Mehandi: హార్ట్‌ డిజైన్‌, పక్షి మూలాంశంతో డిజైన్‌... వీటి అర్థాలు తెలుసా?

Mehndi Significance And Here Are Some Designs Meanings Check - Sakshi

డిజైన్‌కో అర్థం

మెహెందీతో వేసే ప్రతీ అందమైన డిజైన్‌ వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకునే డిజైన్ల వల్ల కలిగే సానుకూల భావనలు మనలో అంతర్గత శక్తిని పెంచుతాయంటున్నారు మెహెందీ ఆర్టిస్ట్‌లు. ఈ సందర్భంగా పండగలు, వేడుకల్లో అతివల జీవితంలో భాగమైన మెహెందీ డిజైన్స్‌ గురించి...

మనకు తరతరాలుగా గోరింటాకు ఎర్రదనమే పరిచయం. వీటి మీద పుట్టిన పాటలు కూడా విదితమే. కానీ, మెహెందీ డిజైన్లు మాత్రం మనకు మధ్య యుగంలోనే పరిచయం అయినట్టు చరిత్ర చెబుతోంది. అయితే, ప్రతి అందమైన మెహెందీ డిజైన్‌ వెనుక ఓ అర్థం ఉందంటున్నారు నేటి మెహందీ డిజైనర్లు రకరకాల మెహందీ డిజైన్స్‌ గురించి వివరిస్తూ.. 

హార్ట్‌ డిజైన్‌...
గుండె ఆకృతిలో వేసే మెహెందీ డిజైన్‌ ఆధునిక శైలికి అద్దం పడుతుంది. చిన్న మూలాంశంతో హృదయాకారంలో వేసే మెహందీ డిజైన్‌ స్వచ్ఛతను, నమ్మకాన్ని సూచిస్తుంది. ఇది బంధానికి బలమైన పునాది అని నమ్ముతారు. ఈ కారణంగా, పెళ్లికూతురుకు వేసే మెహెందీ డిజైన్‌లో హార్ట్‌ షేప్‌ తప్పక మెరిసిపోతుంది. 

వధూవరుల డిజైన్‌...
చాలా వరకు పెళ్లిలో వధూవరులను మెహెందీ డిజైన్లలో చిత్రిస్తారు. వధూవరుల షెహనాయ్‌ కూడా ఉంటుంది. భార్యాభర్త ఎప్పటికీ విడిపోక అన్యోన్యంగా కలిసి ఉంటారనే సంకేతాన్ని ఇస్తుంది ఈ డిజైన్‌.

పక్షి మూలాంశంతో డిజైన్‌...
ప్రాచీన కాలంలో, పక్షి జీవితంలోని ఆనందాన్ని, స్వర్గానికి, భూమికి మధ్య గల సంబంధాన్ని తలపునకు తెస్తుంది. బర్డ్‌ మోటిఫ్‌ డిజైన్‌ ప్రజల స్వతంత్ర స్వభావాన్ని, వారి అంతర్గత ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది.

పువ్వుల డిజైన్‌...
పూల డిజైన్‌లు ఎవ్వరినైనా ఇష్టపడేలా చేస్తాయి. చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే, డిజైన్‌ వేయడం కూడా సులభం. ఇది వైవాహిక జీవితంలోని సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నం. పువ్వులు స్వచ్ఛతకు చిహ్నం. బురదలో వికసించే కమలం మనసును ఆకర్షిస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ డిజైన్‌ బంధం లోని సామరస్యత, ప్రేమ, శ్రేయస్సులకు సంకేతం. ఇది స్త్రీ సున్నితమైన స్వభావాన్ని, అందాన్ని చూపుతుంది. 

సర్కిల్‌ డిజైన్‌...
ఇది సులభమైన అత్యంత అందమైన డిజైన్‌. దీనిలో, చేతి మధ్యలో ఒక వృత్తం వేసి, దాని చుట్టూ, లోపల వివిధ రకాల డిజైన్లను సృష్టిస్తారు. హిందూ, బౌద్ధమతాలలో దీనిని మండలం అంటారు. ఇది విశ్వానికి చిహ్నం.

నెమలి డిజైన్‌...
పెళ్లికూతురు మెహెందీలో నెమలి డిజైన్‌ అత్యంత ఇష్టమైనది. మన దేశ జాతీయ పక్షి అందం, సృజనాత్మకతకు చిహ్నం. ఇది స్త్రీలోని దయను తెలియజేస్తుంది.

కలశం డిజైన్‌...
ఈ డిజైన్‌ మార్వాడీ సమాజంలో ఒక ట్రెండ్‌. పూర్ణ కుంభాన్ని నిండైన జీవితానికి పర్యాయపదంగా పరిగణిస్తారు పెద్దలు. ఎరుపును చిందించే కలశం శ్రేయస్సుకు, సంతోషానికి, సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు. 


చదవండి: Priyanka Panwar Success Story: ఆమెకు వంద ముఖాలు! అతడి మరణవార్త విని.. మొదటిసారి..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top