క్లూషియల్‌: క్రైమ్‌ సీన్‌.. | Sakshi Funday Crime Stories | Sakshi
Sakshi News home page

క్లూషియల్‌: క్రైమ్‌ సీన్‌..

Mar 29 2026 8:10 AM | Updated on Mar 29 2026 8:10 AM

Sakshi Funday Crime Stories

రాత్రి పది గంటలు . క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు అప్పుడే అక్కడకు చేరుకున్నాడు.వెంటనే క్లూస్‌ టీమ్‌ అతని దగ్గరికి వచ్చి చెప్పింది. ‘ఫుడ్‌ పాయిజనింగ్‌..,  ఒక విధంగా విషప్రయోగం... పూర్తి రిపోర్ట్స్‌ వెంటనే అందేలా ఏర్పాటు చేస్తాం’,,, ఆ మాట వింటూనే మరణించిన తన పదహారేళ్ళ కూతురు లీల శవం దగ్గర నుంచి లేచి వచ్చి, ‘నాకు తెలుసు ఇన్‌స్పెక్టర్‌ ఇదంతా నా రెండో భార్యే చేసింది. సవతి తల్లి కదా’... తన కూతురి  దగ్గర ఏడుస్తూ  కూర్చున్న రెండో భార్య నీలవేణి వైపు కోపంగా చూస్తూ అన్నాడు దివాకర్‌. రెండు  గంటల్లో పోస్ట్‌ మార్టమ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఆర్సెనిక్‌ మూలకాన్ని ఎక్కువ మోతాదులో కలిసిన నూడుల్స్‌ తినడం వల్ల లీల చనిపోయినట్టు తేలింది. రోజూ నూడుల్స్‌ తినిపించే నీలవేణి ని చూస్తూ, ‘నా కూతురికి ఇష్టమని నూడుల్స్‌ తెస్తే, అందులోనే విషం కలిపి నా కూతురిని చంపిన ఈ రాక్షసిని ఉరి తీయాలి’ దివాకర్‌ అరుస్తున్నాడు.

ప్రతిఘటన లేకుండా, ఎలాంటి సమాధానం చెప్పకుండా పోలీసులకు సరెండర్‌ అయ్యింది నీలవేణి. ‘కేసును ఇంత త్వరగా క్లోజ్‌ చేస్తారనుకోలేదు. కూతురులాంటి బిడ్డను సవతితల్లి చంపుకుంది?’ కటకటాల్లో ఉన్న నీలవేణి వైపు చూస్తూ అన్నాడు డీసీపీ.ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు కస్టడీలో వున్న నీలవేణి దగ్గరికి వెళ్లి, ‘ఎందుకు చేశావీ పని?’ అడిగాడు. తలెత్తింది నీలవేణి.‘సవతితల్లిని కదా... నాకు పిల్లలు వద్దనుకున్నానుగా... వున్న బిడ్డను చంపుకుని హాయిగా బ్రతకాలని’ ఏడుస్తూ తల దించుకుంది... కన్నీళ్లు కనిపించకుండా...కారులో వెళ్తున్న ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు నీలవేణి మాటలను రీకలెక్ట్‌ చేసుకుంటున్నాడు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర కారు ఆగింది. యథాలాపంగా ఎడమ వైపు చూస్తుంటే హాస్పిటల్‌ కనిపించింది. కారును లెఫ్ట్‌ వైపు పోనించాడు. న్యాయాన్ని బతికించడానికి.

బార్‌ ముందు ఇన్‌స్పెక్టర్‌ కారు ఆగింది. లోపలకి  వెళ్లేసరికి ఒక టేబుల్‌ దగ్గర మందు కొడుతూ కనిపించాడు దివాకర్‌.అక్కడికి వెళ్లి అతను ముందు కూర్చుని, ‘నాకూ ఆర్డర్‌ చేయండి?’ అన్నాడు. దివాకర్‌ ఇన్‌స్పెక్టర్‌ను చూసి కంగారుపడ్డాడు. అంతలోనే సర్దుకుని, ‘నా కూతురి మరణాన్ని తట్టుకోలేక’... ‘మందు కొడుతున్నావా? ఆ మందులో ఆర్సెనిక్‌ విషాన్ని కలిపితే బాగుంటుంది. జైల్లో కూర్చుని’... ‘మీరేమంటున్నారు?’‘నీ కూతురు ఇష్టంగా తినే నూడుల్స్‌లో ఆర్సెనిక్‌ విషాన్ని కలిపావు. నీ రెండో భార్య నీ కూతురికి నూడుల్స్‌ తినిపిస్తుందని తెలిసి... నీ రెండో భార్య పెళ్లి కాగానే తనకు ఇక బిడ్డలు వద్దని, లీలే తన కూతురు అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకుంది... ఆ విషయాన్ని మీ ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా తెలుసుకున్నాను. 

ఆర్సెనిక్‌ విషం గురించి నువ్వు గూగుల్‌లో సెర్చ్‌ చేసి మరీ క్రైమ్‌ చేసినట్టు నీ మెయిల్‌ ద్వారా తెలిసింది. నువ్వు పనిచేస్తున్న కంపెనీలో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు చేసిన వరస్ట్‌ క్రైమ్‌’ చెప్పాడు. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి, దివాకర్‌ను అరెస్టు చేశారు. దివాకర్‌ కటకటాల్లోకి వెళ్ళాడు.కటకటాల నుంచి బయటకు వచ్చింది నీలవేణి.‘థాంక్యూ ఇన్స్‌పెక్టర్‌. నన్ను శిక్ష నుంచి బయట పడేసినందుకు కాదు, నా కూతురి ఆత్మ శాంతించేలా చేసినందుకు’... కన్నీళ్లతో  చెప్పింది, అభిమన్యు ముందు నిలబడి చేతులు జోడించి.‘చట్టాన్ని మాత్రమే కాదు. అమ్మ మనసునూ కాపాడటం నా బాధ్యత.’ చెప్పి ముందుకు కదిలాడు ఇన్సె్పక్టర్‌ అభిమన్యు .


∙శ్రీసుధామయి 

Advertisement
 
Advertisement
Advertisement