
ప్రతి ఒక్కరూ పచ్చని ప్రకృతిని చూస్తే పరవశించిపోతారు. అలాంటి పచ్చని ప్రకృతి మన ఇంట్లోనే ఉంటే ఇటు కంటికి.. అటు ఒంటికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వర్షాకాలం కావడంతో నగరంలో నర్సరీలు పూలు, పండ్లు, ఆయుర్వేదం మొక్కలతో అమ్మకాలకు సిద్ధమయ్యాయి. అదే తరహాలో కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఇంటి అలంకరణలో భాగంగా మొక్కలు పెంచేందుకు రంగు రంగుల కుండీలు సైతం ఆకర్షిస్తున్నాయి. హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని కొత్తకుంట చెరువు కట్టపై ఆర్టీసీ కాలనీ వద్ద, జాతీయ రహదారి జెనిసిస్ స్కూల్ వద్ద నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇవి మొక్కల ప్రేమికులను, కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కడియం నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి అమ్మకందారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. గత పదేళ్లుగా కూకట్‌పల్లిలోని హౌసింగ్ బోర్డులో నర్సరీలు ఏర్పాటు చేసేవారు మొక్కల అమ్మకాలకు డిమాండ్ ఏర్పడటంతో మియాపూర్, హఫీజ్‌పేట్ పరిసర ప్రాంతాల్లోనూ విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కుటుంబాలకు నర్సరీలే జీవనాధారం. ఈ నర్సరీల్లో 500ల రకాల వరకూ వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేస్తారు. అలంకరణ మొక్కలు, పూల మొక్కలు, ఆయుర్వేదం, పండ్ల జాతులు అమ్మకాలకు ఉంచుతారు.
ఇతర ఉత్పత్తులు..
మొక్కల పెంపకానికి కావాల్సిన వివిధ రకాల మోడళ్లలో రంగు రంగుల కుండీలు, సేంద్రీయ ఎరువులు, వర్మీ కంపోస్టు, కోకోపిట్, ఆయుర్వేదం, పండ్లు, పూలు, అలంకరణ మొక్కలకు కావాల్సిన పురుగు మందులు, ఇళ్లలోకి కీటకాలను నివారించే మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో పాటు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసే లాన్ కూడా సప్లై చేస్తున్నారు. కుండీలు రూ.20 నుంచి రూ.350 వరకూ అమ్ముతున్నారు.
పూల మొక్కలకు గిరాకీ..
గులాబీ, చామంతి, మందారం, అలంకరణ పూలు వంటివి సుమారు 300 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్ అండ్ అవుట్ డోర్ మొక్కలు, తులసిలో లక్ష్మీ, కృష్ణ, శివుడి పూజకు బిల్వపత్రం, శంకం పూలు, పారిజాతం, ఉసిరి, జమ్మి వంటి మొక్కలు అమ్మకానికి ఉన్నాయి. వీటిలో రూ.30 నుంచి రూ.350 వరకూ ధరల్లో విక్రయిస్తున్నారు.
ఆయుర్వేదం, పండ్ల మొక్కలు..
వివిధ రకాల రోగాలను నియంత్రించడంలో ఉపయోగపడే ఆయుర్వేదం మొక్కలైన తులసి, కలబంద, నల్లేరు, రణపాల, గరిక, తిప్పతీగ, మారేడు మొక్కలతోపాటు పండ్ల మొక్కలైన సపోట, దానిమ్మ, జామ, మామిడి, అంగూర్, నిమ్మ తదితర హైబ్రిడ్ మొక్కలు అలరిస్తున్నాయి. దోమలను నివారించే లెమన్ గ్రాస్, లావెండర్, పుదీన, సిటోన్రెల్లా వంటి అనేక మొక్కలు ఉన్నాయి.
నర్సరీ ఏర్పాటు సంతోషకరం..
కొత్తకుంట చెరువు కట్టపై నర్సరీ ఏర్పాటు సంతోషకరం.. కాలనీ వాసులు ఇష్టానుసారం చెత్త వేస్తున్న నేపథ్యంలో అదే స్థలంలో మొక్కలు పెంచడం మంచిపరిణామం. చెరువు నీరు మొక్కల ఎదుగుదలకు ఉపయోగం. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు అమ్మకానికి అందుబాటులో ఉంచారు.
– సురేష్ మదీనాగూడ
ఆయుర్వేద మొక్కలకు గిరాకీ..
ఇటీవలి కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఆయుర్వేద మొక్కలకు గిరాకీ పెరిగింది. దీంతో పాటు కీటకాలను నివారించే కొన్ని రగకాల గడ్డిజాతి మొక్కలకు కూడా డిమాండ్ ఏర్పడింది.
– రాజు, నర్సరీ నిర్వాహకుడు