Rajasthan: సూపర్‌ ఆయు, పిహు.. కోటిన్నర సబ్‌స్క్రైబర్స్‌

Rajasthan: Aayu And Pihu Show Youtube Channel Successful Journey - Sakshi

షో అదిరింది!

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదైనా సరే ‘ది బెస్ట్‌’ ఇవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో పిల్లల కోసం కష్టపడడమేగాక, మరికొన్నిసార్లు వాళ్లు కూడా చిన్నపిల్లల్లా మారిపోతుంటారు. అచ్చం ఇలాగే మారిపోయిన... ఆయు, పిహు తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. అందులో పిల్లలతోపాటు తాము కూడా వివిధ రకాల ఆటలలో పాల్గొంటూ ఆ వీడియోలను తమ ఛానల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. కంటెంట్‌ ఆసక్తికరంగా ఉండడంతో ప్రస్తుతం వీరి ఛానల్‌ కిడ్స్‌ విభాగంలో దాదాపు కోటిన్నర సబ్‌స్క్రైబర్స్‌తో టాప్‌టెన్‌లో దూసుకుపోతోంది. 

రాజస్థాన్‌లోని కోటా నగరానికి చెందిన పియూష్, రుచి కల్రా దంపతులకు 2007 ఏప్రిల్‌ 2న ప్రకృతి(పిహు), 2013 ఆగస్టు 27న ఆయుష్‌(ఆయు)లు పుట్టారు. ఆయుకు మూడున్నర ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి ఆన్‌లైన్‌లో చూసే అన్‌ బాక్సింగ్, రివ్యూ వీడియోలను ఆసక్తిగా గమనించేవాడు. రోజూ తను చూసే వీడియోలను ఆయు ఇష్టపడుతుండడంతో పిల్లలకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఆయుకు చూపించాలని పియూష్‌కు అనిపించింది. అయితే పిల్లల వీడియోలు దాదాపు అన్నీ యానిమేటెడ్‌వే కావడం, కొన్ని హిందీలో లేకపోవడంతోపాటు లైవ్‌గా ఎవరైనా యాక్షన్‌ చేసి చెప్పేవి కూడా ఏవీ కనిపించలేదు.

పిల్లలకు మరిన్ని విషయాలు నేర్పించాలంటే మాతృ భాషలోనే ఉంటే బావుంటుందని ఆయన 2017 మేలో ‘ఆయు అండ్‌ పిహు షో’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ షోలో ఐదేళ్ల ఆయు, పదకొండేళ్ల పిహులు పిల్లలకు నచ్చే నీతి కథలు, మంచి అలవాట్లు, వివిధ రకాల పోటీలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేసేవారు. పిల్లలతో ప్రారంభించిన ఛానల్‌ అయినప్పటికీ ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దేందుకు లైటింగ్, కెమెరా, హై ఎండ్‌ గేమింగ్‌ ల్యాప్‌ టాప్‌ను ఏర్పాటు చేసి, పిల్లలు కంటెంట్‌ను క్రియేట్‌ చేస్తుంటే పియూష్, రుచిలు వాటిని షూట్‌ చేయడం, స్క్రిప్ట్‌ రెడీ చేయడం, ఎడిట్‌ చేయడంతోపాటు, షోలో లోటుపాట్లను సరిచేసేవారు.

వాస్తవికథలతో...
ప్రారంభంలో కుకింగ్‌ పాఠాలు, మంచి అలవాట్ల పైన వీడియోలు రూపొందించి ఛానల్లో అప్‌లోడ్‌ చేసేవారు. మేలో ఛానల్‌ ప్రారంభించినప్పటికీ మరుసటి ఏడాది మార్చివరకు సబ్‌స్కైబర్స్‌ సంఖ్య వెయ్యి లోపే ఉండేది. నీతికథలను మరింత బాగా చెప్పగలిగితే వ్యూవర్స్‌ సంఖ్య పెరుగుతుందన్న  ఆలోచన రావడంతో...అప్పటి వరకు వినని హిందీ నీతి కథలను ప్రత్యేకంగా రూపొందించి వినిపించడం ప్రారంభించారు. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కథలుగా చెప్పడం, నీతితోపాటు కాస్త కామెడీ కూడా ఉండేలా కథలను తయారు చేసి ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసేవాళ్లు. దీంతో ఛానల్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ‘ఏక్‌ జూట్‌’(అబద్దం) వీడియోకు ఏకంగా 11 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. 

కోటికి పైగా సబ్‌స్క్రైబర్స్‌...
నీతికథల వీడియోలు షూట్‌ చేయడానికి ఎక్కువ సమయం పడుతుండడంతో.. వీటితోపాటు ఛాలెంజింగ్‌ వీడియోలు చేసి అప్‌లోడ్‌ చేసేవారు. ప్రతి గురువారం కొత్త వీడియో, లఘు చిత్రాలు, చాలెంజింగ్‌ గేమ్‌లు, ఫ్యామిలీ కామెడీ, యాక్టివిటీ లెర్నింగ్‌ కామెడీ వీడియోలను అప్‌లోడ్‌ చేయడంతో.. 2018 జూన్‌ నాటికి ఆయు అండ్‌ పిహు షో లక్షమంది సబ్‌స్క్రైబర్ల ను దాటేసింది. సెప్టెంబర్‌ వచ్చేటప్పటికి ఈ సంఖ్య ఆరు లక్షలకు చేరింది.

వీరి ఛానల్‌ వేగంగా పాపులర్‌ అవ్వడానికి కారణం ఆయు, పియూలే. అక్కాతమ్ముడు అన్ని యాక్టివిటీల్లో చురుకుగా పాల్గొని వ్యూవర్స్‌ను ఆకట్టుకోవడంతో సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య కోటీ నలభైలక్షలకు చేరింది. ఆయు పిహులతోపాటు తల్లిదండ్రులు పియూష్, రుచిలుకూడా యాక్టివిటీల్లో పాల్గొనడం విశేషం. ఇప్పటికే వీరి ఛానల్‌కు సిల్వర్, గోల్డ్, డైమండ్‌ బటన్‌లు కూడా వచ్చాయి. ప్రస్తుతమున్న కిడ్స్‌ యూ ట్యూబ్‌ ఛానళ్లల్లో టాప్‌ ప్లేస్‌లో దూసుకుపోతున్న వాటిలో ఆయు అండ్‌ పిహు షో కూడా ఒకటిగా ఉంది.

చదవండి:  వరకట్న హత్యలు: జాగ్రత్త... ఉద్యోగం ఊడుతుంది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top