శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం తదితర ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని నిమిషాల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా సాయి నామస్మరణ పాటిస్తున్నారు. మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ ఆధ్వర్యంలో బాబా ఆశయాలను ఆధునిక రూపంలో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచానికి ప్రేమ, సేవా, సత్య సందేశాన్ని విస్తరిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్మించిన ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా, మానవ సేవకు ఉదాహరణగా నిలుస్తోంది.
విరివిగా డిజిటల్ వినియోగం
» డిజిటల్ కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భక్తులతో ఆన్ లైన్ సత్సంగాలు, ప్రసంగాలు.
» సౌర శక్తి వ్యవస్థల ద్వారా పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి.
» స్మార్ట్ కంట్రోల్ యూనిట్స్ ద్వారా ఆశ్రమంలో విద్యుత్, నీటి వినియోగ నియంత్రణ.
సూపర్ స్పెషాలిటీ (ప్రశాంతిగ్రామ్ – వైట్‌ఫీల్డ్) ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సిస్టమ్స్, అధునాతన హృద్రోగ శస్త్ర చికిత్సల పరికరాలు, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్స్.
» రోగుల వైద్య వివరాలు పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేసి వేగవంతమైన సేవలు అందిస్తున్నారు.
» ఇక్కడ అన్ని వైద్య సేవలను ఉచితంగా అందించడం ప్రపంచానికే ఆదర్శం.
» శస్త్రచికిత్స అనంతరం రోగి వేగంగా కోలుకోవడం, కచ్చితమైన ఫలితాలు సాధించడం.
» సత్యసాయి విద్యాసంస్థల్లో విలువల ఆధారిత సమగ్ర విద్యను అందించడం.
» విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఆత్మవికాసం, సేవాస్ఫూర్తి కలిగించడం.
» విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యాసహాయం.
» శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం ఆధ్వర్యంలో 9 గ్రామీణ బాల సంరక్షణ కేంద్రాలు (అంగన్వాడీలు) పునర్నిర్మించారు.
అంతర్జాతీయ సేవా విస్తరణ
భారతదేశంతో పాటు విదేశాలలో కూడా ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్తరించడం. విద్య, ఆరోగ్య, శాంతి సదస్సులు, ఆహార సహాయం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భగవాన్ శ్రీసత్యసాయి బాబా మహా సమాధి తర్వాత కూడా మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్‌జే రత్నాకర్ నేతృత్వంలో ట్రస్ట్ భగవాన్ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించింది.
కొనసాగుతున్న బాబా ఆశయాలు
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు ప్రస్తుతం ఆర్.జె.రత్నాకర్ మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగుతున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి పొందిన తర్వాత ఆయన ఆశయాలను రత్నాకర్ ముందుకు తీసుకువెళుతున్నారు. బాబా ఆశయాల మేరకు పలు సేవారంగాలలో బాబా ప్రారంభించిన సేవలను కొనసాగిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్యాణం పొందిన తర్వాత గడచిన పద్నాలుగేళ్లలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రభుత్వంతోను, ఇతర సంస్థలతోను చేతులు కలిపి పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది.
ఒడిశాలో 2012–13లో వరద ముంపు బారిన పడ్డ గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి మూడువందల ఇళ్లను నిర్మించింది. కేరళలో 2018లో వరదలు సంభవించిన సుమారు పది గ్రామాల్లో నర్సరీ స్కూళ్ల పునరుద్ధరణ చేపట్టడమే కాకుండా, తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలను నిర్మించింది. మరోవైపు అనంతపురం జిల్లాలోని మరో 118 జనావాసాలకు తాగునీటి సరఫరాను విస్తరించింది. పుట్టపర్తిలో నీటిఎద్దడిని తీర్చడానికి 52 ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లను నెలకొల్పింది.
అలాగే, శ్రీ సత్యసాయి ఎన్టీఆర్ సుజల పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1690 ఇళ్లకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం ఎనిమిది నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని కేంద్రపొడా జిల్లాకు చెందిన రెండు కుగ్రామాల్లో రెండు తాగునీటి సరఫరా కేంద్రాలను, నువాపడా జిల్లాలో ఐదు తాగునీటి సరఫరా కేంద్రాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నెలకొల్పింది.
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2019–20లో తెలంగాణలోని బెజ్జంకిలో ఉన్న శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్, ఆంధ్రప్రదేశ్‌లోని పలాసలో ఉన్న శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలతో పాటు కర్ణాటకలోని మైసూరులో ఉన్న భగవాన్ బాబా మహిళా మక్కల కూట ట్రస్టుకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో గ్రామీణ వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి భవన నిర్మాణం కోసం రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించింది.
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2021–22లో తొమ్మిదేళ్లు కొనసాగే శ్రీ సత్యసాయి సమీకృత విద్యా కార్యక్రమాన్ని రూ.5.6 కోట్ల వ్యయంతో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దివ్యాంగ బాలలకు ఉపయోగపడేలా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2020లో జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ట్రస్టు చేపట్టింది.
‘కరోనా’ కాలంలో సేవలు
‘కరోనా’ మహమ్మారి వ్యాపించిన కాలంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రజలకు సేవలు అందించడానికి సత్వరమే రంగంలోకి దిగింది. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘కరోనా’ రోగుల కోసం అనంతపురం జిల్లాలో రూ.2 కోట్ల వ్యయంతో తొలి ప్రైవేటు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే, ప్రధాన మంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది.
‘కరోనా’ కాలంలో ఇక్కట్లు పడిన వలస కార్మికులు సహా నిరుపేదలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి ట్రస్టులకు కోటి రూపాయలు ఇచ్చింది. లద్దాఖ్‌లోని మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలోని మహాబోధి కరుణా చారిటబుల్ ఆసుపత్రికి విడతల వారీగా రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించింది.
అలాగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సంవత్సరంలో దేశవ్యాప్తంగా కోటి మొక్కలను నాటడం కోసం శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్‌తో కలసి ట్రస్టు ‘శ్రీ సత్యసాయి ప్రేమతరు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సత్యసాయిట్రస్ట్ ఆధ్వర్యంలోసేవా కార్యక్రమాలు


