అక్షర స్వరం

Rising from the Ashes: Inspiring story of womens resilience against illness and discrimination  - Sakshi

‘రచన చేయడం అంటే తెలుసుకోవడం కూడా’ అనే మాట ‘రైజింగ్‌ ఫ్రమ్‌ ది యాషెస్‌’ పుస్తక రచన కోసం కలం పట్టినప్పుడు కృతిక పాండేకు అనుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం మనల్ని బాధితుల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తక ప్రయాణం సానుభూతి కోసం కాదు. ‘మనలో వారి పట్ల చిన్న చూపు ఉంటే మార్చుకుందాం’ అని చెప్పడం. ‘వారితో కలిసి నడవండి’ అని చెప్పడం. ‘విజేతలకు కష్టాలు అడ్డు కాదు’ అనే సత్యాన్ని గుర్తు చేయడం...

అవమానాలు, అనుమానాలు, లింగవివక్ష, వేధింపులు, గృహహింసలు... స్త్రీలు ఎదుర్కొనే సకల సమస్యలకు సమాధానం చెబుతుంది ‘రైజింగ్‌ ఫ్రమ్‌ ది యాషెస్‌: ఎ జర్నీ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌’ పుస్తకం. ఇది కాల్పనిక ఊహల సమాహారం కాదు. నిజజీవితానికి చెందిన కథ.

నిమృత్‌కు చిన్నప్పటి నుంచి మూర్ఛ సమస్య ఉంది. ఆ సమస్య తనను నీడలా వెంటాడింది. ‘ఈ సమస్యతో స్కూల్‌కు ఎలా పంపుతాం?’ ‘ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళతావా? అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు?’  పెళ్లి వయసులోనూ ఆ సమస్య ముందుకు వచ్చింది.

‘మీ అమ్మాయికి మూర్ఛ సమస్య ఉందా? ముందే చెప్పి బతికించారు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిమృత్‌కు పెళ్లి జరగడం అనేది అతి కష్టం అనుకునే సందర్భంలో తన సమస్య తెలిసి కూడా ఒక కుటుంబం పెళ్లికి ఒప్పుకుంది. ‘మూర్ఛ’ కారణంగా సంసార జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. అయితే ముందు కనిపిస్తున్న ముండ్లబాటను చూసి భయపడలేదు నిమృత్‌. అక్కడే ఆగిపోయి ఉంటే, వెనుతిరిగి ఉంటే ఆమె జీవితం ఈ పుస్తకంలోకి వచ్చేది కాదు.

సమస్యను సవాలు చేసి ముందుకువెళ్లింది. కష్టాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచం గుర్తుంచుకోదగిన అసాధారణ విజయలేమీ ఆమె సాధించకపోవచ్చు. అయితే తన జీవితాన్ని జయించింది. కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ఇచ్చింది. తనలాంటి వారెందరికో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఆరోగ్య స్థితిని బట్టి ఎవరూ నిర్లక్ష్యానికి గురి కావద్దు. వారికి సహాయంగా నిలవండి. వారి అడుగులు ముందుకు పడడానికి సహకరించండి’ అని ఈ పుస్తకం సందేశం ఇస్తుంది.

కృతిక పాండే ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగం హెడ్‌గా పనిచేస్తోంది.  బెంగళూరులో గ్రాడ్యుయేషన్‌ చేసిన కృతిక దిల్లీలో డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సు చేసింది. డెహ్రడూన్‌కు చెందిన కృతిక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘మిత్ర జ్యోతి ట్రస్ట్‌’కు ఇవ్వనుంది కృతిక.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top