
కొచ్చిలో రద్దీగా ఉండే వీధిలోకి ఓ ఆటో రిక్షా రయ్.. మని వచ్చి ఆగింది. అప్పుడే ఓ పోలీస్ వ్యాన్ కూడా అదే మలుపు వద్ద ఆగింది. అందులో నుంచి కానిస్టేబుల్ ఆటోలోకి చూస్తూ ‘ఏయ్ అబ్బాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?’ అని అడిగాడు. ‘సర్, నేను అబ్బాయి కాదు, అమ్మాయిని...’ అంటూ తన వద్ద ఉన్న లైసెన్స్ చూపించింది.
ఆమె కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మంజుమ్మెల్‌కు చెందిన అలీషా జిన్సన్. ఆమె వయసు 18. ‘మంజుమ్మెల్ గర్ల్’గా ఆ ఏరియాలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతోంది. ఆమె ఎర్నాకుళంలోనే కాదు కేరళ మొత్తంలో ఆటో నడిపే అతి పిన్న వయస్కురాలిగా పేరొందింది. ఆమె ఆటో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కేరళ విద్యామంత్రి శివన్ కుట్టి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన రాష్ట్ర టాక్సీ, ఆటో బుకింగ్ యాప్ అయిన కేరళ సవారీకి అలీషాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.
అలీషా డ్రైవర్ సీట్‌లో కూర్చోవడానికి చాలానే కష్టపడింది. 16 ఏళ్ల వయసులో కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు స్కూల్ చదువు మానేసింది. అదే సంవత్సరంలో క్లీనింగ్ సర్వీసెస్ కంపెనీ యజమాని అయిన ఆమె తండ్రి గిన్సన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కొన్ని నెలల తేడాతో తల్లి షిజా నిమోనియాతో ఆసుపత్రి పాలైంది, అది క్షయవ్యాధిగా మారింది. దీంతో ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. ఉన్న ఏకైక ఆస్తి క్లీనింగ్ సిబ్బందిని తీసుకెళ్లడానికి ఉంచిన ఆటోరిక్షా.
‘నాన్నకు ప్రమాదం జరిగి, మంచం పట్టడం, అమ్మ ఆసుపత్రి పాలవడంతో నేను ఈ డ్రైవింగ్‌నే ఎంపిక చేసుకున్నాను. ఆటోయే నాకు జీవనాధారం అయ్యింది. మొదట్లో పనివాళ్లను చేరవేయడానికి ఆటో ఉపయోగపడింది. కొత్త భవనాలు, ఫర్నీచర్ క్లీనింగ్ వంటి పనుల్లో పాల్గొన్నాను.
ఒకరోజు పొరుగున ఉండే వ్యక్తి తన సరుకులను చేరవేయడానికి ఆటో కావాలని అడిగాడు. నా తండ్రి నన్ను ఆటో తీసుకెళ్లమన్నాడు. ఆ రోజు నేను ఛార్జీల రూపంలో రూ.700 సంపాదించాను. అది నేను ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తం. దీంతో నా పూర్తి సమయం ఆటో నడపడానికే నిశ్చయించుకున్నాను.
రాత్రి డ్రైవింగ్... నెలవారీ వాయిదా కట్టడానికి రూ.13,000 అవసరం అవడంతో సాయంత్రం ఊబర్‌లోకి లాగిన్ అయ్యేది. దీంతో రాత్రి డ్రైవింగ్ మొదలయ్యింది. కొన్నిసార్లు తెల్లవారుజాము 2 గంటల వరకు ఆటో నడుపుతూనే ఉండేది. ఏ టైమ్ అయినా సంకోచం లేకుండా నడపడం చేస్తూనే ఉంది. కట్ చేసిన జుట్టు, డ్రెస్సింగ్ చూసేవాళ్లకు ఆమె టీనేజ్ అబ్బాయిలా కనిపిస్తుంది.
‘ఒకసారి ఒక వ్యక్తి ఆటో ఆపి, నాకు ఆటో డ్రైవింగ్ చేయడానికి ఇచ్చినందుకు మా నాన్నను తిట్టాడు. నా లైసెన్స్ వారికి చూపించాల్సి వచ్చింది’ అని నవ్వుతూ చెబుతుంది అలీషా. తన సోదరుడి ఖాకీ చొక్కాను యూనిఫామ్‌గా మార్చుకుంది. తెలియని వ్యక్తులు ఎవరైనా సరే వారితో మాటలకు దూరంగా ఉంటుంది.
చదువుకు అంతరాయం... అలీషా రోజూ తన ఇల్లు మంజుమ్మెల్ నుండి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలియం వరకు సైకిల్‌పై వెళ్లి, చదువుకునేది. రోజూ ఈ ప్రయాణం చేయలేక స్కూల్‌కు రెగ్యులర్‌గా వెళ్లలేకపోయేది. దీంతో పదవ తరగతితోనే చదువు ఆగిపోయింది. ఓ ప్రైవేట్ కాలేజీలో పన్నెండవ తరగతి వరకు చదివింది. ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తిచేసి, టెక్స్‌టైల్ వ్యాపారాన్ని నడిపింది. ఇప్పుడు ఈ రంగంలోనే ఇగ్నో ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తోంది.
గుర్తించిన ప్రభుత్వం... కేరళ సవారీ యాప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభుత్వం ఆమెకు ఒక జ్ఞాపికను బహూకరించింది. మంజుమ్మెల్ గర్ల్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొంత ఆదాయాన్ని పొందుతోంది. తన ఆటోకు కూడా అదే పేరు పెట్టుకుంది. ఆమె సోదరుడు జాషువా తన తండ్రి ప్రమాదం తర్వాత బెంగళూరులో తన చదువును వదిలేసి క్లీనింగ్ కంపెనీని నడుపుతున్నాడు.
ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ కోలుకోవడంతో కుటుంబం కొత్త వెంచర్ కోసం ప్లాన్ చేస్తోంది. పద్దెనిమిదేళ్ల వయసులో అలీషా తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడానికి, అప్పులను తీర్చడానికి సొంత జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఒక మార్గాన్ని వెతుక్కుంది. విదేశాలలో భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటోంది.