క్రైం స్టోరీ: బ్లాక్‌మెయిలర్‌.. చచ్చిపోయాడంటూ బెదిరించి డబ్బు గుంజి.. ఆఖరికి

Sakshi Funday Magazine: Rachaputi Ramesh Telugu Story

చాయ్‌ మహల్లో సాయంత్రం ఆరుగంటలకు కస్టమర్ల రద్దీ ఎక్కువగా వుంది. అక్కడ దొరికే ఖడక్‌  చాయ్‌ లాంటి టీ స్టార్‌ హోటళ్లలో కూడా లభించకపోవడంతో సామాన్యజనంతో బాటూ ధనికులు కూడా అక్కడ ఆగి టీ తాగి వెళ్తుంటారు.

ఒక కార్నర్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని చంద్రశేఖర్‌ మిత్రులతో బాటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఖడక్‌ చాయ్‌ తాగుతున్నాడు. చెన్నైలో పేరుమోసిన లాయర్‌ అతను. వారానికి ఆరు రోజులు కోర్టులు, కేసులు, క్లయింట్లతో బిజీగా వుంటాడు. శనివారం కోర్టుకు సెలవు కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు చాయ్‌ మహల్లో మిత్రులతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగి వెళ్లడం అలవాటతనికి.

పిల్లిగడ్డం, కళ్లజోడుతో వున్న ఒక యాభై ఐదేళ్ల మనిషి చంద్రశేఖర్‌ను దూరం నుంచి పరీక్షగా చూసి దగ్గరకు వచ్చి, ‘బాగున్నారా?’ అని అడిగాడు. చంద్రశేఖర్‌కు ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. కానీ వెంటనే అతడినంతకు మునుపు తాను ఎక్కడ చూశాడో గుర్తుకు రాలేదు.

పిల్లిగడ్డం వాడు చిన్నగా నవ్వి ‘ఫ్రెండ్స్‌తో బిజీగా వున్నట్లున్నారు. తరువాత ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను’ అన్నాడు. చంద్రశేఖర్‌ అప్రయత్నంగా జేబులోంచి తన విజిటింగ్‌ కార్డు తీసి ఆ వ్యక్తికి ఇచ్చాడు. దాన్ని జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడతను. ఎవరో కేసు గురించి తనను సంప్రదించాలని వచ్చి వుంటాడనుకొని చంద్రశేఖర్‌ మళ్లీ మిత్రులతో కబుర్లలో పడిపోయాడు.
∙∙ 
ఆ రోజు రాత్రి భోజనం చేసి పక్కమీదికి వాలుతుండగా హఠాత్తుగా చంద్రశేఖర్‌కు ఆ పిల్లిగడ్డం వాడిని తానింతకుముందు ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చింది. వాడిపేరు కాళిదాసు. అతడిని తానింతకు మునుపు ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చేసరికి చంద్రశేఖర్‌కు ఒళ్లు జలదరించినట్లనిపించింది.
∙∙ 
చంద్రశేఖర్‌ తండ్రి నెల్లూరులో పెద్దలాయరు. డిగ్రీ పూర్తికాగానే కొడుకును చెన్నైలోని ఒక లా కాలేజీలో చేర్పించడానికి ప్రయత్నించాడతను. కానీ పుట్టిపెరిగిన వూరిని వదిలి వెళ్లనని మొండికేశాడు చంద్రశేఖర్‌. డబ్బులో పుట్టి పెరిగిన అతనికి ఫ్రెండ్స్‌తో తిరగడం, అప్పుడప్పుడు పార్టీలు, పబ్బులు సందర్శించడం అలవాటైంది. చెన్నై లా కాలేజీలో సీటు వచ్చినా అక్కడికి వెళ్లకుండా చంద్రశేఖర్‌ పదిరోజులు ఇంటిదగ్గరే వుండిపోయాడు.

తండ్రి అతడిని బుజ్జగించి, చంద్రశేఖర్‌కు ఇష్టమైన బైక్‌ కొనుక్కోమని యాభైవేలు చేతికిచ్చాడు. ఆ రోజు సాయంత్రం చంద్రశేఖర్‌ ఫ్రెండ్స్‌తో మందుపార్టీ చేసుకొని మిత్రుడి బైక్‌ తోలుతూ వేగంగా విజయ మహల్‌ సెంటర్‌ వైపు వస్తున్నాడు. రోడ్డు దాటుతూ ఎదురుగా వస్తున్న మోపెడ్‌ను చూసుకోకుండా ఢీకొట్టాడు. 

కిందపడిన మోపెడ్‌ అతన్ని తాగిన మత్తులో తిట్టసాగాడు చంద్రశేఖర్‌. మోపెడ్‌ రైడర్‌ కూడా తిట్లు లంకించుకున్నాడు. అతని పేరు సుందరం. మూడిళ్ల అవతలే అతని ఇల్లు.

సుందరం తమ్ముడు రాజు, పక్కింటి కాళిదాసు గొడవ విని పరుగెత్తుకు వచ్చారు అక్కడికి. సుందరం తిట్లు ఆపకపోవడంతో అప్పటికే ఆవేశంలో, మత్తులో వున్న చంద్రశేఖర్‌ చేతికందిన రాయి తీసుకొని సుందరం తలపై కొట్టాడు. తల నుండి రక్తం ధారకట్టింది.

అది చూసి రాజు, కాళిదాసు చంద్రశేఖర్‌ పై ఎగబడ్డారు. దూరంగా పడిన చంద్రశేఖర్‌ను అతడి ఫ్రెండ్‌ పైకిలేపి ‘గొడవలు వద్దు, ఇంటికి వెళ్లిపోదాం’ అన్నాడు భయంగా. ఫ్రెండ్‌ బైక్‌ స్టార్ట్‌ చేయగానే చంద్రశేఖర్‌ వెనక సీట్లో కూర్చున్నాడు. ఇంటికి చేరిన చంద్రశేఖర్‌కు మత్తు దిగగానే సుందరానికి ఏమైందో అన్న భయం పట్టుకొంది.

రాత్రి కలత నిద్రపోయి చంద్రశేఖర్‌ పొద్దునే లేచి చూసుకొనే సరికి అతని పర్స్‌ కనబడలేదు. తండ్రి తిడతాడన్న భయంతో ఆయనకు ఆ విషయం చెప్పలేదు. సుందరానికి  ఏమైంది అన్న ఆందోళన చంద్రశేఖర్‌ను వదలలేదు. తాను కొట్టిన దెబ్బకు వాడు చనిపోయివుంటే.. అన్న భయం పీడించసాగింది.

చంద్రశేఖర్‌ స్నానం చేసి యాక్సిడెంట్‌ జరిగిన ప్రదేశం దగ్గరికి వెళ్లాడు. బైక్‌ కొంచెం దూరంలో పార్క్‌ చేసి ప్రమాదం జరిగిన కరెంటు స్థంభం వద్ద పర్స్‌ కోసం వెతికాడు. అది కనబడకపోయేసరికి, మూడిళ్ల అవతలవున్న సుందరం ఇంటివైపు వెళ్లాడు.

ఆ ఇల్లు తాళంవేసి వుంది. హఠాత్తుగా కాళిదాసు ఇంటి బయటకు వచ్చి చంద్రశేఖర్‌ చేయి పట్టుకొన్నాడు. ‘నీవల్ల సుందరం చనిపోయాడు. బాడీని తీసుకురావడానికి వాళ్లవాళ్లు హాస్పిటల్‌కు వెళ్లారు. నిన్ను పోలీసులకు అప్పజెప్పాలి’ అని కేకలు వేయసాగాడు.

అతని చేయి విదిలించుకుని బైక్‌ స్టార్ట్‌చేసి వేగంగా ఇంటికి వెళ్లిపోయాడు చంద్రశేఖర్‌. ఆరోజు మధ్యాహ్నమే చెన్నై లా కాలేజీలో చేరిపోయాడు. చాలా కాలంపాటు నెల్లూరుకు రాకుండా చెన్నైలోనే వుండిపోయాడతను.

లా కోర్సు పూర్తయ్యాక చంద్రశేఖర్‌ చెన్నైలోనే లాయరుగా ప్రాక్టీసు చేస్తానని తండ్రికి చెప్పాడు. కొడుకు పట్టువీడక పోయేసరికి, అతని తండ్రి చెన్నైలో తనకు తెలిసిన సీనియర్‌ లాయర్‌ వద్ద అతన్ని జూనియర్‌గా  చేర్పించాడు. చెన్నైలోనే ఒక పెద్దింటి అమ్మాయిని వివాహం చేసుకొని అనతి కాలంలోనే లీడింగ్‌ లాయర్‌గా  పేరు సంపాదించుకున్నాడు చంద్రశేఖర్‌.

ఇన్నేళ్లకు కాళిదాసు మళ్లీ ఇలా కనిపించడంతో చంద్రశేఖర్‌ పై ప్రాణాలు పైనే పోయాయి.
∙∙ 
మరుసటి రోజు వుదయం చంద్రశేఖర్‌ ఆఫీసులో క్లయింట్లతో మాట్లాడుతుండగా.. కాళిదాసు వచ్చాడు.  అతడిని పక్కగదికి తీసుకువెళ్లి మాట్లాడాడు చంద్రశేఖర్‌.

‘నువ్వు రాయితో కొట్టిన దెబ్బకు సుందరం చనిపోయాడు. అతని భార్య, పిల్లలు అనాథలయ్యారు. సుందరం షర్టుపైన నీ వేలిముద్రలు దొరికాయి పోలీసులకు. ఎలాగూ నేను, రాజు సాక్షులుగా వున్నాం. పోలీసు కేసు నమోదైంది. కానీ నీ వివరాలు పోలీసులకు తెలియలేదు. నెల్లూరు చుట్టుపక్కల ఎంత వెతికినా, నువ్వెక్కడున్నావో తెలియలేదు. అనుకోకుండా మద్రాసు వచ్చాను. నీ ఆచూకీ పోలీసులకు తెలపాలంటే ఒక్క ఫోన్‌ కాల్‌ చాలు’ కఠినంగా అన్నాడు కాళిదాసు.

భయంతో కాళ్లు, చేతులు ఆడలేదు చంద్రశేఖర్‌కు. ‘వద్దు, ఆపని చేయద్దు. ఏదో భార్య, పిల్లలతో పరువుగా బతుకుతున్నాను’ అంటూ బతిమాలాడు. కాళిదాసు చిన్నగా నవ్వి ‘నాకు ఖర్చులు ఎక్కువగా వున్నాయి. ఒక రెండు లక్షలు ఇవ్వు’ అన్నాడు. చంద్రశేఖర్‌ ఇంట్లోకి వెళ్లి కాళిదాసుకు డబ్బు తెచ్చిచ్చాడు. కాళిదాసు వెళ్లిపోయాడు.
∙∙ 
మళ్లీ రెండురోజుల తరువాత కాళిదాసు నుండి కాల్‌ వచ్చింది చంద్రశేఖర్‌కు..‘చాలా అవసరంలో వున్నాను. రెండు రోజుల్లో ఒక పదిలక్షలు అందజెయ్యి’ అంటూ. ‘నెలరోజుల్లో నా కూతురి పెళ్లి వుంది. చాలా ఖర్చులున్నాయి. అంతడబ్బు సర్దలేను’ చెప్పాడు చంద్రశేఖర్‌. ‘అయితే నేను నేరుగా పోలీసుల వద్దకు వెళ్తాను. కూతురి పెళ్లికి ముందు నువ్వు అరెస్ట్‌ కావడం బాగుండదుకదా’ అన్నాడు కాళిదాసు. ‘వద్దు, వద్దు, ఎలాగోలా నీకు డబ్బు అడ్జస్ట్‌ చేస్తాను’  కంగారుగా చంద్రశేఖర్‌.
∙∙ 
చంద్రశేఖర్‌ చెప్పేదంతా సావకాశంగా విన్నాడు డిటెక్టివ్‌ వినోద్‌. ‘ఆ సుందరం నెల్లూరులో వున్న వీధి, ఇతర వివరాలు నాకు ఇవ్వండి. అలాగే అప్పటి మీ మిత్రుల వివరాలూ కావాలి’ అన్నాడు వినోద్‌. చంద్రశేఖర్‌ ఆ వివరాలన్నిటినీ వినోద్‌కు ఇస్తూ ‘సార్, ఈ దర్యాప్తు రహస్యంగా చేయండి. ఎలాగైనా నన్నీ సమస్య నుండి బయట పడేయండి’ అన్నాడు వేడుకోలుగా.
∙∙ 
సుందరం అప్పట్లో వున్న వీధికి వెళ్లాడు వినోద్‌. ఆ వీధిలో చాలామంది కొత్తగా వచ్చారు. వారికి సుందరం గురించి తెలియదు. వీధి చివర్లో పచారీకొట్టు నడుపుతున్న చలమయ్య ముప్పై ఏళ్ల నుండీ ఆ వీధిలోనే వున్నట్లు తెలిసింది వినోద్‌కు.

‘సుందరమా? అతనికి యాక్సిడెంటైంది. వాళ్ల వాళ్లు ఇల్లు ఖాళీచేసి టెక్కేమిట్ట ప్రాంతానికి వెళ్లిపోయారు’ చెప్పాడు చలమయ్య. అక్కడ వారెక్కడ వుండేదీ తనకు తెలియదన్నాడు. రాజు మాత్రం ట్రంక్‌ రోడ్లో ఏదో బట్టల కొట్టులో పనిచేసేవాడని వివరమందించాడు చలమయ్య.

ట్రంక్‌ రోడ్లో పది, పన్నెండు బట్టల దుకాణాల్లో విచారిస్తే ఒక షాపు యజమాని రాజు పేరు గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘మా షాపు పక్కన మరో బట్టల కొట్టు వుండేది. రాజు అక్కడ పనిచేసేవాడు. ఆ షాపు మూతపడ్డాక అతను ఒకసారి కనిపించి ఏదో పెద్ద ఫర్నిచర్‌ మార్కెట్‌లో  సేల్స్‌మన్‌గా  చేరానన్నాడు’ అని చెప్పాడు.

వినోద్‌ కొన్ని ఫర్నిచర్‌ షాప్స్‌ తిరిగాక రాజు దొరికాడు అతనికి. తనను తాను సుందరం బాల్యమిత్రుడిగా పరిచయం చేసుకున్నాడు వినోద్‌. ‘సుందరం అన్నయ్య ఏసీ మహల్‌ సెంటర్లో ఫ్యాన్సీ షాపులో పనిచేస్తాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాడు. కాసేపు వుండండి, మనం వెళ్దాం’ అన్నాడు రాజు.

వినోద్‌ ఆశ్చర్యపోయాడు. ‘ సుందరం బతికేవున్నాడా..!’ .  మధ్యాహ్నం రాజుతో కలసి సుందరం ఇంటికి వెళ్లాడు. ‘చంద్రశేఖర్‌ వల్ల మాకు మేలే జరిగింది. అతని పర్స్‌ కరెంట్‌ స్థంభం దగ్గర నాకు దొరికింది. అందులో చాలా డబ్బుంది. నేను తలదెబ్బకు చికిత్స చేసుకున్న తరువాత మిగిలిన డబ్బుతో ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాను.

కాలం కలిసొచ్చి ఇంకో రెండు ఫ్యాన్సీ షాపులు నడుపుతున్నాను’ చెప్పాడు సుందరం. కాళిదాసు గురించి అడిగితే.. ‘వాడొక వెధవ. అందరి దగ్గరా అప్పులు చేసి తాగుడు, డ్రగ్స్‌కి  తగలేశాడు. తంతారని భయపడి ఎక్కడికో పారిపోయాడు’ అని చెప్పాడు రాజు. తాను తెచ్చిన ఆపిల్స్‌ను సుందరానికి అందజేసి సెలవు తీసుకున్నాడు వినోద్‌. 
∙∙ 
కాళిదాసు నుండి మళ్లీ ఫోన్‌ వచ్చింది చంద్రశేఖర్‌కు. ‘నువ్వు నా గురించి డిటెక్టివ్‌ను పంపావని నాకు తెలిసిపోయింది. మళ్లీ ఎక్కడ కలుసుకోవాలో చెప్తాను’ అని ఫోన్‌ కట్‌ చేశాడతను.

వినోద్‌ సలహా మీద చంద్రశేఖర్‌ పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చాడు. వారికి కాళిదాసు ఎక్కడ దొరుకుతాడో తెలియలేదు. ‘డ్రగ్స్‌ అలవాటున్న వాళ్లు కచ్చితంగా అవి అమ్మే ప్రదేశాలకు రెండు, మూడు రోజులకు ఒకసారైనా వస్తారు’ అన్నాడు వినోద్‌. వినోద్‌ సలహాపై పోలీసులు ఆ ప్రదేశాల్లో నిఘా వుంచారు. రెండు రోజుల్లో కాళిదాసు ఒక డీలర్‌ దగ్గర డ్రగ్స్‌ కొంటూ దొరికిపోయాడు పోలీసులకు.
 -∙రాచపూటి రమేశ్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top