Pragnya Ayyagari Confident To Win 2023 Miss Supra International In Poland - Sakshi
Sakshi News home page

Pragnya Ayyagari: అమ్మని ఒప్పించడానికి చాలా కష్టపడ్డా.. ఇప్పుడు అందరూ హ్యాపీ!

Nov 12 2022 7:31 PM | Updated on Nov 12 2022 8:25 PM

Pragnya Ayyagari Confident to Win 2023 Miss Supra International in Poland - Sakshi

ప్రజ్ఞ అయ్యగారి (ఇన్‌స్టా ఫొటోలు)

నాన్న త్వరగానే ఒప్పుకున్నా, అమ్మని ఒప్పించడానికి మరింత కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం అందరూ హ్యాపీ. 

‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిలు ఆత్మవిశ్వాసం వదులుకోకూడదని, కలల్ని విజయాలుగా మలచుకోవాలని’’ అంటోంది హైదరాబాద్‌ వాసి ప్రజ్ఞ అయ్యగారి... అంతర్జాతీయ పోటీల్లో టైటిల్‌ గెలుస్తానని అదే ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. కుష్టువ్యాధి బాధితులకు బాసటగా ససాకవా లెప్రసి ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్‌ ఫోరమ్‌ ఆఫ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ పేరిట నిర్వహించిన సదస్సుకు బ్రెజిల్‌ సుందరి లెటికా సెజర్‌తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...


సికింద్రాబాద్‌లో మా కుటుంబం నివసిస్తోంది. హిమాయత్‌నగర్‌లోని ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నాను. గ్లామర్‌ రంగంలో రాణిస్తూనే సస్టెయినబుల్‌ ఫ్యాషన్‌కు సంబంధించి డిజైనర్‌గా రాణించాలనేదే నా లక్ష్యం.


నొప్పించకుండా ఒప్పించాను

గ్లామర్‌ రంగంలోకి ప్రవేశిస్తానని చెప్పడానికి కూడా సంకోచించాల్సినంత  సంప్రదాయ కుటుంబం మాది. మా బంధుమిత్రుల్లో ఎవరూ ఈ రంగంలో అడుగుపెట్టింది లేదు. అయితే నాలో ఒకసారి ఈ ఆలోచన వచ్చి, గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత... రెండేళ్లపాటు మా ఇంట్లోవాళ్లని దశలవారీగా ఒప్పిస్తూ వచ్చాను. దీనిలో భాగంగా ఎంతో మంది బ్యూటీక్వీన్‌ల విజయగాధలను వివరించాను. నాన్న త్వరగానే ఒప్పుకున్నా, అమ్మని ఒప్పించడానికి మరింత కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం అందరూ హ్యాపీ. 


ఒకడుగు వెనక్కు

కేవలం 17 ఏళ్ల వయసులో మిస్‌ వరల్డ్‌ అయిన మానుషి చిల్లర్‌ నాకు స్ఫూర్తి. గత మిస్‌ ఇండియాలో కాంటెస్ట్‌ చేసి గెలుపొందకపోయినా, ఆ తర్వాత ఆగస్టులో జరిగిన లివా మిస్‌ దివా సుప్రానేషనల్‌ గెలిచాను. తద్వారా వచ్చే జులై–ఆగస్టు మధ్య పోలండ్‌లో జరిగే మిస్‌ సుప్రా ఇంటర్నేషనల్‌కు పోటీపడుతున్నా (ఈ పోటీల్లో ఇప్పటికి భారత్‌ రెండుసార్లు మాత్రమే ఈ కిరీటం గెలుచుకుంది. ఇందులో కేజీఎఫ్‌ హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి ఒకరు)


ఇటు నృత్యం అటు చెస్‌

హాబీల విషయానికి వస్తే.. పుస్తకాలు బాగా చదువుతాను. హాబీలకు మించింది నా భరతనాట్య అభిరుచి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చాను. అలాగే చదరంగంలో కూడా ఇంటర్‌ స్కూల్‌ టోర్నమెంట్స్‌లో ఆడిన అనుభవం ఉంది. నువ్వు కలగన్నావంటే గెలుస్తావన్నట్టే అన్న ఆంగ్లోక్తిని నమ్ముతాను... అందుకే కలలు కంటున్నాను... గెలుపును నమ్ముతున్నాను’’ అని చెబుతున్న ప్రజ్ఞ కలలు నెరవేరాలని కోరుకుందాం. (క్లిక్: ఈ పని చేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుందన్నారు.. కానీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement