Jasna Salim: ఆమె గీసిన కృష్ణుడు

Kerala Muslim Woman Jasna Salim Presents Her Krishna Painting In The Temple - Sakshi

న్యూస్‌మేకర్‌ 

ముళ్లపూడి వెంకటరమణ రాసిన ‘కానుక’కథ లో ఒక నిరుపేద గ్రామీణుడు కృష్ణుడికి కానుక ఇవ్వాలని వందలాది వేణువులు తయారు చేస్తాడు. కేరళకు చెందిన జస్నా సలీమ్‌ కృష్ణునికి కానుక ఇవ్వాలని వందలాది బొమ్మలు గీస్తోంది. ఆరేళ్ల పాటు ఆమె సాగించిన కళార్చన ఇప్పుడు ఫలితం పొందింది. ఇక మీదట ఆ గుడిలో ఒక ముస్లిం మహిళ గీసిన బొమ్మ కూడా మూలవిరాట్టుతో పాటు పూజలందుకోనుంది.

సెప్టెంబర్‌ 27, సోమవారం కేరళ కోజికోడ్‌ సమీపంలో ఉన్న పండలం అనే గ్రామంలోని ‘ఉలనాడు శ్రీకృష్ణ స్వామి దేవళం’లో 28 ఏళ్ల జస్నా తన ఇద్దరు కుమార్తెలతో ప్రవేశించింది. ఆమె శిరస్సు చుట్టు ముఖం కనిపించేలా బురఖా ఉంది. ఆమె చేతుల్లో వస్త్రంలో చుట్టిన ఒక ఫ్రేమ్‌ ఉంది. ఆ గుడిలోని పూజారులు ఆమెకు ఎదురు వచ్చారు. ఆమె చేతుల్లోని ఫ్రేమ్‌ను భక్తిగా అందుకున్నారు. దాని మీద వస్త్రాన్ని తొలగించారు. అది గాజు అద్దంపై గీసిన బాలకృష్ణుడి బొమ్మ. వెన్న తింటున్న కృష్ణుడి బొమ్మ.

ఆ బొమ్మను గర్భగుడి ఎదురుగా పీఠం మీద ఉంచి తులసిమాల ధరింపచేశారు. ఆ తర్వాత ఆ పటానికి పూజ చేశారు. అంతటితో జస్నా కల ఒకటి నెరవేరింది. గత ఆరేళ్లుగా ఆమె కృష్ణుడి బొమ్మను దేవుడి గుడిలో ఉంచాలని ఆశిస్తోంది. ఇప్పుడు నెరవేరింది. ముస్లిం మహిళ గీసిన కృష్ణుడి బొమ్మ ఇకపై పండలంలోని కృష్ణుడి గుడిలో పూజలు అందుకోనుంది. ఈ దేశంలో హిందూ ముస్లిం సామరస్యం శతాబ్దాలుగా ఉంది. ఇటువంటి స్పందనలు ఆ సామరస్యాన్ని చాటి చెబుతున్నాయని ఈ ఉదంతం చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒక్కటే బొమ్మ
జస్నా సలీమ్‌ ప్రొఫెషనల్‌ పెయింటర్‌ కాదు. ఆమె బొమ్మలు వేయడం నేర్చుకోలేదు. కాని బొమ్మలంటే ఆసక్తి. చిన్నప్పుడు కొన్ని బొమ్మలు గీసింది. కాలక్రమంలో ఆమెకు సలీంతో పెళ్లయ్యింది. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. సలీం దుబయ్‌లో కొన్నాళ్లు పెయింటర్‌గా పని చేసి తిరిగి వచ్చి ఇళ్లకు పెయింటింగ్‌ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరేళ్ల క్రితం జస్నాకు బొమ్మలు గీయాలనిపించింది. వాటిని అమ్మితే వేణ్ణీళ్లకు చన్నీళ్లులా ఉపయోగపడతాయనిపించింది.

‘నన్ను ఇంట్లో చిన్నప్పుడు ‘కన్నా’ అని పిలిచేవారు. ముస్లింల ఇళ్లల్లో కన్నా అని పిలువరు. అది కృష్ణుడి పేరు. కాని ఎందుకో నాకు అలా అలవాటైపోయింది. నేను బొమ్మలు వేయాలనుకున్నప్పుడు నాకు కృష్ణుడి బొమ్మే గుర్తుకు వచ్చింది. వెన్న తినే బాలకృష్ణుడి బొమ్మ నాకు చాలా ఇష్టం. దానిని చూస్తే మనసుకు ఎంతో బాగనిపిస్తుంది. అందుకే వెన్న తినే కృష్ణుడి బొమ్మను వేశాను. మొదటి బొమ్మను నా హిందూ మిత్రురాలికి ఇచ్చాను. వారు దానిని పూజ గదిలో పెట్టుకుంటే నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను రకరకాల కృష్ణుని బొమ్మలు వేయగలను కాని నాకు బాగా కుదిరేది వెన్న తినే కృష్ణుడి బొమ్మే. అదే పదే పదే వేస్తాను. దానిని జనం నా దగ్గర కొనుక్కుని వెళతారు’ అంటుంది జస్నా.


తను గీసిన కృష్ణుడి బొమ్మతో జస్నా

కొనేవారు.. అనేవారు
2015లో బొమ్మలు వేయడం మొదలెట్టిన జస్నా 2016లో కోజికోడ్‌లో తన కృష్ణుడి బొమ్మలతో ఎగ్జిబిషన్‌ పెట్టింది. అందరూ ముస్లిం మహిళ వేసిన ఆ బొమ్మలను కుతూహలంతో చూశారు. చాలామంది వాటిని కొన్నారు. ‘మీకు ఎటువంటి ప్రతిఘటన ఎదురు కాలేదా?’ అని అడిగితే ‘నా భర్త తరఫు వారు ఒక దేవళం సమీపంలోని ఇంట్లో పెరిగారు. వారికి హిందూ సంప్రదాయాలు తెలుసు. నేను కృష్ణుడి బొమ్మ వేయాలనుకున్నప్పుడు ‘అన్ని మతాలు మంచివే’ అని వారు అన్నారు.

కాని మా పుట్టిల్లు ఉండేది ముస్లింల ఇలాకాలో. వారికి ఈ విషయం తెలిసినప్పుడు కొందరు అభ్యంతరం చెప్పారు. అయితే మా నాన్న నాకు మద్దతుగా నిలబడ్డాడు. అల్లా నన్ను ఈ భూమి మీదకు తెచ్చాడు. నా ఇస్లాం సాధన నేను కొనసాగిస్తాను. ఐదు పూట్ల నమాజు చేసుకుంటాను. అది కాని సమయంలో బొమ్మలు వేస్తాను. బొమ్మలు వేసే శక్తి కూడా నాకు అల్లా ఇచ్చాడు. నేను వేసే బొమ్మ కోట్ల మంది ఆరాధ్యదైవం. అంతవరకే మనం దీనిని చూడాలి. నాకు అడ్డు చెప్పేవారికి నేను ఒకటే చెప్పాను– నేను ఈ బొమ్మలు వేయకూడదంటే అల్లా నాకు ఈ కళ ఇచ్చి ఉండేవాడు కదా అని. వాళ్లు ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు’ అంటుంది జస్నా.

గుడిలో బొమ్మ
కృష్ణుడి బొమ్మలు వేస్తున్నప్పటి నుంచి ఆమె బొమ్మ చాలా మందికి సెంటిమెంట్‌గా మారింది. చాలామంది వాటిని కొనుక్కుంటున్నారు. ఒక్కో బొమ్మ మూడు వేల నుంచి ఐదు వేల వరకూ ఉంటుంది. అయితే తాను వేసే ఒక్క బొమ్మ అయినా గుడిలో ఉంటే బాగుంటుందని జస్నా అనుకుంది. అందుకు చాలా సమయం పట్టింది. ఆమె బొమ్మను గుడికి ఇవ్వాలనుకున్నప్పుడు కొంత మంది భక్తులు వచ్చి ఆ బొమ్మను పరిశీలించి అంగీకరించారు. గుడి నిర్వాహకులు ఆహ్వానించారు. దాంతో ముస్లిం మహిళ జస్నా తన కళను ఒక సామరస్య చిహ్నంగా మార్చగలిగింది. ఆమెను చాలా మంది అభినందిస్తున్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top