నాలుగు జంటలకు కొత్త జీవితం
లోక్ అదాలత్‌లో ఏకం చేసిన జడ్జిలు
జగిత్యాలజోన్: కుటుంబ గొడవలతో ఇక కలిసి ఉండలేమని కోర్టును ఆశ్రయించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలా తిరుగుతున్న నాలుగు జంటలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి పెద్దరికంతో నచ్చజెప్పి.. వారికి బాసటగా నిలిచి ఏకం చేశారు. జగిత్యాల కోర్టులో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్‌అదాలత్.. నాలుగు జంటలను కలిపే పెళ్లి వేడుకగా మారింది. జడ్జిలు పెళ్లి పెద్దలుగా మారి అక్షింతలు వేశారు. పోలీసులు ఆశీర్వచనాలు అందించారు. తమకు పుట్టిన సంతానం సాక్షిగా.. న్యాయవాదుల చప్పట్ల మధ్య నాలుగు జంటలు దండలు మార్చుకున్నాయి. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్‌లు లావణ్య, శ్రీనిజ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతోనే అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయని, చిన్నచిన్న సమస్యలకు కోర్టులు, పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.
నచ్చజెప్పి కలిపారు
మా మధ్య ఏర్పడిన వివాదంతో పోలీస్‌స్టేషన్, కోర్టులో కేసు వేశాం. కొంతకాలంగా ఎవరికి వారుగా ఉన్నాం. జడ్జిలు, పోలీసులు నచ్చజెప్పడంతో లోక్‌అదాలత్ ద్వారా ఒక్కటయ్యాం. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ కాదు. మరొకరు తక్కువ కాదని తెలసుకున్నాం.
– వేమల లావణ్య, మధు
కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం
పెళ్లయిన తర్వాత చిన్న గొడవకు పోలీస్‌స్టేషన్, కోర్టును ఆశ్రయించాం. గొడవలతో సాధించేది ఏమి లేదని ఇప్పుడు అర్థం అయ్యింది. లోక్ అదాలత్ ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. మా తప్పులేంటో తెలిసేలా చేసి మమ్మల్ని ఒక్కటి చేశారు.
– కొత్తూరి మానస, ప్రశాంత్
ఒకరినొకరం అర్థం చేసుకున్నాం
ఇద్దరి మధ్య ఇగోలతో కోర్టులో కేసులు వేసుకున్నాం. ఒకరిపై మరొకరికి సరైన అవగాహన లేక, చెప్పుడు మాటలు విని కోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు జడ్జిలు చెప్పిన మాట విని తిరిగి కలిసిపోతున్నాం. ఇప్పటికే ఎంతో విలువైన సమయాన్ని వృథా చేసుకున్నాం
– అవుదారి శీరిష–శ్రీను, దంపతులు
మళ్లీ కలిసిపోయాం
చిన్న వివాదంతో కోర్టును ఆశ్రయించాం. అన్ని పనులు విడిచిపెట్టి వాయిదాలకు తిరుగుతూ.. మనశ్శాంతికి దూరమయ్యాం. న్యాయమూర్తులు, న్యాయవాదుల సలహాతో కేసును పరిష్కరించుకుని ఒక్కటయ్యాం. సంతోషమయ జీవితాన్ని గడుపుతాం. – తీపిరెడ్డి సుమలత
చంద్రశేఖర్, దంపతులు


