
స్త్రీలను కొన్ని ఉపాధుల్లోకి రానీకుండా అడ్డుకుంటారు. అడ్డుకునేవారిని అడ్డుకుంటాం అంటున్నారు ఈ లేడీ బౌన్సర్లు. కొచ్చి, పూణె, ఢిల్లీ, ముంబైలలో లేడీ బౌన్సర్లకు గిరాకీ పెరిగింది. సెలబ్రిటీలను గుంపు నుంచి అడ్డుకుని వీరు కాపాడుతారు. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్ తెలిసిన స్త్రీలు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. రోజుకు రెండు వేల వరకూ ఫీజు. వివాహితలూ ఉన్నారు. వివరాలు...
ఎనిమిది గంటలు డ్యూటీ. తీసుకెళ్లడం తీసుకురావడం ఏజెన్సీ పని. భోజనం ఉంటుంది. బయట ఊర్లయితే రూము కూడా ఇస్తారు. రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదన. చేయాల్సిన పని?
⇒ క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం
⇒ ఈవెంట్ సెక్యూరిటీ
⇒ సెలబ్రిటీల రక్షణ
⇒ సెలబ్రిటీలను ఎయిర్‌పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం
⇒ సంపన్నుల వేడుకల్లో హంగామా కోసం
⇒ ప్రయివేటు సమస్యల్లో రక్షణ
ఇటీవల ఒక సినీ నటుడి ఇంటి గొడవల్లో బౌన్సర్లనే మాట ఎక్కువగా వినిపించింది. పోలీసుల రక్షణ వీలుగాని చోట ప్రముఖులు బౌన్సర్ల సాయం తీసుకోవడం సాధారణం అయ్యింది. ఒకప్పుడు పబ్‌లలో తాగి గొడవ చేసే వారి కోసం మాత్రమే బౌన్సర్లు ఉండేవారు. ఇప్పుడు అన్ని సేవలకు వారిని ఉపయోగిస్తున్నారు. సెక్యూరిటీకి మాత్రమే కాదు దర్పం చూపించడానికి కూడా శ్రీమంతులు బౌన్సర్లను వాడుతున్నారు.
ఉదాహరణకు కలవారి పెళ్లిళ్లలో వరుడు/వధువు కల్యాణ వేదికకు వచ్చేప్పుడు వరుసదీరిన బౌన్సర్లు చెరో పక్క నడుస్తూ బిల్డప్ ఇస్తున్నారు. చూసేవారికి ఇది గొప్పగా ఉంటుంది. వేడుకలకు, బిజినెస్ మీటింగ్స్‌కు వచ్చే అతిథుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు బౌన్సర్లను పంపుతున్నారు. కాలేజీ వేడుకలు, ప్రారంభోత్సవాలు, ఔట్‌డోర్ షూటింగ్‌లు... వీటన్నింటికీ బౌన్సర్లు కావాలి. ఎంతమంది బౌన్సర్లుంటే అంత గొప్ప అనే స్థితికి సెలబ్రిటీలు వెళ్లారు. దాంతో వీరి సేవలను సమకూర్చే ఏజెన్సీలు నగరాల్లో పెరిగాయి. మహిళా బౌన్సర్లు కూడా పెరిగారు.
ఇబ్బందిగా మొదలయ్యి...
‘మొదట ప్యాంటూ షర్టు వేసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. ఇంట్లో వాళ్లు కొత్తగా చూశారు. ఇరుగుపొరుగు వారు వింతగా చూశారు. కాని తరువాత అలవాటైపోయింది’ అంది పూణెకు చెందిన ఒక మహిళా బౌన్సర్. 2016లో దేశంలోనే మొదటిసారిగా మహిళా బౌన్సర్ల ఏజెన్సీ ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు కేరళలో ఈ రంగంలోకి వస్తున్నవారు పెరిగారు. ‘మేము ఎవరినో రక్షించడానికి వెళుతుంటే మా రక్షణ కోసం కొత్తల్లో కుటుంబ సభ్యులు ఆందోళన పడేవారు. కాని స్త్రీలు ఈ రంగంలో సురక్షితంగా పని చేయొచ్చని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు’ అని మరో బౌన్సర్ అంది.
రెండు విధాలా ఆదాయం
కొచ్చిలో ‘షీల్డ్ బౌన్సర్స్ ఏజెన్సీ’కి చెందిన మహిళా బౌన్సర్లు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా మారారు. ఈవెంట్స్‌లో మహిళా అతిథులకు, స్టేజ్ రక్షణకు, అతిథుల హోటల్ నుంచి ఈవెంట్ వద్దకు తీసుకు రావడానికి వీరి సేవలు ఉపయోగిస్తున్నారు. ‘సాధారణంగా ఈవెంట్స్ సాయంత్రాలు ఉంటాయి. బౌన్సర్ల పని అప్పటి నుంచి మొదలయ్యి అర్ధరాత్రి వరకూ సాగుతుంది. కాబట్టి పగటి పూట చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లేదా ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ మధ్యాహ్నం తర్వాత ఈ పని చేస్తున్నవారూ ఉన్నారు. దాంతో రెండు విధాల ఆదాయం ఉంటోంది’ అని ఆ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు.
స్పోర్ట్స్ తెలిసినవారు
స్కూల్, కాలేజీల్లో స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉన్న మహిళలు, వ్యాయామం ద్వారా జిమ్ ద్వారా దేహాన్ని ఫిట్‌గా ఉంచుకున్నవారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు మహిళా బౌన్సర్లుగా రాణిస్తారు. వెంటనే వారికి పని దొరికే పరిస్థితి ఉంది. దేశంలోని నగరాల్లో వివాహితలు, పిల్లలున్న తల్లులు కూడా వృత్తిలో రాణిస్తున్నారు. ‘జనాన్ని అదుపు చేయడం, వారిని ఒప్పించి ఇప్పుడే దూరంగా జరపడం, ఆకతాయిలను కనిపెట్టడం, సెలబ్రిటీలతో వ్యహరించే పద్ధతి తెలియడం, చట్టపరిధిలో గొడవలను అదుపు చేయడం తెలిస్తే ఈ వృత్తి లాభదాయకం’ అంటున్నారు ఈ మహిళా బౌన్సర్లు.