మనసున్న బాస్‌

Soma Mondal to be SAIL first woman head - Sakshi

తొలి ‘ఉక్కు’ మహిళ

దేశంలోని చాలా కంపెనీలు ఇప్పుడు ఒడిదుడుకుల్లో ఉన్నాయి. వాటిల్లో చాలా కంపెనీలకు మహిళలే కొత్త బాస్‌గా వస్తున్నారు. సోమా మండల్‌నే చూడండి. జనవరి 1 ఆమె భారత ప్రభుత్వసంస్థ సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 19కి 67 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సెయిల్‌ చరిత్రలోనే తొలి మహిళా చైర్మన్‌ సోమ. మొన్నటి వరకు సెయిల్‌కు డైరెక్టర్‌–కమర్షియల్‌గా ఉన్న సోమ.. చైర్‌పర్సన్‌ కాగానే భారత పారిశ్రామిక రంగంలోని దిగ్గజాల కళ్లన్నీ ఆమె ముళ్ల కీరీటం వైపు మళ్లాయి తప్ప, ‘ఐ కెన్‌’ అని ధీమాగా చెబుతున్నట్లున్న ఆమె చిరునవ్వుకు ఎవ్వరూ పెద్దగా గుర్తింపునివ్వడం లేదు!

చైర్‌పర్సన్‌గా ఇప్పుడిక ఆమె చాలా చెయ్యాలి. యాభై వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్న సెయిల్‌ అప్పుల్ని తగ్గించాలి. వచ్చే పదేళ్లలోపు ఏడాదికి కనీసం ఐదు కోట్ల టన్నుల ఉక్కు ఉత్పతిస్థాయికి సంస్థ సామర్థ్యాన్ని పెంచాలి. స్టాక్‌ మార్కెట్‌లో సెయిల్‌ సూచీని శిఖరం వైపు మళ్లించాలి. తక్షణం అయితే ఒకటి చేయాలి. ఏళ్లుగా కదలిక లేకుండా ఉన్న వేతనాలను సవరించి, స్థిరీకరించి సిబ్బందిలోని అసంతృప్తిని పోగొట్టాలి. ఇవన్నీ చేయగలరా? ‘చెయ్యగలను’ అని ఆమె అంటున్నారు. ‘ఆమె చెయ్యగలరు’ అని ప్రభుత్వం నమ్ముతోంది. స్టీల్‌ ధరలు పెరుగుతున్న ప్రస్తుత దశలో చైర్‌పర్సన్‌గా వచ్చిన సోమా మండల్‌ సెయిల్‌ను లాభాల్లో నడిపిస్తారనే సెయిల్‌ ఉద్యోగులు, స్టాక్‌ హోల్డర్‌లు ఆశిస్తున్నారు. అందుకు కారణం ఉంది.
∙∙
యాభై ఏడేళ్ల సోమ వ్యాపార వ్యూహాల నిపుణురాలు మాత్రమే కాదు. సోషల్‌ వర్కర్‌ కూడా కనుక సెయిల్‌ కింది స్థాయి సిబ్బందికి అన్నివిధాలా భరోసా లభించినట్లే. పైన మన కష్టం గుర్తెరిగే వారున్నారనే భావన కింది స్థాయి ఉద్యోగులు సంస్థ కోసం పాటు పడేలా చేస్తుంది. కంపెనీకి అది వెలకట్టలేని ఆస్తి. 2017 నుంచి సెయిల్‌లో ఉన్నారు సోమా. ఆ క్రితం వరకు ‘నాల్కో’లో (నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌) చేశారు. రూర్కెలా నిట్‌లో బీటెక్‌ చేశాక 1984లో నాల్కోలోనే మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా చేరారు. సోమా భువనేశ్వర్‌లో జన్మించారు.

ఆమె తండ్రి వ్యవసాయ ఆర్థికవేత్త. తన ముగ్గురు సంతానాన్ని డాక్టర్‌లను చేయాలని ఆశ. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు, ఒక కూతురు డాక్టర్‌లు అయ్యారు కానీ, సోమ ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నారు. సోమకు ముగ్గురు పిల్లలు.  భర్త కూడా ఇంజినీరే. యు.టి.ఐ.లో పని చేసేవారు. 2005లో చనిపోయారు. ‘‘నా ప్లస్‌ పాయింట్‌ ఏమిటంటే.. నేను చేసే ప్రతి పనిలోనూ హ్యూమన్‌ టచ్‌ ఉంటుంది’’ అన్నారు సోమ.. సెయిల్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకోగానే.

‘‘నా ప్లస్‌ పాయింట్‌ ఏమిటంటే.. నేను చేసే ప్రతి పనిలోనూ హ్యూమన్‌ టచ్‌ ఉంటుంది’’ అన్నారు సోమ.. సెయిల్‌ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకోగానే.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top