
పదోతరగతి కూడా పాసవ్వలేదు..ఇంకేం చదువుతాడు అని అనేస్తారు. కానీ కొందరూ పది ఫెయిలైనప్పటికీ..తర్వాత నెమ్మదిగా సక్సెస్‌ని అందుకోవడం ప్రారంభిస్తుంటారు. అలానే సాగింది ఈ ఐపీఎస్ అధికారి ఈశ్వర్ గుర్జార్ ప్రస్థానం. పదోతరగతి ఫెయిలై..సాదాసీదాగా చదివే ఈ అబ్బాయి ఈ రేంజ్‌లో అందుకోవడం చూసి అంత విస్తుపోయారు. అతడికి ఈ సివిల్స్ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నిసార్లు ఓటమి పలకరించిందో తెలిస్తే చెమటు పడతాయి. పోని విజయ దక్కింది అనుకుంటే అనుకున్న డ్రీమ్ జాబ్ దక్కక నిరుత్సాహం నిలువెల్ల వెంటాడుతున్న తగ్గేది లే అంటూ పోరాడి దక్కించుకున్న గెలుపు కథ ఇది. ప్రతిష్టాత్మకమైన ఈ సివిల్స్ ఎగ్జామ్‌కి ప్రిపేరవ్వుతున్న వాళ్లకు ఈ ఐపీఎస్ స్టోరీ ఓ ప్రేరణ.
అతడే ఈశ్వర్ గుర్జార్. రాజస్థాన్‌లోని భిల్వారాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి సువాలాల్ ఒక కిరాణ దుకాణం నడిపేవాడు. తల్లి సుఖి దేవి గృహిణి. చదువులో యావరేజ్ స్టూడెంట్. పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్‌లో ఫెయిలై తీవ్ర డిప్రెషన్‌కి గురయ్యాడు. కానీ అతడి తండ్రి అందరి నాన్నల్లా కోప్పడకుండా..ఏం కాదు మరోసారి ప్రయత్నించు పర్లేదని వెన్నుతట్టాడు.
అదే అతడికి మనోబలాన్నిచ్చి పదోతగరతి పాసైయ్యేందుకు దారితీసింది. అలా 2012లో 54% మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇక పన్నెండో తరగతి బోర్డు పరీక్షలలో 68% మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఎండీఎస్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి 2019లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అయితే అతడు తన సక్సెస్‌ని అక్కడితో ఆపకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్(UPSC Civil Services Exam)ని ఎంచుకున్నాడు.
వైఫల్యాలు అధిగమించి గెలుపొందిన తీరు..
2019 తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు. 2020లో ఇంటర్వ్యూ దాక చేరుకున్నా..నిష్క్రమించాల్సి వచ్చింది. చివరికి 2021లో మరోసారి ఓటమిని చవిచూడక తప్పలేదు. ఎట్టకేలకు 2022 నాల్గో ప్రయత్నంలో సివిల్స్‌ని క్లియర్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 644ని సాధించి ఐఆర్‌ఎస్ కేడర్‌కి ఎంపికయ్యారు. కానీ ఆయన చిరకాలవాంఛ ఐపీఎస్ అందుకోసం మరోసారి ప్రయత్నించారు.
అలా 2023లో, అతను ఆల్ ఇండియా ర్యాంక్ 555తో IPS అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకున్నారు. కానీ తన ర్యాంకు మరింత మెరుగుపడేలా చేసి పూర్తి స్థాయిలో ఐపీఎస్ హోదాని అందుకోవాలని 2024లో మరోసారి సివిల్స్ ఎగ్జామ్ రాసి ఈసారి ఏకంగా 483 ర్యాంకుతో మరింతగా మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం ఈశ్వర్ గుర్జార్ సెప్టెంబర్ 2025 వరకు, IPS సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శిక్షణ పొందుతున్నాడు.
కృషి, ఓర్పు పట్టుదలతో ఎంతటి కఠినమైన సవాలునైనా ఢీకొట్టి సక్సెస్‌ని అందుకోవచ్చని ప్రూవ్ చేశారు. ఓటమి ఎదురైనప్పుడల్లా గెలుపుకి దార్లు వెతికే ప్రయత్నంలో ఉన్నాం అనుకుంటూ ఓర్పుతో ముందుకు సాగాలనే గొప్ప సందేశం అందిస్తోంది ఈ ఐపీఎస్ అధికారి ఈశ్వర్ గుర్జార్ సక్సెస్ స్టోరీ.
(చదవండి: ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముద్దు..!)