
స్ట్రోక్ అంటే మనకు తెలిసింది మెదడుకు వచ్చే బ్రెయిన్ స్ట్రోక్. అయితే చిన్నప్పట్నుంచీ మనం చదువుకున్న మెదడులోని భాగాలైన పెద్ద మెదడు, చిన్న మెదడు, మెడుల్లా అబ్లాంగేటాలలో... మెడుల్లా అనే భాగానికి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశముంది. ఆ భాగానికి స్ట్రోక్ వచ్చినప్పుడు కలిగే కొన్ని నరాల మార్పుల (న్యూరలాజికల్ కండిషన్స్) వల్ల దేహంలోని ఓ పక్క భాగం (అంటే లాటరల్ భాగం) అచేతనమైపోయే అవకాశం ఉంది.
ఇలా మెదడులోని మెడుల్లా అనే భాగానికి వచ్చే స్ట్రోక్ వల్ల కలిగే మార్పుల కారణంగా కళ్లు తిరుగుతున్నట్లు ఉండటం (డిజ్జీనెస్), సరిగా నిలబడలేక΄ోవడం, గుటక వేయలేకపోవడం వంటి లక్షణాలతో కనిపించే ఈ అనారోగ్యాన్ని ‘ల్యాటరల్ మెడుల్లరీ సిండ్రోమ్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.
ల్యాటెరల్ మెడుల్లరీ సిండ్రోమ్ అనే ఈ సమస్య... సాధారణంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పోస్టీరియర్ ఇన్‌ఫీరియర్ సెరెబెల్లార్ ఆర్టరీ (పీఐసీఏ)లో రక్తప్రవాహం ఆగడం వల్ల వస్తుంది. దాంతో మెడుల్లా (బ్రెయిన్ స్టెమ్)లోని ఒక పక్క భాగం (పార్శ్వం) ప్రభావితమవుతుంది.
ఇవీ లక్షణాలు...
బాధితులకు నొప్పి, వేడిమి, ఉష్ణబాధలు తెలియకపోవడం
బాలెన్స్ కోల్పోవడం, నడుస్తున్నప్పుడు సరైన రీతిలో నడవలేకపోవడం (గెయిట్ సరిగా లేకపోవడం) ∙తల, కళ్లు తిరుగుతుండటం ∙గుటకవేయలేక΄ోవడం, గొంతు బొంగురుపోవడం, మాట ముద్దముద్దగా రావడం. (మెదడులోని మింగే వ్యవస్థనూ, మాట్లాడే కేంద్రాన్ని నియంత్రించే ‘న్యూక్లియస్ యాంబిగస్’ అనే భాగం ఆయా వ్యవస్థలపై అదుపు కోల్పోవడంతో ఈ పరిణామం సంభవిస్తుంది)
కనురెప్ప దానంతట అదే వాలిపోవడం, కనుపాప దగ్గరగా ముడుచుకోవడం (ప్యూపిల్ కన్‌స్ట్రిక్షన్), కొన్నిసార్లు కళ్లు (నల్లగుడ్డు) వాటంతటవే కదుతుండటం
కొందరిలో వికారం, వాంతులు, ఎక్కిళ్లు.
కారణాలు...
మెదడులోని కొన్ని భాగాలకు రక్తం అందించే ధమనులు గట్టిబారి΄ోయి సన్నబడటం లేదా ఆ గోడల్లో పగుళ్లు రావడం వల్ల
మెడను సరిగా ఉపయోగించకుండా రఫ్‌గా వాడినప్పుడు అక్కడి వర్టెబ్రల్ ఆర్టరీస్‌లో పగుళ్లు రావడం వల్ల లేదా మార్ఫన్స్ సిండ్రోమ్, ఎహ్లెర్–డ్యాన్లస్ సిండ్రోమ్, ఫైబ్రోమస్క్యులార్ డిస్‌ప్లేసియా (రక్తనాళాల లోపలివైపున కణాలు పెరగడం వల అవి సన్నబారిపోవడం) వంటి కారణాలతో ఈ సమస్య వస్తుంది. అయితే మిగతా కారణాలతో పోలిస్తే ఈ అంశాలు చాలా అరుదు.
నిర్ధారణ...
మెదడు ఎమ్మారై ద్వారా అలాగే లక్షణాలను బట్టి దీన్ని నిర్ధారణ చేస్తారు. అయితే చాలా సందర్భాల్లో నిర్ధారణ సరిగా జరగక... ఈ సమస్యను ఇతర సమస్యగా పొరబడటం జరుగుతుంటుంది. ప్రధానంగా వికారం, వాంతులు, తలతిరగడం, కళ్లుతిరగడం వంటి లక్షణాలను బట్టి దీన్ని ఈఎన్‌టీ సమస్యగా పొరబడుతుంటారు. చికిత్స... స్ట్రోక్ అనేది ఈ తరహాదైనప్పటికీ దానికి అత్యంత త్వరగా చికిత్స అందడం అవసరం. అప్పుడే వీలైనంత తక్కువ నష్టం జరుగుతుంటుంది.
ఈ తరహా స్ట్రోక్ మొదలుకొని అది ఎలాంటిదైనప్పటికీ వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకురావాలి. బాధితుల్ని కనీసం మూడు నుంచి నాలుగు గంటల లోపు తీసుకొస్తే డాక్టర్లు థ్రాంబోలిటిక్ థెరపీ (అంటే ధమనుల్లో రక్తసరఫరాను పునరుద్ధరించేందుకు ఇంజెక్షన్ ద్వారా మందును ఇచ్చే చికిత్స)ని బాధితులకు అందించడానికి ప్రయత్నిస్తారు. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో కొందరికి ‘మెకానికల్ థ్రాంబెక్టమీ’ అనే (రక్తనాళాల్లో పేరుకుపోయిన క్లాట్‌ను తొలగించడానికి చేసే) శస్త్రచికిత్సతో పరిస్థితిని చక్కబరుస్తారు.
ఇటీవల ఈ సమస్యపట్ల కొంత అవగాహన పెరగడంతో మునపటిలా కాకుండా సంబంధిత చికిత్సలు సత్వరమే జరుగుతున్నాయి. అయితే ముందుగా చెప్పినట్లుగా థ్రాంబోలిటిక్ థెరపీ చేయడానికి అవకాశం లేకుండా కాస్తంత ఆలస్యంగా వచ్చినవారికి క్లాట్స్ ఏర్పడకుండా ఉంచేందుకు రక్తం గడ్డకట్టి ఉండలుగా మారకుండా యాంటీ ప్లేట్‌లెట్ ఏజెంట్స్‌ను ఇవ్వడం, రక్త΄ోటు (బీపీ) అదుపులో ఉంచడం, కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను తగ్గించడం, రక్తాన్ని పలచబర్చేలా యాంటీ కోయాగ్యులెంట్స్ ఇవ్వడం వంటి మేనేజ్‌మెంట్ చికిత్సలూ అవసరమవుతాయి.
రీ–హ్యాబిలిటేషన్... ఇక్కడ పేర్కొన్నవే కాకుండా బాధితులు కోలుకునేందుకు వీలుగా ఫిజియో వంటి ‘రీ–హ్యాబిలిటేషన్’ వంటి కాస్త సుదీర్ఘ చికిత్సలతో పాటు బ్యాలెన్స్‌డ్‌గా నడక ప్రాక్టీస్ చేయించడం, మాట ముద్దగా వస్తున్నవారికి స్పీచ్ థెరపీ వంటివి కూడా అవసరమవుతాయి.
భవిష్యత్తు ఆశారేఖలివి... ఇప్పుడున్న మందులు కాకుండా న్యూరో ప్రొటెక్టివ్ మెడిసిన్, స్టెమ్‌సెల్ చికిత్సల వంటి వాటిపైనా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ లక్షణాలతో స్ట్రోక్‌ను గుర్తించి వీలైనంత త్వరగా బాధితులను హాస్పిటల్‌కు తరలించడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వల్ల జరిగే నష్టాన్ని వీలైనంతగా తగ్గించవచ్చు.
(చదవండి: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?)