ఈ వారం కథ: రీట్వీట్‌ | Sunday Special Story Indian Immigrants in the United States | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: రీట్వీట్‌

May 18 2025 12:48 PM | Updated on May 18 2025 12:48 PM

Sunday Special Story Indian Immigrants in the United States

నువ్వు అలా స్క్రోల్‌ చేస్తున్నావు. డెడ్‌ లైన్ల మధ్య ఓ క్షణం. నైట్‌ లాంప్‌ వుండీ లేనట్లు వెలుగుతోంది. ప్లాస్టిక్‌ కంటైనర్‌లోని గోట్‌ బిర్యానీ చల్లారిపోయింది. క్యాంపస్‌ అంతా నిశ్శబ్దంగా వుంది, మంచు తెరలతో మూసుకుపోయినట్లు. ఎక్కడి నుంచో పోలీసు హారన్లు. నువ్వు ఏదో చెప్పాలనో, మాట్లాడాలనో అనుకోవటం లేదు. అది నీ తత్త్వం కాదు. అంత మాత్రాన నీకు హృదయం లేదని కాదు. పేదరికం నీ పెదాల్ని మూసేసింది. 

కానీ ఆ రోజు, నువ్వొక ఫొటో చూశావు. చిన్న పిల్ల. ఆరేడేళ్ళు వుంటాయేమో. ఆ పసిదాని మొహం సగం బూడిదలో కప్పడిపోయింది. ఆ తల్లి ఏడుపు ఆ ఫొటోలో నుంచి నీ గుండెను తాకింది. శిథిలాల మధ్య చిక్కుకున్న ఆ మృతదేహాన్ని చూడలేక కళ్ళు వాల్చుకున్నావు. ఆ పసిదాని పేరు నీకు తెలీదు. తెలియక్కర లేదు కూడా. దుఃఖానికి వూర్లు, పేర్లు, దేశాలు, భాషలు అక్కరలేదు. ఆ రోజుకి ఇంకేమీ రాయలేకపోయావు. 

ఎన్ని మరణాలు? ఎన్ని దేహాలు? ఎన్ని యుద్ధాలు? ఎంత విధ్వంసం? "Being human is not a crime''ట్వీట్‌లో వున్నది ఆ ఒక్క వాక్యమే! ఆ వాక్యం రాసింది నువ్వు కాదు. నువ్వు దాన్ని ఎడిట్‌ చేయలేదు. రీట్వీట్‌ జస్ట్‌ రీట్వీట్‌ చేశావు. ఒక్క క్లిక్‌. దాహంతో వున్న వాళ్ళకు ఓ గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లు. That's it. అనుకోకుండా ఆ రీట్వీట్‌ వైరల్‌ అయింది. కామెంట్లు వరదలాగా ముంచెత్తాయి.

కొందరు నిన్ను ప్రశంసిస్తే, మరికొందరు "unamerican' అని విమర్శించారు. ఇమ్మిగ్రెంట్లకు అసలేం పని ఈ దేశంలో అన్నారు. వెళ్లిపొమ్మని కొందరంటే, వెళ్లగొడతామని మరికొందరన్నారు. రాడికల్‌ అని కొందరంటే, ట్రైటర్‌ అన్నారు మరికొందరు. నిజం చెప్పద్దు. ఒక్కసారి నీ రీట్వీట్, ఆ స్పందన, ఆ కామెంట్లు ఆ పాపులారిటీ నువ్వు భలే ఆనందించావు. కానీ ఆ ఆనందానికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో అప్పుడు నువ్వూహించలేదు. నీ పాలిట అదే ఉరితాడవుతుందని. అదే నీకు వ్యతిరేక సాక్ష్యం అవుతుందని. 

ఒక్క వాక్యం. Hashtags లేవు. నినాదాలు లేవు. యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనలో అనుకోకుండా నువ్వొక ప్లకార్డు పట్టుకున్నావు. డైలీ పెన్సిల్వేనియన్‌ పత్రిక ఫోటోగ్రాఫర్‌ తీసిన ఫోటోలో నువ్వే ప్రముఖంగా కనిపిస్తున్నావు.  ఇప్పుడు మీ యూనివర్సిటీలో భారతి అంటే మరో సుబ్రహ్మణ్య భారతి. ఈ ప్రదర్శనలు, ఈ ట్వీట్లు, ఈ డిబేట్లు వీటన్నింటితో నీలోపలి కవిత్వం మళ్ళీ బయటకొచ్చింది. నీ కవితలు స్టూడెంట్స్‌ నోటి వెంట పద్యాలయ్యాయి.
∙∙ 
మరోవైపు ఏం జరుగుతోందో నువ్వు ఊహించలేకపోయావు. వీటన్నింటినీ  ఓ నిఘా కన్ను చూస్తోంది. నిన్నే, నిన్నే, నిన్నే. జింకలకు తెలియాలి సింహాలు ఎప్పటికైనా వేటాడి తీరతాయని. ఇమ్మిగ్రెంట్లకు తెలియాలి ఎప్పటికైనా తిరిగెళ్లిపోవాలని. నీ ఒంటి రంగు ఎప్పటికీ తెలుపు కాబోదని. నీ నిక్‌ నేమ్‌ ఎప్పటికీ ‘బ్రౌనీ’నే అని. నువ్వు హక్కులడిగితే, వాళ్ళు నీ బాధ్యతలు గుర్తుచేస్తారు. లిబర్టీ బెల్‌ ఉన్న ఊర్లో లిబర్టీ నేతిబీరకాయలో నెయ్యి.  తెలుసుకొనవే చెల్లీ, అలా మసలుకొనవే తల్లీ!
∙∙ 
నీకు తెలియదు నీ పేరు అట ingtonలోని ఓ అధికార కార్యాలయపు టేబుల్‌ మీద ఓ ఫోల్డర్‌ లోకి చేరుతుందని. నీకు తెలియదు నీ పేరు ‘భారతి రాఘవన్‌’ ఒక జాబితాలోకి అంత సులువుగా చేరిపోతుందని.  నీకు తెలియదు నీ వొంటి రంగు, నీ వీసా స్టేటస్, నీ కోపం, నీ ఆలోచన ఇవి చాలు నువ్వు నేరస్థురాలివని నిర్ధారించడానికని. నీకు తెలియదు ఆ అల్గారితమే ఒక ఆయుధమవుతుందని. 
ఎందుకంటే, నువ్వొక ఇమ్మిగ్రెంట్‌వి. 

నీ ధర్మాగ్రహం ఓ ఎర్రజెండా. ప్రతి జెండా ఓ ప్రమాద హెచ్చరిక! ఎక్కడేం జరుగుతోందో వూహించలేని నువ్వు, చల్లారిన నీ గోట్‌ బిర్యానీని తినటానికి ఉపక్రమించావు. కానీ నీ కళ్ళు పదే పదే ఆ దృశ్యాన్ని చూపిస్తుంటే, తినలేక, తినకుండా పారేసే ఆర్థిక శక్తి లేక రేపటి కోసం దాచి పెట్టావు. నీ ఇవాళనీ రేపటినీ మార్చేసింది అది. 

కాన్ఫరెన్స్‌ పేపర్‌ అసంపూర్తిగా వదిలేసి రూమ్‌కి బయలుదేరావు. టైమ్‌ చూశావు. వచ్చే నెల అక్క పెళ్లి ఆలోచనలతో నీ మొహాన ఓ చిరునవ్వు వెలిగింది.
∙∙∙
INTERNAL DHS MEMO & CLASSIFIED
సబ్జెక్ట్‌: భారతి రాఘవన్‌ 
డేట్‌ ఆఫ్‌ బర్త్‌:  04/14/1997
సిటిజన్‌షిప్‌: ఇండియా 
స్టేటస్‌: ఎఫ్‌–1 
యూనివర్సిటీ: యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా 
రెడ్‌ ఫ్లాగ్‌: యు.ఎస్‌. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు. 
సాక్ష్యం: సోషల్‌ మీడియా యాక్టివిటీ. 
రికమెండేషన్‌: సెక్షన 212(a)(3)(B)కింద వీసా రద్దు
కేటగిరీ: సంఘ వ్యతిరేక సంస్థలకు మద్దతు 
నోట్‌: జాతీయ భద్రతా ముప్పు 
యాక్షన్‌: సాఫ్ట్‌ డెటెన్షన్‌ ప్రోటోకాల్‌. 
∙∙ 
ఓ వారం తర్వాత యూనివర్సిటీ లైబ్రరీ ద్వారం దగ్గర నీ బ్యాడ్జ్‌ పని చేయలేదు. కొత్త కార్డు కోసం రిక్వెస్ట్‌ పెట్టి వెళ్లిపోయావు. అక్క  పెళ్లి కోసం ఇండియా వెళ్ళే హడావిడిలో. నీ వీసా స్టేటస్‌ మారిందని నీకు తెలియను కూడా తెలియదు. ఎయిర్‌పోర్టు రెండో సెక్యూరిటీ గార్డు కూడా నీ వైపు చూడకుండా కంప్యూటర్‌ వంక చూస్తున్నప్పుడు, నీకేం అర్థం కాలేదు. నీ మొహంలో భయం, ఆందోళన.

‘‘మేమ్, ప్లీజ్‌ కొంచెం ఈ పక్కకు రండి’’ సెక్యూరిటీ గార్డు రిక్వెస్ట్‌గా అడిగినా, అందులో అధికారమే ధ్వనిస్తోంది. ‘‘ఏమైనా ప్రాబ్లమా సార్‌?’’ అతి వినయంగా అడిగిన నీ మాటలకు, ‘‘ఇది జస్ట్‌ రొటీన్‌’’ చెప్పాడతను. చాలాసార్లు అది నిజమే. కానీ ఈసారి కాదు. 
∙∙ 
ఏజెంట్స్‌ ఫీల్డ్‌ నోట్స్‌: సబ్జెక్ట్‌ కామ్‌గా కనిపించింది. ఏ మత సంస్థలతోనూ ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది. మానవహక్కులు, అకడమిక్‌ ఫ్రీడంలాంటి పదాలు తరచూ ప్రయోగించింది. ఆ పోస్ట్‌ రీట్వీట్‌ చేయటంలో కానీ, ఆ ప్రదర్శనలో ప్లకార్డ్‌ పట్టుకోవడంలో కానీ ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. పదే పదే ప్రశ్నించాకా,‘‘ఎవరి పట్లనైనా మానవత్వంతో స్పందించటం నేరమా?’’ అని ఎదురు ప్రశ్నించింది. 
∙∙ 
నీ చేతికి వేసిన సంకెళ్ళు నిన్ను చూసి చులకనగా నవ్వాయి. ఆ నిశ్శబ్దం నిన్ను భూతంలా చుట్టుముట్టి భయపెట్టింది. వాళ్ళంతా చాలా ప్రశాంతంగా ఇది చాలా అలవాటైన పనిలాగా చేసుకుంటూ వెళ్లిపోవటం నిన్ను నిలువునా కూల్చేసింది. నువ్వు మొదట్లో మామూలుగానే అడిగే ప్రయత్నం చేశావు, కానీ నీ గొంతులో కోపం, భయం, ఆందోళన అన్నీ వాళ్ళకు కనిపించాయి. వేటాడే పులికి తన నోటికి చిక్కిన జింక మొహం చూస్తే చాలు. తినక ముందే కడుపు నిండిపోతుంది. వాళ్ళ మొహాలు నీ కంటికి వేటాడే సింహాల్లాగానే కనిపించాయి. 

‘‘నా మీద పెట్టిన చార్జ్‌ ఏమిటి?’’ ‘‘దేశ భద్రతకు ముప్పు.’’ దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్రజెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా  రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు.∙∙ ఆ రాత్రి నిన్ను వ్యాన్‌లో మరో చోటికి తీసుకెళ్లారు. అక్కడ కిటికీల్లేవు.

కొందరు గార్డులు నీ వంక సానుభూతిగా చూశారు. కొందరు ఇది మా ఉద్యోగం అన్నట్లు కళ్ళతోనే చెప్పుకున్నారు. కొందరి కళ్ళల్లో బాగా శాస్తి జరిగిందన్న ఆనందం. నీ దవడ బిగుసుకుంది. నీ పళ్ళు గట్టిగా కరుచుకోవటం వల్లనో, మరి దేని వల్లనో నాలుకకి రక్తపు రుచి తెలిసింది. ఫోన్‌ కాల్‌ ట్రాన్‌ స్క్రిప్ట్‌: ICE మానిటర్డ్‌ లైన్‌  ‘‘చిన్నీ’’ ‘‘అమ్మా’’ వొణికిన గొంతులోంచి కన్నీళ్లు లోపలకి ఇంకిపోతున్నాయి. 

‘‘మొన్న ఫ్లయిట్‌ ఎందుకు కాన్సిల్‌ చేశావ్‌? అంతా ఓకే కదా? నిజం చెప్పు. ఏమైనా జరిగిందా? ఏదేదో వింటున్నాం ఇక్కడ’’ భారతి సమాధానం ఇవ్వకముందే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది. ‘‘అంతా బాగానే వుంది మీరు వర్రీ కావద్దు. వీసా సమస్యలు. పేపర్లు సబ్మిట్‌ చేశా. బహుశా అక్క పెళ్ళికి నే రాలేకపోవచ్చు’’

‘‘నీ వీసా Extensionకి  ఎప్పుడనగానో అప్లై చేశావుగా ’’‘అనుమానాలు ముందు పుట్టి తర్వాత అమ్మలు పుట్టి వుంటారు. అంత తొందరగా దేన్నీ నమ్మరు.’ ‘‘ఇక్కడ పరిస్థితులు కొంచెం టెన్షన్‌గా వున్నాయి. నేను ఫోన్‌ చేయకపోతే కంగారు పడొద్దు.’’ తన మాటలు తనకే  నిర్జీవంగా వినిపించాయి.  ఫోన్‌ కాల్‌ టైమ్‌ అయిపోయింది. 
∙∙ 
Asylum కోసం మిగతా బందీలకు వీలు కుదిరినప్పుడల్లా ఉత్తరాలు రాసి పెడుతున్నావు నువ్వు. చేయటానికి వేరే పని ఏముంది? ఆలోచనల్లో మునిగిపోవటం తప్ప. ప్రపంచానికి పెదరాయుడులాంటి అమెరికానే గెంటేస్తుంటే, ఇంకే దేశానికిAsylum అప్లికేషన్స్‌ పెట్టుకోగలరు ఎవరైనా? కదా!
∙∙ 
ఆ సెంటర్‌లో అనేక దేశాల వాళ్ళు, భాషల వాళ్ళు. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళతో పాటు, నేరాలు ఆపాదించబడ్డ వాళ్ళు కూడా.  Like Bharati.. స్పీడ్‌గా కారు నడిపి ఫైన్‌ కట్టని చిన్న నేరాల నుంచి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు: అందరికీ ఒకటే డిటెన్షన్‌ సెంటర్‌. కాపలా కాస్తున్న వారి కళ్ళకు ఎవరేమిటో తెలియదు. 

తెలియక్కరలేదు కూడా. గార్డులకు, డిటైనీలకు తెలిసింది నల్లటి ఊచలు మాత్రమే!ఊచలు పట్టి వుంచేది వ్యక్తులనే కానీ వ్యక్తిత్వాలను కాదు. ఆవేశాన్నే కానీ ఆలోచనలను కాదు. దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్ర జెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు. 

కల్పనా రెంటాల

(చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement