పని ఒకటే...  పాపాలు ఐదు..

The Buddha Taught Nonviolence Importance Of Ahimsa - Sakshi

ఒక సమయంలో బుద్ధుడు రాజగృహానికి వచ్చి, జీవకుని మామిడితోటలో ఉంటున్నాడు. అది వేసవికాలం కావడంతో ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ తోటలో చల్లగానే ఉంటుంది. చెట్లన్నీ మామిడిపండ్లతో నిండుగా ఉన్నాయి. బుద్ధుడు అక్కడ ఉన్నాడని తెలిసి ఎందరెందరో అక్కడికి వచ్చి చేరేవారు. బుద్ధుని ప్రసంగాలు వింటూ ఉండేవారు. 
భిక్షువులు ఉదయం పొద్దు బాగా పైకెక్కాక నగరంలో భిక్షకు వెళ్ళేవారు. మధ్యాహ్నం వేళకు ముందే తిరిగి వచ్చేవారు. మామిడి చెట్లకింద చేరి తమ తమ అనుభవాలను చర్చించుకుంటూ ఉండేవారు. ఆ రోజు... ఇద్దరు భిక్షువులు తీసుకున్న భిక్ష మీద చర్చ జరిగింది.

వారు భిక్షకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు ఆరోజు మాంసాహారం మాత్రమే వండుకున్నారు. అదే వారికి భిక్షగా వేశారు. ఆ ఇద్దరూ భిక్షను స్వీకరించారు. కానీ, వారిలో ఒకరు మాత్రమే దాన్ని తిన్నారు. రెండోవారు దాన్ని తెచ్చి కూరను జంతువులకు వేసి, ఉత్త చప్పిడి అన్నాన్నే భుజించాడు. మాంసాహార విషయంలో బుద్ధుడు అనేక నియమాలు పెట్టాడు. భిక్షువులు కూర్చొని భిక్ష విషయాలు మాట్లాడుకోవడం జీవకుడు విన్నాడు. బుద్ధుడు చెప్పిన పంచశీలలో మొదటిదే జీవహింస విషయం. ఆ విషయం జీవకునికి బాగానే తెలుసు. జీవకుడు మెల్లగా బుద్దుని దగ్గరకు వెళ్ళాడు. బుద్ధుడు ఆరామం ముందున్న పెద్ద మామిడి చెట్టు కింది అరుగు మీద కూర్చొని ఉన్నాడు. 

జీవకుడు వెళ్ళి నమస్కరించాడు.  ‘‘జీవకా! అలా కూర్చో’’ అన్నాడు బుద్ధుడు. జీవకుడు కూర్చొన్నాడు. తాను విన్న భిక్షువుల సంభాషణలు చెప్పాడు. ‘‘జీవకా! జీవహింసకు పాల్పడే వారికి అపుణ్యం (పాపం) ఐదుచోట్ల కలుగుతుంది. ‘‘చంపడం కోసం.. అదిగో ఆ ప్రాణిని తీసుకొని రండి’’ అని ఆదేశించినప్పుడు మొదటి పాపం తగులుతుంది. ఆ ప్రాణిని చంపడానికి దాని మెడకు తాడు వేసి వధించే చోటుకు లాక్కొని తీసుకుపోతున్నప్పుడు ఆ జంతువు భయపడుతుంది. దుఃఖపడుతుంది. అప్పుడు ఆ యజమానికి రెండోసారి పాపం కలుగుతుంది. 

‘‘వెళ్ళి దాన్ని చంపు. వధించు’’ అన్నప్పుడు ఆ యజమానికి మూడోసారి పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే.. ప్రాణభీతితో ఆ జంతువు అల్లాడిపోతుంది. భయంతో గింజుకుంటుంది. దుఃఖంతో విలవిల్లాడుతుంది. ఇక ఆ జంతువుని వధిస్తున్నప్నుడు  అది మరింత రోదిస్తుంది. అప్పుడు నాలుగోసారి పాపం వచ్చిపడుతుంది. అలాంటి మాంసాన్ని ఇతరులకు పెట్టినప్పుడు, భిక్షగా వేసినప్పుడు ఐదోసారి ఎంతో అపుణ్యం అంటుకుంటుంది. జీవకా! తెలిసి, తన కోసమే వండిన ఈ ఆహారాన్ని తిన్న వారికి ఇంతకుమించిన అపుణ్యం కలుగుతుంది.’’ అన్నాడు. ఒక్క జీవహింసలోనే కాదు.. ఏ చెడ్డ పనికైనా ఇలాంటి పాపాలు కలుగుతాయని తెలుసుకుని బుద్ధునికి వినమ్రంగా ప్రణమిల్లాడు జీవకుడు. 
– డా. బొర్రా గోవర్ధన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top