
సినీ సెలబ్రిటీలు గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే..అందం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కోసారి కాస్మెటిక్ సర్జరీలు తప్పవు కూడా. అది అందరికీ తెలిసిందే. చాలామంది ప్రముఖులు తాము చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీలు గురించి బయటకు గమ్మున చెప్పరు. కానీ కొందరు ధైర్యంగా చెబుతారు. పాపం అదే వారిని ఇక్కట్లు పాలు చేస్తుంది.నిజాయితీగా మాట్లాడారని మెచ్చుకోకపోయినా పర్లేదు..ఏకంగా తీసిపడేసినట్లుగా కామెంట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మానసికంగా చంపేస్తుంటారు. అలాంటి పరిస్థితినే తాను ఎదుర్కొన్నానంటూ టాలీవుడ్ నటి శ్రుతి హాసన్ తన గోడును వెళ్లబోసుకున్నారు.
ఏం జరిగిందంటే..గాయని, ప్రముఖ నటి శ్రుతిహాసన్(Shruti Haasan) తన మనసులోని మాటను మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్పేస్తారామె. అలానే తాను చేయించుకున్న కాస్మెటిక్ విధానాల గురించి చాలా ఓపెన్‌గా చెప్పింది. అలా చెప్పడంతో ఒక్కసారిగా అంతా ఆశ్యర్యపోయారు, ఆమె ధైర్యానికి మెచ్చుకున్నారు కూడా. అంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి మొదలైన కష్టాలు అంతా ఇంత కాదు. ఓహో ప్లాస్టిక్ సర్జరీ బేబీ అని మాట. ఆమె శరీరం అంతా ప్లాస్టిక్‌నే అంటు కామెంట్లతో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.
ఇది నిజాయితికి లభించిన మూల్యం అని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇతర నటి నటులు కూడా తాను చేయించుకున్న వాటికంటే ఎక్కువ చేయించుకుని ఉండొచ్చు. అయినా అది వారి వ్యక్తిగత విషయం. అందం, దాని ప్రామాణికత పరంగా ఒక్కొక్కరిది ఒక్కో విధానంలో ప్రాముఖ్యత ఇస్తారు. అలా అని దాన్ని అందరూ అనుసరించాలని తామేమి సందేశం ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనవి, వారి వారి ఇష్టాలకు సంబంధించినవి.
అయినా ఒకరి ఇష్టాన్ని ఎవ్వరూ జడ్జ్ చేయలేం అనేది నర్మగర్భంగా అంగీకరించాల్సిన విషయం. అలాగే తాను చేస్తున్న పని, జీవితం, ప్రేమ వంటి వాటికి సంబంధించిన వాటి గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటాని అన్నారామె. కానీ ఇప్పుడే తెలుస్తుంది ఆ నిజాయితీ అస్సలు పనికి రాదని, అలా చెప్పిన తత్‌క్షణమే వేళ్లన్నీ నా వైపు చూపించడం మొదలవుతుందని అంటూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు.
నిపుణులు ఏమంటున్నారంటే..
ఇది అందరికి వర్తిస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒకప్పుడూ చాలా ఓపెన్‌గా మన మనసులో విషయాలను స్వచ్ఛంగా మాట్లాడేవాళ్లం. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యామా అని ట్రోలింగ్ రాయుళ్లను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి మాట్లాడాల్సిందే.
ఇక్కడ అందరూ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా సొంత విషయాలు లేదా వ్యక్తిగత విషయాల ప్రస్తావించక పోవటమే మేలు అనే సూత్రాన్ని అవలంభించాలి అదే నేటి కాలంలో శ్రీరామ రక్ష అని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: 'మంజుమ్మెల్ గర్ల్'..! ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..)