
మార్క్ జుకర్‌బర్గ్ రూటే సపరేటు
నో మీటింగ్స్... నో డైరెక్ట్ రిపోర్ట్స్
స్టాఫ్ అందరూ సమానమే!
పేరుకే చిన్నా పెద్ద పొజిషన్‌లు
ఎవరితోనూ ఉండని ముఖాముఖి
ఎవరితోనైనా కలవడమే ఎకాఎకి
‘కోర్ ఆర్మీ’తో కంపెనీ నిర్వహణ
∙సాక్షి, స్పెషల్ డెస్క్: చిన్న కంపెనీని నడపటమైనా పెద్ద విషయమే. అలాంటిది ఒక పెద్ద కంపెనీని నడపాలంటే? చిన్న విషయం కాదు. వేలు, లక్షల సిబ్బందిని మేనేజ్ చెయ్యాలి. మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతూ ఉండాలి. మేనేజర్‌ల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకోవాలి. టాప్–టు–బాటమ్ ఒక బలమైన అధికార శ్రేణి (హైరార్కీ)ని నిర్మించాలి. తన పైవాళ్లను దాటి, ఆ పైవాళ్ల దగ్గరికి వెళ్లకుండా ఉద్యోగికి పరిధులు, పరిమితులు ఉండాలి. ఇన్ని ఉంటేనే బండి పట్టాలు తప్పకుండా ఉంటుంది! అయితే... ఇవేవీ లేకుండానే ‘మెటా‘ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, బండిని దానంతటదే నడిచేలా చక్కగా ‘ఆటో పైలట్’ మోడ్‌లోకి మళ్లించారు. 1.524 ట్రిలియన్ డాలర్ల తన మెగా కంపెనీ ‘మెటా’ను– ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది..’ అన్నంత తాపీగా, స్ట్రెస్ లేకుండా – చల్ మేరా సాథీ అంటూ స్వారీ చేస్తున్నారు!
ఒక్క మనిషి.. వందల బిలియన్‌లు
ప్రపంచంలోని టాప్ 10 టెక్నాలజీ కంపెనీలలో ‘మెటా’ ఒకటి. తాజా నివేదిక ప్రకారం 2025 మే మొదటి వారం నాటికి ఈ కంపెనీలో 76,834 మంది ఫుల్ టైమ్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, గురుగావ్, న్యూఢిల్లీ, ముంబై నగరాలతో పాటు, ప్రపంచ దేశాలలోని అనేక ప్రాంతాలలో అసంఖ్యాకంగా మెటా ఆఫీసులు, డేటా సెంటర్లు ఉన్నాయి. 2024లో మెటా మొత్తం వార్షిక ఆదాయం 164.5 బిలియన్ డాలర్లు. మొత్తం ఆస్తులు 276 బిలియన్ డాలర్లు.
మహావృక్షంలో తనూ ఒక కొమ్మే!
ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలమంది ఉద్యోగ పక్షులకు ఆశ్రయం ఇస్తూ, సమృద్ధిగా ఆదాయ ఫలాలను కాస్తున్న ఈ మహావృక్షంలో సీఈవో జుకర్‌బర్గ్ సీటెక్కడో కనిపెట్టటం కష్టం! ‘ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై..’ అన్నట్లుగానే ఆయన తన మెటా కంపెనీలో కలిసిపోయి ఉంటారు. కంపెనీని నడపటంలో ఆయన వ్యవహార శైలి భిన్నమైనది. ఒక కంపెనీకి ఉండవలసిన పద్ధతులు, నిబద్ధతలు అన్నీ ఉంటాయి కాని, వాటి ఆధారంగా మాత్రమే జుకర్‌బర్గ్ కంపెనీని నడపరని ‘స్ట్రయిప్’ కంపెనీ కో ఫౌండర్ జాన్ కాలిసన్‌తో ఇటీవల జుకర్‌బర్గ్ జరిపిన చిట్‌చాట్‌లో వెల్లడైంది.
కోర్ ఆర్మీతోనే మాటా మంతీ
మీటింగులు ఉంటాయి. అస్తమానం ఉండవు. టీమ్ లీడర్లు ఉంటారు. అదే పనిగా సీఈవోను కలవరు. రిపోర్టులు తయారవుతుంటాయి. ఆ ఫైల్స్‌ని పట్టుకుని డైరెక్టర్‌లు సీఈవో కోసం వేచి చూస్తూ కూర్చోరు. జుకర్‌బర్గ్ కూడా ఎవరితోనూ రోజువారీ వన్–ఆన్–వన్ మీటింగ్ (ఇద్దరి మధ్య మాత్రమే జరిగే సమావేశం)లో కూర్చోరు. ‘కోర్ ఆర్మీ’ని మాత్రం ఒక పక్కన ఉంచుకుంటారు. మేనేజ్‌మెంట్‌లోని సీనియర్ లీడర్‌లు 25 నుంచి 30 మంది అందులో ఉంటారు. అత్యవసరం అయినప్పుడు మాత్రమే జుకర్‌బర్గ్ వారితో సమావేశం అవుతారు. మొత్తం మీద ఎవరి పని వారికి ఉంటుంది. గాడి తప్పకుండా ప్రతి పనీ నడుస్తుంటుంది.
కంపెనీ కోసం... ఖాళీ సమయం
జుకర్‌బర్గ్ ప్రతి రోజూ తన కోసం కొంత ఖాళీ సమయాన్ని ఏర్పరచుకుని ఉంటారు. ఆ సమయంలో తన పని గురించి ఆలోచిస్తుంటారు. పని చేస్తుంటారు. సమస్యలకు పరిష్కారాలను వెదుకుతుంటారు. తన ఉద్యోగులకు కూడా తన సమయంలో కొంత ఇస్తుంటారు. అందుకు ఫలానా సమయం అంటూ ఉండదు కానీ, కచ్చితంగా ఖాళీ అయితే ఉంటుంది. ఉద్యోగులు వచ్చి ఆయన్ని కలిసినప్పుడు ఆ ఖాళీ సమయాన్ని వారికి ఇస్తారు. లేదా, తనే ఒక టీమ్‌ను కలవాలనుకున్నప్పుడు ఆ ఖాళీని ఆ టీమ్ కోసం వినియోగిస్తారు. ఆ విధంగా ఉద్యోగులు ఆయన్ని కలవటం కంటే , ఉద్యోగులను ఆయన కలవటమే ఎక్కువగా ఉంటుంది.
ఏ రిపోర్టూ జుకర్‌బర్గ్‌కు వెళ్లదు
మెటా భారీ నెట్‌వర్క్‌లో జుకర్‌బర్గ్ చిన్న మీటగా మాత్రమే ఉండాలని కోరుకుంటారు. పై స్థాయిలోని వారికి ఎవరికి వారుగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. చర్చలు, సమావేశాలన్నవి ‘కోర్ ఆర్మీ’ గ్రూపు మధ్యలోనే ఉంటాయి. ప్రోడక్ట్ ఆపరేషన్స్ కూడా వేటికవే జరిగిపోతుంటాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యాడ్స్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వర్చువల్ రియాలిటీ... ఇలా దాదాపు 15 ఆపరేషన్‌లకు అధిపతులు ఉంటారు. వాళ్లెవరూ నేరుగా జుకర్‌బర్గ్‌కి నివేదికలు అందించరు. బదులుగా చీఫ్ ప్రొడక్టివ్ ఆఫీసర్ క్రిస్ కాక్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జేవియర్ ఒలివన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్‌వర్త్‌కు వాటిని సమర్పిస్తారు.
ఉద్యోగుల తర్వాతే టీమ్ లీడర్లు!
జుకర్‌బర్గ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తారు. ప్రయోగాలకు ప్రేరణ ఇస్తారు. నిరంతరం నేర్చుకుంటూ ఉండే స్వేచ్ఛను కల్పిస్తారు. ఉద్యోగులే ఆయన కంపెనీ ఆస్తిపాస్తులు. కంపెనీ పట్ల ఉద్యోగులకు అంకిత భావం కలిగేందుకు అవసరమైన సానుకూలనమైన పని వాతావరణాన్ని కల్పిస్తారు. తమ టీమ్ లీడర్‌ల వ్యవహార శైలిపై ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఏం చేయాలో చెబుతారు. ఎలా చేయాలో చెబుతారు. ఎప్పటిలోపు చేయాలో చెబుతారు. స్పష్టమైన, సాధ్యమయ్యే టార్గెట్‌లతో ఉద్యోగుల ద్వారా తన లక్ష్యాన్ని సాధిస్తారు.
·