షార్క్‌ టైగర్స్‌

Shark Tank India program encouraging start up ideas - Sakshi

‘నా దగ్గర ఎన్నో ఐడియాలు ఉన్నాయి. ఫండింగ్‌ ఉంటే ఎక్కడో ఉండేవాడిని’ అనేది బ్లాక్‌ అండ్‌ వైట్‌ జమాన నాటి మాట. ‘నీ దగ్గర ఐడియా ఉంటే చాలు...దానికి రెక్కలు ఇవ్వడానికి ఎంతోమంది ఉన్నారు’ అనేది నేటి మాట. ‘ఐడియా’ ఉండి ఫండింగ్‌ అవకాశం లేని స్టార్టప్‌ కలల యువతరానికి ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’లాంటి టీవిప్రోగ్రామ్స్‌ ఆశాదీపాల్లా మారాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన 20 సంవత్సరాల దావల్‌ తన సోదరుడు జయేష్‌తో కలిసి స్టార్టప్‌ కలను సాకారం చేసుకోబోతున్నాడు...

దావల్‌కు కాలేజీ టీ స్టాల్‌లో టీ తాగడం అంటే చాలా ఇష్టం. అలాంటి ఇష్టం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనికి కారణం టీ స్టాల్‌లో పనిచేసే అబ్బాయి ఒక టబ్‌లో అవే నీళ్లలో గ్లాసులను కడగడం. దారిన పోయే మేక ఒకటి వచ్చి ఆ నీళ్లు తాగినా ఆ నీళ్లు అలాగే ఉండడం! టీ స్టాల్‌ యజమానికి చెప్పినా అతడు పట్టించుకోకపోవడం!!

కాలేజీ టీ స్టాల్‌లోనే కాదు బయట రోడ్డు సైడ్‌ టీ స్టాల్స్, దాబాలలో కూడా ఇలాంటి దృశ్యాన్నే చూశాడు దావల్‌. ‘ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలి’ అని గట్టిగా అనుకున్నాడు గుజరాత్‌లోని బవస్కంత గ్రామానికి చెందిన దావల్‌. యూట్యూబ్‌లో మెషిన్‌ డిజైనింగ్‌ సబ్జెక్ట్‌పై దృష్టి పెట్టాడు. ఆరు నెలల్లో ఒక అవగాహన వచ్చింది.తండ్రితో కలిసి ఒక హార్డ్‌వేర్‌ షాప్‌కు వెళ్లి స్క్రాప్‌ ఉచితంగా ఇవ్వాల్సిందిగా బతిమిలాడుకున్నాడు. స్క్రాప్‌ చేతికి వచ్చిన తరువాత ప్రయోగాలుప్రారంభించాడు.

ఒకటి, రెండు, మూడు, నాలుగు ప్రయత్నాల్లోనూ విఫలం అయ్యాడు. ‘చేసింది చాలు. ఇక ఆపేయ్‌. స్క్రాప్‌ ఇచ్చేదే లేదు’ అన్నాడు హార్డ్‌వేర్‌ షాప్‌ యజమాని. దీంతో తనకు తెలిసిన ప్రొఫెసర్‌ను కలిసి విషయం చెప్పాడు. ఆయన పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. ఈసారి మాత్రం తన ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్‌ అయ్యి ఆటోమెటిక్‌ టీ–గ్లాస్‌ వాషింగ్‌ మెషిన్‌ కలను నెరవేర్చుకున్నాడు. ఈ మెషిన్‌లోని వాటర్‌ జెట్‌తో 30 సెకండ్ల వ్యవధిలో 15 టీ గ్లాసులను శుభ్రపరచవచ్చు. దీని సామర్థ్యాన్ని పెంచే కొత్త మెషిన్‌ కూడా తయారు చేశాడు దావల్‌.

దీని గురించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే అనూహ్యమైన స్పందన వచ్చింది. కొందరుప్రొఫెసర్‌లను కలిసి ఈ మెషిన్‌ గురించి డెమో ఇచ్చాడు. వారికి నచ్చి అభినందించడమే కాదు లక్ష రూపాయలు ఇచ్చారు. వారు ఇచ్చిన లక్షతో అయిదు మెషిన్‌లను తయారుచేసి కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్రలలో అమ్మారు.

దావల్‌ సోదరుడు జయేష్‌కు సొంతంగా వ్యాపారం చేయాలనేది కల. సోదరులిద్దరు ‘మహంతం’ పేరుతో స్టార్టప్‌ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా షార్క్‌ట్యాంక్‌ ఇండియా(సోనీ టీవీ) రియాల్టీ షోలో దావల్, జయేష్‌లు చెప్పిన స్టార్టప్‌ ఐడియా నచ్చి అయిదుగురు షార్క్స్‌(బిగ్‌–షాట్‌ ఇన్వెస్టర్స్‌) డీల్‌ ఆఫర్‌ చేయడమే కాదు ‘మీ విజయం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని అభినందించారు.

ఆ మాటే  విజయమంత్రం
‘అపజయం మాత్రమే అంతిమం కాదు’ అనే మాటను ఎన్నోసార్లు విన్నాను. నా ప్రయత్నంలో విఫలమైనప్పుడల్లా ఈ మాటను గుర్తు తెచ్చుకునేవాడిని. మళ్లీ మళ్లీ ప్రయత్నించేవాడిని. కొందరు నన్ను వింతగా చూసేవారు. కొందరైతే...నీకు నువ్వు సైంటిస్ట్‌లా ఫీలవుతున్నావు అని వెక్కిరించేవాళ్లు. అయితే నేను వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. సక్సెస్‌ కావడమే నా లక్ష్యం అన్నట్లుగా కష్టపడ్డాను. చివరికి ఫలితం దక్కింది. –దావల్‌
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top