
జీవితంలో ఎంత ఎదిగినా, ఏం సాధించినా.. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఎంతో ప్రధానమైనవని, ఇంటర్నల్ వెల్‌నెస్, ఎక్స్‌టర్నల్ కేర్‌ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్నీ ప్రదర్శిస్తాయని ప్రముఖ సినీతార శ్రియా శరణ్ తెలిపారు. చాలా రోజుల తరువాత ఈ పాన్ ఇండియా నటి నగరంలో సందడి చేశారు. నగరంలోని కొండాపూర్ వేదికగా వెల్‌నెస్, చర్మ సంరక్షణ, అధునాతన సౌందర్య సేవలందించే ‘జెన్నారా క్లినిక్స్’ను శ్రియా శరణ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అందమైన జీవితం, ఆరోగ్యకరమైనప్రయాణంతో పాటు తన తదుపరి సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
ఆ రోజులు ఎంత మధురమో..
చాలా మంది నన్ను కలిసినప్పుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకేలా ఎలా ఉండగలుగుతున్నారని అడుగుతున్నారు.., దానంతటికీ కారణం ‘ఎల్లప్పుడూ నాకు మానసిక సంతోషాన్నందిస్తున్న అభిమానుల ప్రేమ, రెండోది ఆరోగ్యం పట్ల నా జాగ్రత్త. సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సంరక్షించుకోవాలి. దీని కోసం నేను సాధారణ పద్ధతులను కొనసాగిస్తాను. ఇంట్లో తయారు చేసిన ఫేస్‌ప్యాక్‌లు వాడతాను, కొబ్బరి నూనె, ఆల్‌మండ్ ఆయిల్ వినియోగించడంతో పాటు ఆయుర్వేదిక్ పద్ధతులను పాటిస్తాను.
మన సంస్కృతిలో ఇలాంటి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి. అప్పటి రోజులు ఎంత మంచివో.., అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఎలాంటి కాలుష్యం ఉండేదికాదు. రసాయనాలు లేని ఆహారం తినేవారు. అందుకే వారి మోములో సహాజ సౌందర్యం ఉట్టిపడేది. ఆ గ్లో నాకు చాలా ఇష్టం. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌లో అలా బతకడం కాస్త కష్టమే కానీ ఎవరికి వారు వారి ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి.
ఈ తరాన్ని నేను వేడుకునేది కూడా ఇదే, మైండ్ మెడిటేషన్, యోగా చేయండి. పాజిటివ్ లైఫ్ పై అవగాహన పెంచుకోండి. నాలాగే మినరల్స్, విటమిన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించండి. హైదరాబాద్‌లో సౌందర్య రంగం, సినిమా రంగం గ్లోబల్ స్థాయిని చేరుకుంది. మోడ్రన్ లైఫ్‌స్టైల్ హబ్‌గా మారింది. దానిని ఆస్వాదిస్తూనే విభిన్న విధాలుగా మనల్ని మనం సంరక్షించుకోవడం చాలా ముఖ్యం.
ఆల్ టైం ఫేవరెట్..
హైదరాబాద్ ఎప్పటికీ నా ఫేవరెట్ సిటీ. ఎన్నెన్నో మధురమైన అనుభవాలు, ఆనందాలు నగరంతో పెనవేసుకుని ఉన్నాయి. 17 ఏళ్లప్పుడు అనుకుంటా మొదటిసారి ఇక్కడికి వచ్చాను. సినీ ప్రయాణంలో భాగంగా ఈ నగరాన్ని నాకు కుటుంబంలా మార్చేసింది. ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్‌ను కలవడానికే ఇక్కడికి వస్తుంటాను.
నా తదుపరి సినిమాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను చేరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మిరాయ్ సినిమాలో నటించాను. ఇందులో నా పాత్ర అందరికీ నచ్చుతుంది. మరో అద్భుతమైన ప్రాజెక్ట్ చంద్రయాన్. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వినూత్నమైన సబ్జెక్ట్ ఇది. ఎంతో వైవిధ్యమున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది.
(చదవండి: ఓపెన్‌గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..)