అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఫామింగ్’ అవార్డు

Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఫామింగ్’ అవార్డును ములుకనూరు సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అందుకున్నారు.
ప్రవీణ్‌రెడ్డి రైతు బాంధవుడు. అరవై ఏళ్ల ‘యువ’ కర్షకుడు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామ రైతుబిడ్డ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి. వ్యవసాయంలో డిగ్రీ చదివారు. మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రైతు సంక్షేమ సంస్థలకు ప్రవీణ్‌రెడ్డి ప్రెసిడెంటుగా, వైస్ ప్రెసిడెంటుగా ఉన్నారు. ఆసియాలోని ఉత్తమ సహకార సంఘాలలో ములుకనూరు సొసైటీ ఒకటి. ఆ సొసైటీకి 1987 నుంచీ ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. సొసైటీ తరఫున 18 గ్రామాల్లోని 7,600 మంది రైతులకు సమగ్ర సేవలు అందిస్తున్నారు. ఆ సొసైటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు ప్రవీణ్ రెడ్డి.
రైతు సాయానికి భరోసా
గత 62 ఏళ్ళ నుంచి రైతులకు అండదండగా ఉన్నాం. మా ప్రాంతంలో ఒక్క రైతు ఆత్మహత్య కూడా సంభవించలేదు. ఈ కృషిని సాక్షి గుర్తించడం ఎంతో సంతోషం సంతృప్తి ఇచ్చింది. ఈ స్ఫూర్తితో ఆర్ధికంగా బలోపేతం అయేందుకు గ్రామీణ ప్రాంత రైతులకి మరింతగా సహకారం అందిస్తాం.
– అలిగెరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ప్రెసిడెంట్, ముల్కనూర్ కో ఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్