షాజీరా – టీ స్పూను, యాలకులు – రెండు, లవంగాలు – రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క.

తయారీ:
► 
మటన్‌ను శుభ్రంగా కడిగి కుకర్‌లో వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అరకప్పు నీళ్లు పోసి ఒకసారి అన్నీ కలిపి ఆరు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి.
► స్టవ్‌ మీద పాన్‌ పెట్టి ఆరు టీస్పూన్ల ఆయిల్‌ వేసి దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
► కొద్దిగా ఉప్పువేసి గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు మారేంత వరకు వేయించాలి.  
► తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచి వాసన వచ్చేంతరకు వేయించాక, పసుపు, పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ ఆయిల్‌ పైకి తేలేంత వరకు ఉడికించాలి.
► ఇప్పుడు ఉడికిన మటన్‌ వేసి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి.  గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుని గరం మసాలా, తరిగిన కొత్తి మీర వేసి 10 నిమిషాలు ఉడికిస్తే గోంగూర మటన్‌ కర్రీ రెడీ. 

గోంగూర పచ్చి రొయ్యల ఇగురు

కావలసినవి: పచ్చిరొయ్యలు – అరకేజి, గోంగూర  – మూడు కట్టలు, పెద్ద ఉల్లిపాయలు – రెండు, ఎండు మిరపకాయలు – పన్నెండు, పచ్చిమిరపకాయలు – మూడు, వెల్లుల్లి తరుగు – రెండు టీ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, జీలకర్ర – టీస్పూను, పసుపు – అర టీస్పూను, ఆయిల్‌ – నాలుగు టీస్పూన్లు,  ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ:
► ముందుగా  గోంగూరను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి దోరగా వేయించి పేస్టులా చేసి పక్కన బెట్టుకోవాలి.
► రెండు పెద్ద ఉల్లిపాయలు, జీలకర్ర, పది ఎండు మిరపకాయలను మిక్సీజార్‌లో వేసి పేస్టు చేసి పెట్టుకోవాలి.
► స్టవ్‌ మీద పాన్‌ పెట్టుకుని నాలుగు టీస్పూన్ల ఆయిల్‌ వేసి కాగాక ఆవాలు వేయాలి.
► ఆవాలు వేగాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఎండు మిరపకాయలు వేసి వేయించాలి.
► ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు వేసి ఐదు నిమిషాలు వేగనిచ్చి,  తరువాత కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేయాలి.
► రొయ్యలు వేసిన ఐదు నిమిషాల తరువాత రుచికి సరిపడా ఉప్పువేసి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తరువాత గోంగూర పేస్టు వేసి బాగా కలపాలి.
► అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసి నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే గోంగూర పచ్చిరొయ్యల ఇగురు రెడీ.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top