అవార్డులే అవార్డులు : శశిధర్‌..ట్రెండ్‌ సెట్టర్‌ | special story on jrd fashions sahidhar | Sakshi
Sakshi News home page

అవార్డులే అవార్డులు : శశిధర్‌..ట్రెండ్‌ సెట్టర్‌

Jun 9 2025 2:31 PM | Updated on Jun 9 2025 2:31 PM

special story on jrd fashions sahidhar

నగర యువ కెరటం.. ద్విముఖ ప్రజ్ఞ 

మోడల్‌గా, నృత్య కళాకారుడిగా ప్రతిభ 

అంతర్జాతీయ వేదికపై రాణింపు 

నగరంలోని ఓల్డ్‌ డెయిరీ ఫారానికి చెందిన శశిధర్‌ పైడిరాజు పాండ్రాడ చిన్నతనం నుంచే ఫ్యాషన్, సంప్రదాయ నృత్య ప్రదర్శనల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. పాఠశాలలో సంప్రదాయ నృత్యానికి ప్రోత్సాహం లభించగా, ఇంట్లో అతని సోదరుడు ఫ్యాషన్‌ పట్ల ఆసక్తిని పెంచాడు. అన్నయ్య తెచ్చిన విభిన్న రకాల దుస్తులను శశిధర్‌ ధరించి అందరినీ ఆకర్షించేవాడు. అలాగే పాఠశాల కార్యక్రమాల్లో తన నృత్య ప్రదర్శనలతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు. తాను ఎదిగిన ఫ్యాషన్‌ రంగంలో తనలాంటి మరెందరికో దారి చూపించాలనే లక్ష్యంతో శశిధర్‌ 2022లో జేఆర్‌డీ ఫ్యాషన్స్‌ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 మందికి ఫ్యాషన్, నటనలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత మంది యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ఆశయమని శశిధర్‌ తెలిపాడు.  

అవార్డులే అవార్డులు 
ఇటీవల దుబాయ్‌లోని పిరమిడ్‌ స్పిరిట్యువల్‌ సొసైటీ ఆఫ్‌ దుబాయ్‌ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఎస్‌కేఎస్‌ అకాడమీ నుంచి ఎనిమిది మంది నృత్య కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఇందులో శశిధర్‌ ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యానికి ‘యువ ప్రతిభ పురస్కారం’లభించింది. అలాగే శ్రీ లంబోదర కల్చరల్‌ అకాడమీ నుంచి ‘జాతీయ మహా స్వర్ణ నంది అవార్డు’ను అందుకున్నాడు. 2024లో ‘యాక్టివ్‌ ఉగాది పురస్కారం’ కూడా శశిధర్‌కు లభించింది. 

ఒకవైపు ఆధునిక ఫ్యాషన్‌ ప్రపంచంలో ర్యాంప్‌పై హొయలొలికిస్తూ, మరోవైపు శాస్త్రీయ నృత్య వేదికపై అభినయంతో అబ్బురపరుస్తూ.. ఇలా రెండు విభిన్న రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు నగరానికి చెందిన 26 ఏళ్ల శశిధర్‌. చిన్ననాటి అభిరుచులను వదలకుండా వాటినే తన కెరీర్‌గా మలచుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంటూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ‘యువ ప్రతిభ పురస్కారం’ అందుకోవడమే ఇందుకు నిదర్శనం.

ఫ్యాషన్‌ రంగంలోకి అడుగులు
డిగ్రీ చదువుతున్న సమయంలో శశిధర్‌ కొన్ని కారణాలతో సంప్రదాయ నృత్యాన్ని కొంతకాలం పక్కన పెట్టాడు. ఆ సమయంలో తన దృష్టిని పూర్తిగా ఫ్యాషన్‌పై కేంద్రీకరించాడు. డిగ్రీ స్థాయిలో జరిగిన ఫ్యాషన్‌ పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడు జరిగిన హైదరాబాద్‌ ఫ్యాషన్‌ వీక్‌ 2018 లో ‘ఉత్తమ ఆకర్షణీయమైన కళ్లు’అవార్డును గెలుచుకున్నాడు.

మిస్టర్‌ కొచ్చి 2021 విజేత   
చదువు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఫ్యాషన్‌ రంగంపై శశిధర్‌ దృష్టి సారించాడు.2021లో కొచ్చిలో జరిగిన ఫ్యాషన్‌ పోటీల్లో ‘మిస్టర్‌ కొచ్చి 2021’విజేతగా నిలిచాడు. ఆ తర్వాత, ఆంధ్ర ఫ్యాషన్‌ వీక్‌ సీజన్‌ 1 లో ‘ఉత్తమ యువ డిజైనర్‌ అవార్డు 2024’, విశాఖపట్నంలో జరిగిన పోటీల్లో ‘ఉత్తమ స్మైల్‌ అవార్డు 2024’ను సొంతం చేసుకున్నాడు.

నాట్యకళకు తిరిగి ప్రాణం పోసిన వేళ..
చదువుపై దృష్టి సారించే క్రమంలో చిన్నప్పుడు నేర్చుకున్న శాస్త్రీయ నృత్యానికి దూరమైనా.. దానిపై మమకారం చావలేదు. 2024లో ఓ అవార్డు కార్యక్రమంలో శశిధర్‌ మాట్లాడుతూ భరతనాట్యం, కూచిపూడి అంటే తనకెంత ఇష్టమో చెప్పిన మాటలు తన జీవితాన్ని కీలక మలుపు తిప్పాయి. ఆ మాటలు విన్న ఎస్‌కేఎస్‌ అకాడమీకి చెందిన పక్కి అరుణ్‌ కుమార్‌ సాయి.. శశిధర్‌ను కలిసి తన నృత్య ప్రతిభను ప్రదర్శించమని కోరారు. అతనిలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలా ఏళ్ల క్రితం ఆగిపోయిన నాట్య ప్రయాణం మళ్లీ ప్రారంభమైంది. గురువు అరుణ్‌ శిక్షణలో రాటుదేలిన శశిధర్‌.. అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటాడు. 

యువతకు మార్గదర్శిగా ‘జేఆర్‌డీ ఫ్యాషన్స్‌’ 

తాను ఎదిగిన ఫ్యాషన్‌ రంగంలో తనలాంటి మరెందరికో దారి చూపించాలనే లక్ష్యంతో శశిధర్‌ 2022లో జేఆర్‌డీ ఫ్యాషన్స్‌ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 మందికి ఫ్యాషన్, నటనలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత మంది యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ఆశయమని శశిధర్‌ తెలిపాడు.   

అమ్మ ప్రోత్సాహంతోనే..  
మోడల్‌గా, నృత్య కళాకారుడిగా రాణించడంలో అమ్మ పాత్ర ఎంతో ఉంది. పాఠశాల రోజుల్లో వివిధ రకాల ప్రదర్శనల్లో నన్ను పాల్గొనేలా ప్రోత్సహించింది. ఫ్యాషన్‌ రంగంలోకి వెళ్తానంటే సపోర్ట్‌ చేసింది. నృత్యం ఇక నా జీవితంలో ఉండదు అనుకునే సమయంలో మా గురువు పక్కి అరుణ్‌ కుమార్‌ సాయి ప్రోత్సాహం మరువలేనిది. ఈ రెండు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండాలని నిరంతరం పట్టుదలతో శ్రమిస్తున్నా..  – శశిధర్‌ పైడిరాజు పాండ్రాడ   

Advertisement
 
Advertisement
Advertisement