ఇకపై 'వేగాన్‌ లెదర్‌' అంటే? ఇలా చెప్పుకుందాం!

As Eco Friendly Sustainable Alternative Vegan Leather - Sakshi

"ఒక చదరపు మీటరు లెదర్‌ తయారయ్యే ప్రక్రియలో విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌ ఎంతో ఊహించగలరా? అక్షరాలా 17 కిలోలు. లెదర్‌ బ్యాగ్‌లు, షూస్, బెల్టులు, పర్సులు, వాచ్‌ల మీద మనకున్న మక్కువ తక్కువేమీ కాదు. కానీ పర్యావరణానికి ఇంత చేటు చేస్తుందని తెలిసిన తర్వాత వాటి వాడకాన్ని ప్రోత్సహించలేం, మమకారాన్ని చంపుకోలేం.

అన్నింటికీ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాం కదా! దీనికి కూడా ఓ మార్గం కనిపించకపోతుందా! సరిగ్గా ఇలాగే ఆలోచించిన మైథిలి పోకచెట్టు బెరడుతో ఓ ప్రత్యామ్నాయాన్ని మన ముందుకు తెచ్చారు. అదే వేగాన్‌ లెదర్‌. వేగాన్‌ లెదర్‌ని ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్‌ ఆల్టర్నేటివ్‌గా పరిచయం చేస్తున్నారు మైథిలి."  
 
తిరిగి ఇచ్చేద్దాం!
మైథిలిది కర్నాటకలోని శృంగేరి. ఆమె భర్త సురేశ్‌తో కలిసి ‘భూమి ఆగ్రో వెంచర్స్‌’ పేరుతో వేగాన్‌ లెదర్‌ తయారీ పరిశ్రమను స్థాపించారు. ఈ ప్రయత్నం కేవలం పర్యావరణహితం కోసం, మనుషులను పర్యావరణ హిత జీవనశైలి దిశగా నడిపించడమేనన్నారామె. కంప్యూటర్స్‌తో మొదలు పెట్టిన కెరీర్‌ వేగాన్‌ లెదర్‌ పరిశ్రమ వైపు మలుపు తీసుకోవడాన్ని వివరించారామె.

మాది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలో లక్షలాది ఎకరాల్లో పోక చెట్లను పెంచుతారు. మేము చదువు పూర్తయిన తర్వాత శివమొగ్గలో కంప్యూటర్‌ సేల్స్, సర్వీసెస్‌ వ్యాపారం మొదలుపెట్టాం. పాతికేళ్లపాటు విజయవంతంగా నిర్వహించాం. ఇక మా వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందనే అభి్రపాయానికి వచ్చాం. అలాంటి సమయంలో ఓ సారి మా సొంతూరికి వచ్చినప్పుడు పోకచెట్టు బెరళ్లను చూసినప్పుడు ఈ ఆలోచన వచ్చింది.

 
కప్పులే కాదు చెప్పులు కూడా! 
పర్యావరణ ప్రేమికులు కొందరు పోకచెట్టు బెరడుతో ఫంక్షన్‌లలో భోజనం వడ్డించే ప్లేట్‌లు, పాయసం వడ్డించే కప్పుల వంటి వాటిని చేస్తున్నారు. పేపర్‌ ప్లేట్‌కు బదులు అరెక్కా (పోకచెట్టు) ప్లేట్‌ వాడడం వల్ల పేపర్‌ తయారీ సమయంలో జరిగే నీటికాలుష్యాన్ని నివారించిన వారమవుతాం. అయితే పోకచెట్టును ఇంకా విస్తృతంగా వినియోగంలోకి తీసుకు రాగలిగితే పర్యావరణానికి హానికారకంగా మారుతున్న అనేక పరిశ్రమలకు ఇది చక్కటి ప్రత్యామ్నాయం అవుతుందని ఆలోచించాం.

అప్పుడు మాకు మొదటగా తోళ్ల పరిశ్రమ గుర్తువచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన త్జీర్‌డ్‌ వీన్‌హోవెన్‌ కూడా తోళ్లకు ప్రత్యామ్నాయం కోసం మొక్కలపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిసింది. మా పోకచెట్టు బెరడు ఆలోచన వీన్‌హోవెన్‌కు కూడా నచ్చింది. ప్రయోగాలు చేయగా చేయగా మా ప్రయత్నం విజయవంతం అయింది. ఇది జంతువులకు ప్రాణహానిని నివారించే లెదర్‌ కాబట్టి వేగాన్‌ లెదర్, పామ్‌ లెదర్‌ అంటున్నాం. రసాయన రహిత, భూమిలో కలిసిపోయే మెటీరియల్‌ ఇది. తేలికగా ఉంటుంది కూడా.

ఇప్పుడు పెద్ద ఎత్తున వేగాన్‌ లెదర్‌ను ఎగుమతి చేస్తున్నాం. వీటితో పెన్‌హోల్డర్‌లు, చెప్పులు, పుస్తకాల అట్టలు, వ్యానిటీ బ్యాగ్‌ తదితరాలు తయారవుతున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు ఇందులో చక్కటి సేవందిస్తున్నారు. గత ఏడాది మే–జూన్‌ నెలల్లో జీ 20 సదస్సుల సందర్భంగా స్టాల్‌ నిర్వహించాం. యానిమల్‌ లెదర్‌ తయారీలో కార్బన్‌ డయాక్సైడ్‌తోపాటు నీటి కాలుష్యం కూడా ఎక్కువే.

యానిమల్‌ లెదర్‌ కోసం పాతిక వేల లీటర్ల నీరు అవసరమయ్యే చోట పామ్‌ లెదర్‌ తయారీకి నీటి వాడకం ఆరు వందల లీటర్లకు మించదు. పైగా పామ్‌ లెదర్‌ తయారీలో వాడిన నీటిని తిరిగి పంటలకు వినియోగించుకోవచ్చు కూడా. మేము సమాజానికి తిరిగి ఇవ్వాలనే ప్రయత్నంతో చేసిన ఆలోచన నుంచి పర్యావరణానికి మా వంతుగా సేవలందించే అవకాశం వచ్చింది. సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు’’ అన్నారు మైథిలి.

ఇవి చదవండి: ‘మనకెందుకమ్మా వ్యాపారం.. పెద్ద రిస్క్‌’ అని అనుకుంటే..!? ఇప్పుడిలా..

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top