నాకు ఏడవనెల నడుస్తోంది. రక్తహీనత ఉందని చెప్పారు డాక్టర్. తొమ్మిది గ్రాముల కన్నా పెరగడం లేదు. ఐరన్ మాత్రలు వేసుకుంటే వాంతులు అవుతున్నాయి. ఏదైనా పరిష్కారం చెప్పండి.. ప్లీజ్! – దుర్గా వాణి, విజయవాడ
Pregnancy Tips- Iron Rich Foods: ప్రెగ్నెన్సీలో రక్తహీనత ఉంటే విపరీతమైన నీరసం, అలసట ఉంటాయి. ఏ పనినీ చురుకుగా చేసుకోలేరు. ఐరన్ లోపంతో కడుపులో బిడ్డకూ ఎదుగుదల సమస్యలు ఉంటాయి. అందుకే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ, అంజీర్ (డ్రై ఫ్రూట్స్) రోజూ తినాలి. అలాగే క్యారెట్, బీట్‌రూట్ , టమాటా జ్యూసెస్‌ను తాగొచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే కమలాపళ్లు, నిమ్మ వంటి వాటిని తీసుకోవాలి.
చాలామందికి ఐరన్ మాత్రల వల్ల వికారం, వాంతులు ఉంటాయి. కొంతమందికి తిన్న వెంటనే విటమిన్ సి ( చప్పరించే) మాత్రలతో ఐరన్ మాత్రలు ఇస్తే వాంతులు కావు. మీరు ఈ పై పద్ధతులను ప్రయత్నించి చూడండి. మాత్రలు అసలే సరిపడకపోతే ఐరన్ ఇంజెక్షన్స్ (ఇప్పుడు ఇస్తున్నారు) తీసుకోవచ్చు. ఐరన్ అనేది హిమోగ్లోబిన్‌లో చాలా ముఖ్యమైనది. ఇది మన శరీరంలోకి ఆక్సిజన్‌ను క్యారీ చేస్తుంది.
ఈ ఇంజెక్షన్స్ హిమోగ్లోబిన్‌లో ఐరన్ కంటెంట్‌ను త్వరగా పెరిగేట్టు చేస్తాయి. వికారం వల్ల మీరు తినలేకపోయినా పొట్టలో బిడ్డకు పోషకాల లోపం లేకుండా చూస్తాయి. ఈ ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చే ముందు మీకు ఐరన్ మోతాదు ఎంత ఉంది? ఏదైనా జెనెటిక్ సమస్యలు, సికెల్ సెల్, తలసీమియా వల్ల బ్లడ్ లెవెల్స్ తగ్గాయా? వంటివన్నీ చెక్ చేసి, బరువును బట్టి మోతాదును లెక్కగడతారు.
ఎలాంటి జెనెటిక్ సమస్యలు లేనివారికి ఐరన్ ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి. కనీసం వారానికొకటి ఐవీ ఇంజెక్షన్ ఐరన్‌ను చేయించుకోవాలి. ఇలా రెండు వారాలు ఇస్తాం. ఒక నెల తరువాత ఎంత పెరిగిందో చెక్ చేస్తాం. ఈ ఇంజెక్షన్‌ను ఆసుపత్రిలో డాక్టర్ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. కొంతమందికి వీటివల్ల శ్వాసలో ఇబ్బంది, దద్దుర్లు వంటి రియాక్షన్స్ ఉంటాయి.
అందుకే డాక్టర్ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. మీకు ఆస్తమా, ఎలర్జీలు, లివర్ సమస్యలు, ఇన్‌ఫెక్షన్స్ ఉంటే మోతాదును మార్చాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ చేయించుకున్న వారం తరువాత మీకు కొంచెం నీరసం తగ్గి ఓపిక పెరుగుతుంది. ఐరన్‌ను పెంచే ఆహారం తప్పకుండా తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్స్‌ను గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో చేయకూడదు.
- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్.
చదవండి: Tips To Recover From C Section: ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డెలివరీ అయిన మొదటి 6 వారాలు...
Solution For Vaginal Boil: ఏడాదిగా అక్కడ సెగ గడ్డలు.. ఏ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి?
Comments
Please login to add a commentAdd a comment