అడుగుతున్నా చెప్పండి

Licypriya kangujam Questions Narendra Modi About JEE And NEET Exams - Sakshi

ఏమిటింత కాలుష్యం! ఎందుకీ అలక్ష్యం?! మిమ్మల్నే మిస్టర్‌ మోడీ.. చెప్పండి. ఈ కరోనా టైమ్‌లో.. నీట్‌లేంటి, జేఈఈలేంటి?! అడుగుతున్నది లిసిప్రియా కంగుజమ్‌. ఎనిమిదేళ్ల బాలిక! 

ఎనిమిదేళ్లంటే బడికి వెళ్లే వయసు. కొందరికైతే ఇంకా బడిలో చేరని వయసు. లిసిప్రియా కంగుజమ్‌ ఐదో తరగతి చదువుతోంది. బుధవారం పని మీద ఢిల్లీ వెళ్లింది! ప్రధాని, రాష్ట్రపతుల కార్యాలయాలు తిరిగి పెద్ద మనుషుల్ని కలిసి వచ్చింది. అయితే ఆ అమ్మాయి మాత్రం.. ‘‘వాళ్లు పెద్ద మనుషులైతే నేను కలిసే అవసరం ఎందుకు వస్తుంది?’’ అంటోంది! ఈ మాటను తన ఆరవ యేట నుంచీ అంటోంది. గట్టి క్లయిమేట్‌ ‘లా’ ను తెమ్మంటోంది లిసిప్రియ. తెస్తే వాతావరణం కొంచెం క్లీన్, కొంచెం కూల్‌ అవుతుందని కదా అని ఆశ. పని కాలేదు. అందుకే పెద్ద మనుషులు కాదు అంటోంది. గత ఏడాది జూన్‌లో పార్లమెంటు భవనం ముందుకు వెళ్లి ప్లకార్డ్‌ ప్రదర్శించింది! చట్టాలు తెచ్చేందుకు టైమ్‌ పడుతుంది అని ఎవరైనా చెప్పకుండా ఉండి ఉంటారా? తెచ్చేవరకు గుర్తు చేస్తూనే ఉంటానని తను. గట్టి పట్టు మీదే ఉంది. 

ఇప్పుడేమంటుందీ.. కరోనా ఉన్నప్పుడు ప్రవేశ పరీక్షలు ఏంటీ అని. వాటిని పోస్ట్‌పోన్‌ చెయ్యమని అడగడానికే లిసిప్రియా ఢిల్లీ వెళ్లింది. అడగడమే. అభ్యర్థించదు. విజ్ఞప్తి చెయ్యదు. మోదీజీని ‘మిస్టర్‌ మోడీ’ అంటుంది! వేరెవర్నైనా అంతే. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని అయినా ‘మిస్టర్‌ గ్యుటెరస్‌’ అనే అంటుంది. ఆ పెద్దాయన్ని గత ఏడాది డిసెంబర్‌లో స్పెయిన్‌లో కలిసింది లిసిప్రియా. ఆ సెప్టెంబర్‌ 13న  మన దగ్గర ‘నీట్‌’ ప్రవేశ పరీక్ష ఉంది.

అదొకటే కాదు, జరగవలసిన పరీక్షలు చాలానే ఉన్నాయి. జె.ఇ.ఇ. మెయిన్‌ ఉంది. జె.ఇ.ఇ. అడ్వాన్డ్‌ ఉంది. థర్డ్‌ ఇయర్‌ యూనివర్సిటీ పరీక్షలు ఉన్నాయి. సీబీఎస్‌ఇ కంపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్స్‌ ఉన్నాయి. ఎన్‌డిఎ ఉంది. డి.యు.ఇ.టి. ఉంది. వీటన్నిటినీ తక్షణం వాయిదా వెయ్యమని లిసిప్రియా డిమాండ్‌. ‘పరీక్షలు రాసేవారు లక్షల్లో ఉంటారు. కరోనా ఎటాక్‌ అయితే పరిస్థితి ఏంటి?’ అని లిసిప్రియ ఆందోళన. సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఈ మాట చెప్పీ చెప్పీ రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ఇప్పుడు లిసిప్రియ తన చేతుల్లోకి తీసుకుంది సమస్యను.
వివిధ సందర్భాలలో లిసిప్రియ ప్రసంగాలు, ప్రదర్శనలు, ప్రాతినిధ్యాలు 

లిసిప్రియ మణిపూర్‌ యాక్టివిస్ట్‌. బెంగళూరు ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుతోంది. యాక్టివిస్ట్‌ అన్నది వయసుకు మించినమాటే కానీ.. ఇప్పటికే వాతావరణ పరిరక్షణ మీద కొన్ని అంతర్జాతీయ ప్రసంగాలు ఇచ్చింది! ఈ అమ్మాయిని ఇన్‌స్పైర్‌ చేసినవి కూడా సామాజిక కార్యకర్తల ప్రసంగాలే. డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలామ్‌ చిల్డ్రన్‌ అవార్డు, వరల్డ్‌ చిల్డ్రన్స్‌ పీస్‌ ప్రైజ్, ఇండియా పీజ్‌ ప్రైజ్, రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ఎర్త్‌ డే నెట్‌వర్క్, ఎస్‌.డి.జీస్‌ అంబాసిడర్‌ అవార్డు, నోబెల్‌ సిటిజన్‌ అవార్డు.. ఈ రెండుమూళ్లలోనే లిసిప్రియకు వచ్చేశాయి.

‘సుకీఫూ’ అనే ఒక కిట్‌ను కూడా తయారు చేసింది లిసిప్రియ. సుకీఫూ అంటే సర్వైవల్‌ కిట్‌ ఫర్‌ ద ఫ్యూచర్‌ శరీరంలోకి స్వచ్ఛమైన గాలిని పంపించే సాధనం అది. లిసిప్రియ తను చేసేది చేస్తోంది. అధికారంలో ఉన్నవాళ్లను కూడా ‘ఫ్రెష్‌ ఎయిర్‌’ కోసం ఏదైనా చేయమని అంటోంది. ఆచరించి చూపడం అంటే ఆదర్శంగా ఉండటమే కదా. ‘ఆదర్శం’ అనేది కూడా వయసుకు మించిన మాటే లిసిప్రియను అభినందించడానికి. కానీ తప్పదు. కాసేపు.. ఆదర్శమే ఆమెకన్నా చిన్న అనుకుంటే సరిపోతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top