గౌరముఖుడి వృత్తాంతం | durjaya greed divine gem gouramukha story | Sakshi
Sakshi News home page

గౌరముఖుడి వృత్తాంతం

Mar 29 2026 8:20 AM | Updated on Mar 29 2026 8:20 AM

durjaya greed divine gem gouramukha story

పూర్వం కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. ఎన్నేళ్లు గడిచినా వారికి సంతానం కలగలేదు. 
ఆ కాలంలో మహాతపస్వి అయిన ఆత్రేయ మహర్షి చిత్రకూట పర్వతం మీద ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండేవాడు. సంతానాపేక్షతో సుప్రతీకుడు ఒకనాడు తన భార్యలిద్దరితో కలసి వెళ్లి ఆత్రేయ మహర్షిని దర్శించుకున్నాడు. ఆత్రేయుడి అనుగ్రహంతో కొన్నాళ్లకు సుప్రతీకుడికి దుర్జయుడనే కొడుకు పుట్టాడు.దుర్జయుడు అమిత శక్తిమంతుడిగా ఎదిగాడు. సుప్రతీకుడు కొడుకుకు రాజ్య పాలనను అప్పగించి, తపస్సు చేసుకోవడానికి వానప్రస్థానానికి వెళ్లిపోయాడు. దుర్జయుడు అపార సైన్యసంపత్తిని సమకూర్చుకుని, దండయాత్రకు బయలు దేరాడు. 

ఎక్కడా అపజయం ఎరుగకుండా, సమస్త భూమండలాన్ని అవలీలగా జయించాడు. ఆ తర్వాత అష్టదిక్పాలకులనూ ఓడించి, తన దారికి తెచ్చుకున్నాడు. విజయగర్వంతో తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అవుతుండగా, తోవలో గౌరముఖుడు అనే మహర్షి ఆశ్రమం కనిపించింది. దుర్జయుడు తన సైనిక పటాలాన్ని బయటనే నిలిపి ఉంచి, తానొక్కడే మహర్షి ఆశ్రమంలోకి వెళ్లి, ఆశీస్సులు కోరాడు. గౌరముఖుడు మహారాజైన దుర్జయుడిని సాదరంగా ఆహ్వానించి, గౌరవించాడు. ‘మహారాజా! ఘనవిజయాలు సాధించి నా ఆశ్రమానికి వచ్చావు. నీకు, నీ పరివారానికి ఆతిథ్యమిస్తాను’ అన్నాడు.ఒంటరిగా ఆశ్రమంలో ఉంటున్న మహర్షి తనకు, తన వెంట వచ్చిన లక్షలాదిమంది సైనికులకు ఆతిథ్యం ఎలా ఇస్తాడా అని దుర్జయుడు ఆశ్చర్యపోయాడు.అంతలోనే గౌరముఖుడు స్నాన సంధ్యలు ఆచరించి వస్తానని చెప్పి, సమీపంలోనే ఉన్న గంగానదికి వెళ్లాడు. 

గంగలో నిలిచి, భక్తిగా నారాయణుడిని స్తుతించాడు.గౌరముఖుడి స్తుతికి ప్రసన్నుడైన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు.‘స్వామీ! దుర్జయ మహారాజు సైన్యసమేతంగా నా ఆశ్రమానికి వచ్చాడు. అతడికి, అతడి పరివారానికి ఆతిథ్యం ఇస్తానని చెప్పాను. వారందరికీ ఆతిథ్యమిచ్చే శక్తినివ్వు’ అని ప్రార్థించాడు. నారాయణుడు ఒక దివ్యమణిని గౌరముఖుడికి ఇచ్చి, ‘ఈ మణి నువ్వు కోరినవన్నీ తక్షణమే ఇవ్వగలదు’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.గౌరముఖుడు ఆ మణి మహిమతో దుర్జయుడు, అతడి పరివారం విడిది కోసం అప్పటికప్పుడే చలువరాతి సౌధాలు, దాస దాసీ జనాలు, ఉద్యాన వనాలతో కూడిన ఒక సువిశాల సుందర నగరాన్ని సృష్టించాడు. దుర్జయుడికి, అతడి పరివారానికి కోరిన పదార్థాలన్నింటినీ సుష్టుగా వడ్డించాడు. 

భోజనానంతరం వారంతా అక్కడే హాయిగా విశ్రమించారు. మరునాటి ఉదయం దుర్జయుడు, అతడి పరివారం కాలకృత్యాలు, స్నాన సంధ్యల కోసం నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చే సరికి ముందురోజు తాము బస చేసిన నగరం కనిపించలేదు. గౌరముఖుడి శక్తికి దుర్జయుడు, అతడి పరివారం చకితులయ్యారు. గౌరముఖుడి వద్ద సెలవు తీసుకుని రాజధాని వైపు ప్రయాణం మొదలుపెట్టారు.మార్గమధ్యంలో ఉండగా, దుర్జయుడికి ఒక దురాలోచన వచ్చింది. గౌరముఖుడు తమందరికీ ఎలా ఆతిథ్యం ఇచ్చాడో, ఆ రహస్యమేమిటో కనుక్కుని రమ్మని చారులను పంపాడు. నారాయణుడి వరం వల్ల పొందిన మణి మహిమతో అతడు తమకు ఆతిథ్యం ఇవ్వగలిగాడని చారులు చెప్పారు. 

ఆ మణిని అడిగి తెమ్మని దుర్జయుడు భటులను పంపాడు.గౌరముఖుడి వద్దకు వెళ్లిన భటులు మణిని ఇవ్వమని తమ రాజు ఆదేశించినట్లుగా చెప్పారు. నారాయణ వరప్రసాదమైన మణిని తాను ఇచ్చేది లేదని గౌరముఖుడు నిర్మొహమాటంగా చెప్పాడు. వారు దుర్జయుడి వద్దకు వెళ్లి మణిని ఇవ్వడానికి గౌరముఖుడు తిరస్కరించిన సంగతి చెప్పారు.దుర్జయుడు సైన్యసమేతంగా గౌరముఖుడిపైకి దండెత్తి వచ్చాడు. గౌరముఖుడు మణి మహిమతో సైన్యాన్ని సృష్టించాడు. ఆ సైన్యం చేతిలో దుర్జయుడి సైన్యం తుడిచిపెట్టుకుపోయింది. దుర్జయుడు కరవాలం దూసి గౌరముఖుడిపైకి దూసుకు వస్తుండగా, గౌరముఖుడు నారాయణుడిని ప్రార్థించాడు. నారాయణుడు చక్రం సంధించి, దుర్జయుడి కంఠాన్ని ఉత్తరించాడు.
∙సాంఖ్యాయన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement