30 ఏళ్ల క్రితం ఫొటో ట్రెండ్‌ను గుర్తించి.. కెమెరా పట్టుకుంది.. ఇప్పుడు ఏకంగా.. | International Women Day 2022: Woman Photographer Inspiration To All | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్‌ ‘అమ్మ’లు: కుటుంబ భారం మోస్తూ.. దుక్కి దున్నడం, గొర్రు తోలడం, నాట్లు వేయడం.. బైక్‌ నడుపుతూ

Mar 8 2022 6:22 PM | Updated on Mar 8 2022 6:29 PM

International Women Day 2022: Woman Photographer Inspiration To All - Sakshi

అయ్యతోపాటు బువ్వను పండించే వేళ ఆమె ఓ మట్టి మనిషి.. వంటింటి కొలిమిలో పడి రుచిని వండే వేళ ఆమె ఓ మర మనిషి.. గిన్నెలు కడిగి, బట్టలుతికే వేళ జీతమెరుగని ‘పని’ మనిషి! చదువుల గంధమద్దుకొని అన్ని రంగాల్లో రాణించే వేళ ఆమె ఓ మహా మనిషి. ఇప్పుడెందరో మనమధ్య మహా మనుషులున్నారు. అంతా తామై.. ఆకాశంలో సగమై రాణిస్తున్నారు.

రంగమేదైనా.. రాణించడమే ఆమె లక్ష్యం. విధులేవైనా.. విధేయతగా పూర్తి చేయడమే ఆమె ధ్యేయం. పట్టుదల, ఓర్పు ఆమెకు ప్రత్యేక అర్హతలు. అందుకే ఇప్పుడామె  ధీమాగా.. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది.మంగళవారం ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. 

భర్త చనిపోయిన బాధను దిగమింగుకుంది. అప్పటివరకు ఇంటిగడప దాటని ఆమె పొలం బాట పట్టింది. ఉన్న వ్యవసాయాన్ని చేసుకోవాలనుకుంది. మగవారు చేసే పనులన్నింటినీ నేర్చుకుంది. ఇప్పుడు సాగులో.. మేటిగా నిలిచింది పాలకుర్తి మండలం విస్నూరు గ్రామానికి చెందిన మహిళా రైతు బచ్చు శ్రీలత. 2005 భర్త శ్రీనివాసరావు విద్యుదాఘాతంతో చనిపోయాడు.

కుటుంబ భారం తనపై పడింది. బయటికి వెళ్లి బతికే పరిస్థితి లేదు. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ, తనకున్న నాలుగు ఎకరాల్లో వరితోపాటు ఆరుతడి పంటలు సాగు చేస్తోంది. వ్యవసాయానికి అవసరమైన వాటి కోసం బయటికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండడంతో బైక్‌ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు  ద్విచక్రవాహనంపై మండల కేంద్రానికి వచ్చి  అవసరమైనవి తీసుకెళ్తుంది. దుక్కి దున్నడం నుంచి గొర్రు తోలడం, నాట్లు వేస్తే...కలుపు తీయడం వరకు అన్ని పనులు చేస్తున్న శ్రీలత నేటి తరానికి ఆదర్శమే.  – పాలకుర్తి

ఫొటో ట్రెండ్‌.. నో ఎండ్‌! 
బిడపు కవితకు ఫొటోగ్రఫీ అంటే తెలియదు. ప్రతాప్‌ను వివాహమాడాక ఈ రంగంపై ఆసక్తి పెంచుకుంది. 30 ఏళ్ల క్రితం ఫొటో ట్రెండ్‌ను గుర్తించి కెమెరా పట్టుకుంది. విరామం లేకుండా పాస్‌ఫొటోల నుంచి వెడ్డింగ్‌షూట్, చిల్డ్రన్స్‌ షూట్, ఇలా ఏ కార్యక్రమమైనా క్లిక్‌మనిపిస్తోంది కవిత.  తనలా మరెంతో మంది మహిళలను ఫొటోగ్రాఫర్లుగా తీర్చిదిద్దాలని ఏడాదిన్నర క్రితం హనుమకొండలో సబిత ఫొటోగ్రఫీ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించింది.  – సాక్షి, వరంగల్‌

అడవిని అమ్మలా కాపాడుతూ..
భూపాలపల్లి అర్బన్‌: మారుమూల గ్రామమైన ఆజాంనగర్‌ రేంజ్‌ పరిధిలో నా డ్యూటీ. కొన్ని సందర్భాల్లో కలప స్మగ్లర్లు, పోడు రైతులు బెదిరిస్తారు. ఆర్నెళ్ల క్రితం పందిపంపుల శివారులో పోడు రైతులు నాపై, మా సిబ్బందిపై కిరోసిన్‌తో దాడి చేశారు. అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని అడవిని అమ్మలా కాపాడుకుంటున్నాం. మహిళగా ఈ ఉద్యోగంలో చేరినప్పటికీ సంతృప్తితో విధులు నిర్వహిస్తున్నా.  – దివ్య, అటవీ రేంజ్‌ అధికారి, ఆజాంనగర్‌

టైలరింగ్‌.. ట్రైనింగ్‌!
గూడూరు మండలం గుండెంగ శివారు అమృత తండాకు చెందిన బోడ వాణి టైలరింగ్‌లో రాణిస్తోంది. 2009లో వీరన్నతో వివాహం కాగా.. 2016లో ఆయన గుండెపోటుతో చనిపోయాడు. దీంతో ఇద్దరు పిల్లల బాధ్యత వాణి చూసుకోవాల్సి వచ్చింది.

ఇంటర్‌లో కాలక్షేపానికి నేర్చుకున్న టైలరింగే ఆమెకిప్పుడు జీవనోపాధినిస్తోంది. పిల్లల్ని చదివిస్తోంది. తాను ఉపాధి పొందుతూ మరికొందరు మహిళలకు టైలరింగ్‌లో శిక్షణనిస్తోంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తన పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడానికి నిత్యం శ్రమిస్తోంది వాణి.

చెప్పులు కుట్టి.. కొడుకును చదివించి!
స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌ కేంద్రానికి చెందిన దేవరకొండ అరుణ భర్త పన్నెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పట్నుంచి కుటుంబ భారాన్ని ఆమె భుజాలపై మోస్తొంది. చెప్పులు కుడుతూ కొడుకును ఉన్నత చదువులు చదివించింది.

కుమారుడు నరేశ్‌ సైతం తల్లి కష్టాన్ని గుర్తించి.. బాగా చదివి బీటెక్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం మంచి ప్యాకేజీతో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కులవృత్తిని నమ్ముకొని బిడ్డను ప్రయోజకున్ని చేసిన ఆ తల్లి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement