మట్టి కాని గట్టి బొమ్మలు

Deepti Bhandari left her job as a teacher to start her own play dough company - Sakshi

బంక మట్టితో చేసిన బొమ్మలు ఎక్కువసేపు నిలబడవు. ఎండిపోగానే పగుళ్లు వచ్చేస్తాయి. అందుకే పిల్లలు రసాయనాలతో తయారైన మట్టితో బొమ్మలు చేస్తూ ఆడుకుంటారు. ఆ మట్టిలో ప్రమాదకరమైన కిరసనాయిల్, బొరాక్స్‌ వంటివి ఉంటాయి. అవి పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. తన యేడాది వయసున్న కొడుకు మట్టితో ఆడుతుంటే దీప్తికి భయంగా ఉండేది. పిల్లవాడి ఆరోగ్యం కోసం రసాయనాలు లేని బొమ్మలు తయారు చేయాలనుకుంది దీప్తి. ఆ ఆలోచన నుంచి వచ్చినదే పర్యావరణ హితమైన మట్టి. పిల్లల కోసం బెంగళూరుకు చెందిన దీప్తి భండారీ హాని కలిగించని కృత్రిమ మట్టిని తయారు చేయడం ద్వారా ఆ మట్టితో ఆడుకునే పిల్లలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు.. తాను ఆర్థికంగా ఎదుగుతున్నారు దీప్తి.

బయో కెమిస్ట్రీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన దీప్తి.. టీచింగ్‌ మీద ఆసక్తి పెంచుకున్నారు దీప్తి. బంధువుల పిల్లలకు పాఠాలు చెబుతూ టీచింగ్‌ లో అనుభవం సంపాదించారు. ఆ అనుభవంతో పిల్లల కోసం ‘మిల్క్‌ టీత్‌ యాక్టివిటీ సెంటర్‌’ను బెంగళూరులోని చామరాజ్‌పేట్‌లో ప్రారంభించారు. పిల్లలకు పాఠాలు చెబుతూ, వృత్తి మీద ప్రేమ పెంచుకున్నారు. ఆ సమయంలోనే ఒక తల్లి పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం మీద అవగాహన ఏర్పడింది దీప్తికి. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ, వాళ్లకి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో తెలుసుకున్నారు దీప్తి. ‘‘పసి వయసులో నేర్చుకున్న విద్య జీవితాంతం గుర్తుండిపోతుంది. అందులో నైపుణ్యం కూడా వస్తుంది’’ అంటారు దీప్తి.

ఆటల్లోనే అన్నీ...
పిల్లలకు బొమ్మలతో ఆటలు నేర్పుతూ, రంగులు, ఆకారాలు, పరిమాణాల గురించి కూడా నేర్పించటం దీప్తి ప్రత్యేకత. ‘‘మా అబ్బాయి చేతి రాత బాగుండేది కాదు. కాని మట్టితో బొమ్మలు చేయడం ద్వారా అందమైన రాత అలవాటయ్యింది. అంతకుముందు పెన్సిల్‌ సరిగ్గా పట్టుకోలేకపోయేవాడు. ఇలా మట్టితో ఆటలు మొదలుపెట్టాక, చేతి వేళ్లు, కండరాలు బలంగా తయారు కావడంతో పెన్సిల్‌ చక్కగా పట్టుకోగలిగాడు. చక్కగా రాయగలుగు తున్నాడు. టీచర్‌గా నాకున్న అనుభవం మా అబ్బాయిని పెంచుకోవటానికి ఉపయోగపడింది’’ అంటారు దీప్తి.

అందరూ ఆసక్తి చూపించారు
‘‘నేను పిల్లల కోసం టాడ్లర్‌ క్లాసులు ప్రారంభించాను. ఆ క్లాసులో పిల్లలంతా మట్టితో బొమ్మలు తయారు చేస్తారు. పిల్లలు చేసిన బొమ్మలు చూసిన తల్లిదండ్రులు ఆ మట్టి గురించి సమాచారం అడిగారు’’ అంటూ ఆనందంగా చెబుతారు దీప్తి. సాధారణంగా మార్కెట్‌ లో దొరికే మట్టితో చేసిన బొమ్మలు చాలా త్వర గా ఎండిపోతాయి. ఆ మట్టి ని మళ్లీ ఇంక ఉపయోగించలేం. కాని దీప్తి.. ఉప్పు, పిండి, నూనె, ఫుడ్‌ గ్రేడ్‌ కలర్స్, నీళ్లు కలిపి తయారు చేసిన మట్టి ఆరునెలల వరకు గట్టి పడకుండా ఉంటుంది. ‘‘నేను చేసిన మట్టి చూసి తల్లిదండ్రులంతా చాలా సంతోషించారు. వాళ్లకి కూడా ఈ మట్టి కావాలి అని అడిగి కొని తీసుకు వెళ్తున్నారు’’అంటున్న దీప్తి 20 వేల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు నెలకు 35 వేలు సంపాదిస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యంతోపాటు, తనకు ఆదాయం వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటారు దీప్తి భండారీ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top