పడవ మీద తిరిగే ప్రాణదాత

Inspirational Story Of Anganwadi Teacher Renu Vasave From Maharashtra - Sakshi

మహారాష్ట్ర నందున్‌బర్‌ జిల్లాలోని చిమల్‌ఖడీ అనే అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తుంది రేణు వాసావె. నర్మదా నది పరీవాహం చుట్టుపక్కల పల్లెల నుంచి గర్భిణులు, నవజాత శిశువులు  ఆమె దగ్గరకు పరీక్షకు, ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారానికి వచ్చేవారు. కాని లాక్‌డౌన్‌ తర్వాత గత ఆరు నెలల నుంచి గర్భిణులు కరోనా భయంతో రావడం లేదు. అయితే వారిని నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు రేణు. నర్మదా నదిలో తానే పడవ మీద తిరుగుతూ వారి వద్దకే వెళ్లి వస్తోంది. గత ఆరు నెలలు ఆమే వారి ఇంటికి వచ్చే ప్రాణదాతగా నిలిచింది.

‘సాయంత్రమైతే నా చేతులు లాగేస్తాయి. కాని పట్టించుకోను. గిరిజన మహిళల కోసం సేవ చేస్తున్నాన్న తృప్తి ఉంది నాకు’ అంటుంది రేణు వాసవె. ఆమె ఒక సాదా సీదా అంగన్‌వాడీ వర్కర్‌. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ తను చేయవలసిన పనులేవో చేస్తే ఆమెకు వచ్చే ఢోకా ఏమీ లేదు. ఆమెకు వీలు లేని పని చేయకపోతే ఎవరూ ఏమీ అనరు కూడా. కాని ఆమె అలా ఊరికే ఉండలేదు. తన డ్యూటీ తాను సక్రమంగా చేయాలనుకుంది. నది మీద తిరిగే ప్రాణదాతగా మారింది.

అడవి స్త్రీల కోసం
రేణు పని చేస్తున్నది చిమల్‌ఖడి అనే ఏజెన్సీ ప్రాంతంలో. అక్కడి అంగన్‌వాడి కేంద్రానికి గతంలో అయితే చుట్టుపక్కల గర్భిణులు, బాలింతలు వచ్చి తమకు కావలిసిన పరీక్షలు చేయించుకుని ఇచ్చే రేషన్‌ను తీసుకెళ్లేవారు. కాని కోవిడ్‌ వల్ల వారి రాకపోకలు హటాత్తుగా ఆగిపోయాయి. కొత్తగా గర్భం దాల్చినవారు, పిల్లల్ని కన్నవారు అంగన్‌వాడి కేంద్రాలకు రావడం మానుకున్నారు. కాని వారి ఆరోగ్యాన్ని పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి అందే ఆహారం, సౌకర్యాలు అందించడం అంగన్‌వాడి వర్కర్‌గా రేణు విధి. అందుకే ఆమె తానే వారి దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకుంది. అయితే ఆ గిరిజన పల్లెలకు రోడ్లు సరిగా ఉండవు. కాని వాటన్నింటి గుండా నర్మదా నది ప్రయాణిస్తుంది. అందుకే రేణు తన ప్రాంత బెస్తవాళ్ల దగ్గర పడవను అద్దెకు తీసుకుంది. ఆ పడవలో తెడ్డు వేసుకుంటూ పల్లెలకు తిరగసాగింది. 


18 కిలోమీటర్లురోజూ ఉదయం ఏడున్నరకే రేణు వాసవె తన అంగన్‌ వాడీ కేంద్రానికి వెళుతుంది. అక్కడి రోజువారీ పనులు ముగించుకుని మధ్యాహ్నం భోజనం చేసి పడవ మీద నర్మదా నదికి బయలుదేరుతుంది. నదిలో దాదాపు 9 కిలోమీటర్లు వెళ్లి 9 కిలోమీటర్లు వచ్చి, అంటే 18 కిలోమీటర్లు తిరుగుతుంది. ఆమె తిరిగేది మర పడవ కాదు. తెడ్లు వేయాల్సింది. ఒక్కోసారి ఆమె బంధువు, మరో అంగన్‌వాడి కార్యకర్త సంగీత తోడు వస్తుంది. పడవలో ఆమె రోజు గర్భిణులకు, చంటి పిల్లలకు ఇవ్వాల్సి ఆహారం, బరువు తూచే మిషన్‌ తీసుకువెళుతుంది. ‘ప్రస్తుతం నేను 25 మంది చంటిపిల్లలను, 7 మంది గర్భిణులను పర్యవేక్షిస్తున్నాను’ అంటోంది రేణు.

ఈత వచ్చు
రేణుకు నర్మద నదిపై ఒక్కతే పడవ నడపడం అంటే భయం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమెకు ఈత వచ్చు. నది పై పడవ నడపడం కూడా వచ్చు. ‘మా ఆయనకు ఈత రాదు. కొంచెం భయపడుతుంటాడు నా గురించి. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు నన్ను మెచ్చుకుంటారు’ అంటుంది రేణు. గత ఆరు నెలలుగా వారంలో ఐదు రోజులు పడవ మీద తిరుగుతున్న రేణుని చూసి గిరిజన మహిళలు చాలా సంతోషపడతారు. ఆమెను తమ ఆత్మీయురాలిగా భావిస్తారు. చంటి పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ‘అత్త వచ్చింది చూడు’ అని రేణును చూపిస్తారు.అందరు ఉద్యోగులు ఇలా ఉండరు. ఇలాంటి వారే ఉద్యోగాలకు గొప్పతనాన్ని తెస్తారు. రేణు ఒక ఆత్మీయ బంధువు.
– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top