నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..! | Sakshi
Sakshi News home page

నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!

Published Sun, May 19 2024 6:20 PM

Cant Sleep Insomnia Causes Symptoms Cures

నగరజీవితం ప్రతి మారుమూల పల్లెల్నీ తాకాక, జీవితాల్లోకి సెల్‌ఫోన్‌ దూసుకువచ్చాక ప్రధానంగా మొన్న కరోనా అందరినీ తాకి వెళ్లాక నిద్రలేమి ఓ పెద్ద సమస్యగా మారింది. రాత్రి ఒంటిగంటా, రెండు వరకూ నిద్రపట్టకపోవడం మామూలేంది. వైద్యపరిభాషలో ‘ఇన్‌సామ్నియా డిజార్డర్‌’ అని పిలిచే ఈ సమస్య ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. నిద్రను దూరం చేసే అంశాలేమిటో, నిద్రపట్టేదెలాగో తెలిపేదే ఈ కథనం. 

నిద్రలేమి సమస్య అందరిలో ఒకలా ఉండదు. కొందరికి రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపట్టవచ్చు. కొందరికి త్వరగా నిద్రపట్టినప్పటికీ, కాసేపటికే మెలకువ వచ్చి... ఇక ఆపైన ఎంత ప్రయత్నించినా నిద్రరాక΄ోవచ్చు. కొందరికి ఏ తెల్లవారుజామున మూడు, మూడున్నరకు మెలకువ వచ్చాక... మళ్లీ ఏ ఆరు, ఏడు గంటలప్పుడో నిద్ర రావడం, కానీ ఎలాగూ తెల్లవారి΄ోయింది కదాని బలవంతంగా నిద్రలేస్తే... రోజంతా డల్‌గానూ ఉండవచ్చు.  ఇవన్నీ నిద్రలేమి సమస్యలే. 

నిద్రలేమి రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటిది తాత్కాలిక నిద్రలేమి, రెండోది దీర్ఘకాలిక నిద్రలేమి. మొదటిది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అదే మూడువారాల కంటే ఎక్కువకాలంగా బాధిస్తుంటే దాన్ని క్రానిక్‌ ఇన్‌సామ్నియాగా చెప్పవచ్చు. కారణాలను బట్టి నిద్రలేమిలో మరో రెండు రకాలుంటాయి. అవి... 

ప్రైమరీ ఇన్‌సామ్నియా: నిర్దిష్టమైన ఎలాంటి కారణాలూ లేకుండా మామూలుగా నిద్రపట్టక పోవడాన్ని ‘ప్రైమరీ ఇన్‌సామ్నియా’ అంటారు. 

సెకండరీ ఇన్‌సామ్నియా: ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్‌సామ్నియా’ అంటారు. అంటే మానసిక సమస్యలతో బాధపడుతుండటం లేదా గ్యాస్‌ వల్ల కలిగే ఛాతీలో మంట, ఆస్తమా,  క్యాన్సర్‌ (కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు తీసుకునే చికిత్సల వల్ల కూడా); గుండెజబ్బులు, కీళ్లనొప్పులు లేదా దేహంలో మరెక్కడైనా తీవ్రమైన నొప్పి వల్ల నిద్రపట్టకపోవడం; కొన్ని సందర్భాల్లో మత్తుపదార్థాలను అధికంగాతీసుకున్నప్పుడూ నిద్రకు దూరం కావడం మామూలే. పట్టరాని సంతోషమూ లేదా భరించలేనంత దుఃఖం వల్ల కూడా నిద్రపట్టకపోవచ్చు. ఇలా వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్‌సామ్నియా’గా చెప్పవచ్చు. 

ఇన్‌సామ్నియాకు కారణాలు 

  • చిన్నతనంలో తీవ్రవేదనకు గురికావడం 

  • డిప్రెషన్, యాంగై్జటీ వంటి మానసిక సమస్యలు 

  • నిద్రమేల్కొని షిఫ్టుల్లో పనిచేయడం ∙వాతావరణ పరిస్థితులు (పెద్ద పెద్ద శబ్దాలు, తీక్షణమైన కాంతి, ఎక్కువ వేడి/చలి)  జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు (ప్రియమైన వారి మరణం, అకస్మాత్తుగా ఉద్యోగం మారడం, విడాకుల వంటివి) 

  • కొన్నిరకాల మందులతో (ఉదా: అలర్జీ, ఆస్తమా, డిప్రెషన్, బీపీలకు వాడే కొన్ని మందులు).


మేనేజ్‌మెంట్‌ / చికిత్స: తాత్కాలిక నిద్రలేమికి చికిత్స అవసరం లేదు. కాక΄ోతే వేళకు నిద్రపోవడం వంటి మంచి అలవాట్ల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కానీ దీర్ఘకాలిక నిద్రలేమి ఉన్నప్పుడు ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో చూడాలి. అంటే... మానసిక సమస్యల వల్లనా లేదా ఏవైనా శారీరక సమస్యలున్నాయా అని పరీక్షలు జర΄ాల్సిన అవసరముంటుంది. 

మానసిక సమస్యలతో ఇలా జరుగుతుంటే తగిన చికిత్స తీసుకోవాలి. ∙నిద్రమాత్రలు వాడటం ఒక చికిత్స. అయితే ఇవి తాత్కాలికంగానే వాడాలి. బాధితులు వాటికి అలవాటు పడే (అడిక్షన్‌కు) అవకాశం ఉంటుంది. అప్పుడు వాటిని వదిలించడానికి మరో చికిత్స  చేయాల్సిరావచ్చు. అందుకే వాటిని దీర్ఘకాలం వాడటం సరికాదు. అందువల్ల జీవనశైలి మార్పులతో వేళకు నిద్ర΄ోయేలా చేసుకోవడం  మంచిది. 

నిద్రలేమి నివారణ ఇలా... 

  • వేళకు నిద్ర΄ోవాలి. నిద్రకు అరగంట ముందర గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది ∙మధ్యాహ్నం నిద్ర ఓ పవర్‌న్యాప్‌లా అరగంట చాలు. ఒకవేళ మధ్యానం చాలాసేపు నిద్రపోతే అది రాత్రి నిద్రకు చేటుగా మారవచ్చు 

  • కెఫిన్‌ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీతో తోపాటు కొన్ని కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి ∙సిగరెట్లలోని నికోటిన్‌తో కూడా నిద్రను దూరం చేస్తుంది.

  • ఆల్కహాల్‌తో నిద్ర పట్టినప్పటికీ ఒక్కోసారి తెల్లవారుజామున మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టక΄ోవడం, నిద్ర సమయం తగ్గి΄ోవడం మామూలే. అందుకే మద్యం అలవాటుకు దూరంగా ఉండాలి ∙వ్యాయామంతో అలసిపోతే బాగా నిద్రపడుతుంది. అయితే నిద్రపోవడానికి 4–5 గంటల ముందు వ్యాయామం చేయకూడదు. 

  • పడక గదిలో టీవీ ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదు  

  • తీవ్రమైన ఉద్విగ్నత, ఆందోళన నిద్రను దూరం చేసే అంశాలు. అందుకే మానసిక ప్రశాంతత అవసరం. ఇందుకోసం యోగా, ధ్యానం చాలావరకు ఉపయోగపడతాయి  నిద్ర టైముకు అరగంట ముందర గోరువెచ్చని పాలు తాగాలి. అందులోని ట్రిప్టోఫాన్‌ అనే ఎసెన్షియల్‌ అమైనో యాసిడ్‌ మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రమాత్ర కంటే ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటని గుర్తుంచుకోవాలి.  

డాక్టర్‌ కిషన్‌ శ్రీకాంత్‌ జువ్వా, స్లీప్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ పల్మనాలజిస్ట్‌ 

(చదవండి: మగవాళ్లకు స్టయిలింగ్‌ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ)

Advertisement
 
Advertisement
 
Advertisement