కళలకు వారధి

Morii Design Founder Brinda Dudhat Special Story - Sakshi

ఆధునిక బ్రాండ్లు ఎన్ని వచ్చినా   ప్రపంచం చూపు హస్త కళలవైపే  అనేది నూటికి నూరు పాళ్లు వాస్తవం. ప్రాచీన కళను ఆధునిక కాలానికి  తీసుకురావడానికి ఓ వారధిగా కృషి చేస్తున్నారు గుజరాత్‌ వాసి అయిన బృందాదత్‌. భారతీయ హస్త కళల సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ కళావారధి తెలంగాణ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ నుంచి క్రాఫ్ట్‌ ప్రెన్యూర్‌ సన్మాన్‌ అవార్డు అందుకున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన బృందా హస్తకళల గురించి ‘దేశంలో కళాకారులు ఏ మూలన ఉన్నా అక్కడ నేనుంటాను’ అని తెలిపారు. బృందాదత్‌ ఎంచుకున్న మార్గం గురించి మరింత వివరంగా.. 

భారతీయ హస్తకళల పట్ల అపారమైన గౌరవం, ఆధునిక భావాల అభిరుచితో భూత–భవిష్యత్తుల కలయికగా ‘మోరీ డైనమిక్‌ డిజైన్‌ స్టూడియో’ను గుజరాత్‌లోని గాం«దీనగర్‌లో 2019లో ప్రారంభించారు బృందాదత్‌. దేశం నలుమూలల నుండి క్రాఫ్ట్‌ కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తూ, తన అనుభవాన్ని మెరుగుపరుచుకుంటూ కళ ఎప్పటికీ నిలిచేలా వినూత్న డిజైన్లను రూపొందిస్తున్నారు ఆమె. ఎంతో మంది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు.  

హస్తకళా నైపుణ్యంలో మహిళలు

నిరంతర సాధన అవసరం 
బృందాదత్‌ అహ్మదాబాద్‌ ఎన్‌ఐడి నుండి టెక్స్‌టైల్‌ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. తన చదువుకు సార్ధకత చేకూరే పనిని ఎంచుకోవాలనుకున్నారు. అందుకు తగినట్టుగా ఆమె దృష్టి గ్రామీణ భారతం వైపుగా కదలింది. భారతీయ మూలాల్లో ఎన్నో ప్రాచీన కళలున్నాయి. అవన్నీ అత్యంత సామాన్యులు అనదగిన వారి చేతిలోనే రూపుదిద్దుకున్నాయి. అలాంటివారిని తన డిజైన్‌ స్టూడియోలో ఒక సభ్యునిగా చేర్చుకుంటారు. ‘ప్రతి కళాకారుడూ తన కళలో పూర్తి హృదయాన్ని పెడతాడు. ఆ కళాకారుడు సృష్టించినదానిపట్ల అతనికే పూర్తి యాజమాన్య హక్కు, బాధ్యత ఉంటుంది. అప్పుడే ఆ కళ జీవిస్తుంది. హస్తకళలు పునరుద్ధరింపబడాలంటే ఇందులో నిరంతర సాధన చాలా అవసరం. ఆ దిశగానే నా ప్రయత్నాలు ఉంటున్నాయి. గ్రామాల్లోని మహిళల చేతిలో ఉన్న కళను మరికొందరికి పంచి, వాటి ద్వారా ఇంకొంత మంది కళాకారులను తయారుచేయాలన్నదే నా లక్ష్యం’ అంటారు ఈ డిజైనర్‌. ఇందులో భాగంగానే స్త్రీ, పురుషుల గార్మెంట్స్‌తో పాటు ఇంటీరియర్‌లో ఉపయోగించే వాల్‌ ఆర్ట్స్, కుషన్స్‌... వంటివెన్నో కళాత్మకంగా రూపొందిస్తున్నారు.  

కళాకారుల గొలుసు
హస్తకళలను పునరుద్ధరించాలంటే అందుకు అత్యంత సమర్ధులైన బృందాన్ని ఏర్పాటుచేసుకోవడం ముఖ్యం. తమ ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగడానికి రోజు రోజుకు పెరుగుతున్న కళాకారుల బృందమే అంటారీ యువ కళాకారిణి. ‘మా కళాకారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటూ చరిత్రను ముందు తరాల వారికి మరింత వినూత్నంగా తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నారు. కళాకారుల కమ్యూనిటీల నైపుణ్యాలను పెంచడం ద్వారానే మా కళాకృతులను వృద్ధి చేస్తున్నాం. ఈ విధంగా భారతీయ గ్రామాలలోని నిపుణులైన కళాకారుల జీవనోపాధిని మెరుగుపరిచే గొలుసును సృష్టించడం మేం చేస్తున్న ప్రధానమైన పని. దానికి మా డిజైనర్‌ స్టూడియో ఒక కూడలిలాంటిది. మేం ఉపయోగించే ముడిసరుకంతా స్థానికంగానే లభిస్తుంది. సేంద్రీయ కాటన్‌తో రూపొందించిన ఫ్యాబ్రిక్‌ మాత్రమే కాదు, సహజ రంగులను డిజైన్లలో ఉపయోగిస్తాం. ఇందుకోసం గ్రామాల్లోని కళాకారులకు వర్క్‌షాప్‌లను నెలలో రెండు సార్లు నిర్వహిస్తున్నాం. కళాకారులందరికీ వారి పనికి తగిన వేతనాలు చెల్లిస్తాం’ అని తెలియజేస్తారీ యువ డిజైనర్‌.  

అప్‌సైకిల్‌.. రీసైకిల్‌.. 
మన దేశ గ్రామీణం అభివృద్ధి పయనంలో సాగాలంటే యువచైతన్యం మూలాల్లో దాగున్న కళలను వెలికి తీసుకురావాలనే ఆలోచనను అందరిలోనూ కలిగిస్తున్నారు బృంద. ‘మా స్టూడియోలో ఏదీ వృథాగా పోదు. ప్రతి చిన్న క్లాత్‌ ముక్కను కూడా ప్యాచ్‌వర్క్‌గా ఉపయోగిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని కాళహస్తి, మచిలీపట్నం నుంచి తరతరాలుగా వస్తున్న కలంకారీ ఆర్ట్‌వర్క్‌ను తీసుకుంటున్నాం. బిహార్‌కి ప్రత్యేకమైన సుజ్ని అనే క్విల్ట్‌ల తయారీపై దృష్టి పెట్టాం. పాత క్లాత్‌లను కలిపి కుట్టే ఈ క్విల్ట్‌లు ఎంతో బాగుంటాయి. కచ్‌ ప్రాంతంలో ఉన్న కళాకృతులన్నీ మా డిజైన్స్‌లో ప్రతిఫలిస్తాయి. అంటే, అక్కడి కళామూలాలకు వెళ్లి, అక్కడి మహిళల హస్తకళను వృద్ధి చేసే పనిలో ఉంటున్నాం. ఇలా, దేశంలో ఏ ప్రాంతంలో ఏది ప్రత్యేకమైన ఆర్ట్‌ ఉందో తెలుసుకుంటూ, ఆ ప్రాంత కళాకారులతో మాట్లాడి వారి కళకు తగిన న్యాయం చేయడంపైనే దృష్టిపెడతాం’ అని తెలియజేస్తారు ఈ యువ కళావారధి.  
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top