కథాకళి: ఉపదేశం | kathakali funday story | Sakshi
Sakshi News home page

కథాకళి: ఉపదేశం

Mar 29 2026 11:01 AM | Updated on Apr 5 2026 9:24 AM

kathakali funday story

భవిష్యత్తులో ఓ రోజు. ఓ తప్పనిసరి రోజు. ఆ రోజు టోక్యోలోని యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్‌లో సభ్య దేశాల రాయబారులు సమావేశమయ్యారు. బీద దేశాల్లోని ఖనిజాలు, ఇతర ప్రకృతి సంపదని తమదిగా చేసుకోడానికి కొన్ని దేశాలు, తమ మతాన్ని రక్షించుకోవడానికి కొన్ని దేశాలు, తమ మతవ్యాప్తికి మరికొన్ని దేశాలు, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఆయుధ సంపత్తి గల కొన్ని దేశాలు చాలాకాలంగా యుద్ధాలు చేస్తున్నాయి. సైనికులతోపాటు కోట్లాదిమంది పౌరులు మరణిస్తున్నారు. 

ఆ యుద్ధాల నివారణకి, ప్రపంచశాంతికి సంప్రదింపులు జరుగుతున్నాయి.సెక్రటరీ జనరల్‌ ఆ సమావేశాన్ని ఆరంభిస్తూ చెప్పాడు.‘‘మిత్రులారా! మన చర్చలు ప్రతిష్టంభనతో ముగిశాయి. దాంతో ఐదవ ప్రపంచ యుద్ధం కూడా జరిగి మానవాళి పూర్తిగా నాశనం అవచ్చు. ఇప్పటికే అణ్వస్త్రాలకి తోడు లేజర్‌ ఆయుధాల వల్ల భూమిలో సారం తగ్గి, అంతరిక్షంలోని ఉపగ్రహం మీద పండించుకుని తింటున్నాం. మానవాళి ప్రమాదం అంచున ఉంది. కాబట్టి కృత్రిమ మేధస్సుని ఉపయోగించాలని నిర్ణయించాను. 

నూటముప్ఫై ఏడు దేశాల సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుని, ఎలాంటి సమస్యకైనా పరిష్కారాన్ని సూచించే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెంట్‌ సూపర్‌ బ్రెయి¯Œ ని తయారు చేయించాను.’’ఆ గది మధ్యలో మనిషి మెదడు ఆకారంలో, దానికన్నా పాతిక రెట్లు పెద్దదిగా ఉన్న ఆ యంత్రాన్ని అంతా చూశారు. ప్రపంచాన్ని ముప్ఫైసార్లు నాశనం చేయగల ఆయుధ సంపత్తి గల, నియంత అధికారంలోని, అంతా భయపడే నార్త్‌ కొరియా రాయబారి చెప్పాడు.‘‘మన సమస్యకి ఓ యంత్రం పరిష్కారం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.’’‘‘కావచ్చు. కాని ‘సరైన పరిష్కారం మూర్ఖుడి నించి వచ్చినా స్వీకరించదగ్గదే’ అని మా దేశ సామెత.’’ ఉత్తరప్రదేశ్‌ రాయబారి చెప్పాడు.

‘‘విందాం. ఈ యంత్రం ఏం చెప్తుందో, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించగలదేమో విందాం. మనం ఇప్పటికే చాలా పరిష్కారాలని విన్నాం. తిరస్కరించాము. కాబట్టి దీన్ని వినడంలో అవమానం లేదు.’’  సెక్రటరీ జనరల్‌ చెప్పాడు.
‘‘అవును. అందులో విజ్ఞత ఉంది.’’ టెక్సస్‌ రాయబారి చెప్పాడు.అన్ని దేశాల్లా అమెరికా కూడా చాలా చిన్న దేశాలుగా విడిపోయింది. పదవుల కోసం చాలా రాష్ట్రాలని, దేశాలని రాజకీయ నాయకులు విడగొట్టారు. అవి రక్షణకి వివిధ మిలటరీ కూటములను ఏర్పాటు చేసుకుని అందులో సభ్యులయ్యాయి.‘‘మనకన్నా దీనికున్న క్వాలిఫికేషన్‌ ఏమిటి?’’ రాజస్థాన్‌ రాయబారి ప్రశ్నించాడు.

‘‘భౌగోళిక, రాజకీయ, చరిత్ర, మతపరమైన, ఇంకా ఎన్నో అంశాలకి చెందిన అంశాలని శాస్త్రజ్ఞులు ఈ మెదడులో నమోదు చేశారు. వాటన్నిటిని క్రోడీకరించి, ఆలోచించి పక్షపాతం లేకుండా పరిష్కారాన్ని సూచించగలదు. మనిషి మెదడుకి ఈ శక్తి లేదు. కాబట్టి ఈ సూపర్‌ మైండ్‌ని సృష్టించాము.’’దాన్ని ఉపయోగించటం అవమానంగా భావించిన కొన్ని దేశాలు ఓటింగ్‌ కోరాయి. ప్రపంచంలోని 1862 దేశాల్లోని 73% మంది దాన్ని ఉపయోగించాలనే ఓటు వేశారు.‘‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌. థేంక్యూ. మన ముందున్న ఈ అద్వితీయ మెదడు వంద శాతం తృప్తికరంగా పనిచేస్తోంది. ప్రపంచ దేశాల చరిత్ర, వివాదాలు దీనికి తెలుసు. ఈ మీటని నొక్కగానే శాంతికి పరిష్కారాన్ని ఇది చెప్తుంది. మీ అంగీకారంతో దీన్ని నొక్కుతున్నాను. ఒన్‌... టు... త్రీ...’’ఆయన మీట నొక్కగానే అందులోని కోట్లాది న్యూరా¯Œ ్స ఒకదానితో మరొకటి కలిసి సమాచారాన్ని మార్పిడి చేసుకోవడాన్ని, మెరుపు తీగల్లా ప్రయాణించిన ఆలోచనా తరంగాలని అంతా విస్మయంగా చూశారు. 

క్షణం కన్నా తక్కువ కాలంలో అలా సాగాక, అది మానవ గొంతుతో గంభీరంగా పలికింది. ‘‘నన్ను పరిష్కారాన్ని కోరినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నాకు మూడు సమస్యలని ఇచ్చారు. కొరియన్‌ భాషని ప్రపంచ భాషగా చేయాలనే సమస్య; ప్రజల మధ్య, దేశాల మధ్య శాంతి నెలకొల్పడం మిగిలిన రెండు. వీటి పరిష్కారం మీకు అనాదిగా తెలిసి ఉండి కూడా ఎందుకు ఆచరించడం లేదని నాకు ఆశ్చర్యంగా ఉంది.’’అంతా ఆ పరిష్కారం ఏమిటా అని ఆసక్తిగా వినసాగారు.‘‘సమస్యని చూస్తున్న మీరు, పరిష్కారాన్ని ఎందుకు చూడటం లేదు? దీన్ని ఏనాడో మీ పూర్వీకులు, అంటే ముత్తాతల ముత్తాతల ముత్తాతలు మీ క్షేమం కోసం ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని విస్మరించడమే మీరు నష్టపోవడానికి ప్రధాన కారణం.

 ఒక్క ఆ ఉపదేశంలోనే అన్ని మతాల వందలకొద్దీ బోధనలు నిబిడీకృతమై ఉన్నాయి. ఈ ఒక్క ఉపదేశాన్ని పాటిస్తే మనిషికి, మనిషికి మధ్య ఎలాంటి సంఘర్షణా ఉండక ప్రపంచ శాంతి నెలకొంటుంది.’’‘ఆ ఒక్క ఉపదేశం ఏమిటి?’ అని కొందరు గుసగుసలాడుకున్నారు. ఆ కంఠం గంభీరంగా పలికింది.‘‘ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్‌ ఏషధర్మః సనాతనః... అంటే, ‘నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో దాన్ని ఇతరులకి చేయకు. ఇది శాశ్వత ధర్మం’ కురుక్షేత్ర యుద్ధం తర్వాత, అనుశాసనపర్వంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద నుంచి ధర్మరాజుకి బోధించిన ఈ సూత్రం మానవాళి శాంతికి కిరీటం లాంటిది. తల మీద కిరీటాన్ని విస్మరించి పాదాలవైపు చూడటం ఆపండి.’’కొన్ని దేశాలవారు కరతాళ ధ్వనులు చేస్తే, మరికొందరు మొహాన్ని మొటమొటలాడించారు. 

-మల్లాది వెంకట కృష్ణమూర్తి   

Advertisement
 
Advertisement
Advertisement