బెజవాడ కనక దుర్గమ్మ దసరా అలంకారాలు... నైవేద్యాలు

Dussehra 2022: Vijayawada Kanaka Durga 9 Alankaralu 9 Prasadam - Sakshi

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు శక్తి ఆలయాలన్నింటా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి అంగరంగవైభవంగా, అత్యంత సంప్రదాయబద్ధంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

ఆ చల్లని తల్లి భక్తులకు రోజుకో అలంకారంలో దర్శనం ఇస్తుంది. వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడినుంచో విచ్చేస్తారు. అయితే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అవతరించిన దుర్గాదేవికి చేసే అలంకారాలకే ఎనలేని ప్రాధాన్యం ఉంది. అందుకే విజయవాడ కనకదుర్గమ్మ దసరా అలంకారాలను అందిస్తున్నాం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బెజవాడ కనక దుర్గమ్మ రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. 

మొదటి రోజు: స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి, సోమవారం)
శరన్నవరాత్రి మహోత్సవాల్లో తొలిరోజు శ్రీ అమ్మవారిని స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారంలో అమ్మ బంగారు రంగు చీరలో దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మను దర్శించుకుంటే సకల దారిద్య్రాలూ తొలగుతాయని ప్రతీతి. 
నైవేద్యం: చక్కెరపొంగలి.

రెండవ రోజు: శ్రీబాలాత్రిపుర సుందరీదేవి(ఆశ్వయుజ శుద్ధ విదియ, మంగళవారం)
దసరా ఉత్సవాల్లో రెండవ రోజు శ్రీ దుర్గమ్మను లేత గులాబీ రంగు చీరలో శ్రీ బాలాత్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. బాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యంకొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందుతారు.

నివేదన: కట్టెపొంగలి

మూడవరోజు: శ్రీగాయత్రి దేవి (ఆశ్వయుజ శుద్ధ తదియ, బుధవారం )
దసరా మహోత్సవాల్లో మూడవరోజున అమ్మవారు శ్రీ గాయత్రిగా దర్శనం ఇస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ గాయత్రీదేవిని నారింజ రంగు చీరలో అలంకరిస్తారు. పంచముఖాలతో, వరదాభయహస్తాలను ధరించిన శ్రీ గాయత్రి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకుంటే సర్వపాప హరణం జరుగుతుంది. 

నివేదన: పులిహోర 

నాలుగవ రోజు: శ్రీ అన్నపూర్ణాదేవి (ఆశ్వీయుజ శుద్ధ చవితి, గురువారం)
సకల జీవరాశులకు అహారాన్ని అందించే దేవత అన్నపూర్ణాదేవి. గంధం రంగు లేదా పసుపు రంగు చీరను ధరించి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో అమృతాన్నాన్ని, వజ్రాలు పొదిగిన గరిటెతో తన భర్తౖయెన ఆదిభిక్షువు పరమ శివుడికి అన్నం పెడుతున్న అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే క్షుద్బాధలు ఉండవని భక్తుల నమ్మకం.

నివేదన: దద్ధ్యోదనం, క్షీరాన్నం, అల్లం గారెలు. 

ఐదవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి (ఆశ్వీయుజ శుద్ధ పంచమి, శుక్రవారం )
త్రిమూర్తులకన్నా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలుస్తారు. లలితా త్రిపుర సుందరీ దేవియే శ్రీ చక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తులను అనుగ్రహిస్తోంది. లక్ష్మి, సరస్వతి ఇరువైపులా వింజామర లు వీస్తుండగా, చిరు దరహాసంతో చెరుకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చున్న శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు నెరవేరతాయని ప్రతీతి. 

నివేదన: అల్లం గారెలు

ఆరవ రోజు: శ్రీ మహాలక్ష్మీదేవి (ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి, శనివారం)
మంగళప్రదమైన దేవత శ్రీమహాలక్ష్మీదేవి. లోక స్థితికారిణిగా ధన, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి, సమష్టిరూపమైన అమృతస్వరూపిణిగా గులాబీ రంగు చీరను ధరించి, సర్వాభరణ భూషితురాలై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే అషై్టశ్వర్యాలకు కొదవ ఉండదని ప్రతీతి. 

నివేదన: రవ్వకేసరి

ఏడవ రోజు: శ్రీ సరస్వతీదేవి (ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, ఆదివారం) 
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిమైన దుర్గాదేవి తన అంశలోని నిజరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రం నాడు చేసే సరస్వతీ అలంకారం ప్రత్యేకత. తెల్లని పట్టుచీర ధరించి, చేతిలో వీణతో సరస్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారి జన్మనక్షత్రం రోజున దర్శించుకుంటే భక్తుల కష్టాలు తీరతాయని, కోరిన విద్యలు వస్తాయనీ నమ్మకం. విద్యను, బుద్ధిని ప్రసాదించే సరస్వతీదేవి అలంకారంలోని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. 

నివేదన: పెరుగన్నం

ఎనిమిదవ రోజు: శ్రీ దుర్గాదేవి (ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, సోమవారం)
దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది అష్టమి రోజునే. అందుకే అమ్మవార్ని దుర్గాదేవిగా కీర్తిస్తారు. అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అంటారు. దేవి త్రిశూలం ధరించి సింహవాహనాన్ని అధిష్ఠించి, బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంది. దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరం అవుతాయి. 

నివేదన: కదంబం (కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి వండే వంట)

తొమ్మిదవ రోజు: శ్రీ మహిషాసుర మర్దిని దేవి, (ఆశ్వయుజ శుద్ధ నవమి, మంగళవారం)
అష్ట భుజాలతో ఒక చేత త్రిశూలాన్ని ధరించి, సింహవాహనంపై దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకానికి మేలు చేసింది. ఈ రూపంలో అమ్మ దర్శనం మానవాళికి సమస్త భయాల్ని పోగొట్టి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. నవమి రోజున మహిషాసురుని సంహరించింది కాబట్టి ఈ పర్వదినాన్ని మహర్నవమి అని వ్యవహరిస్తారు.

నివేదన: గుడాన్నం

విజయదశమి: శ్రీరాజరాజేశ్వరీ దేవి (ఆశ్వీయుజ శుద్ధ దశమి, బుధవారం )
దసరా ఉత్సవాల్లో ఆఖరు రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. షోడశ మహామంత్ర స్వరూపిణీ, మహాత్రిపురసుందరి, శ్రీ చక్ర అధిష్ఠాన దేవత శ్రీరాజరాజేశ్వరీదేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి విజయ అని అంటారు. పరమ శాంత స్వరూపంలో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడను చేతిలో పట్టుకొని ఉన్న అమ్మవారిని విజయదశమినాడు దర్శించుకుంటే అన్నింటా విజయం సాధిస్తారని నమ్మకం. 
నివేదన: పరమాన్నం (పాయసం)

 
--డీ.వీ.ఆర్‌ భాస్కర్‌
ఫొటోల సహకారం: షేక్‌ సుబాని, సాక్షి, ఇంద్రకీలాద్రి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top