బైక్‌ రైడింగ్‌‌తో నడుమునొప్పా.. అయితే ఇది మీకోసమే! 

Back Pain While Driving Two Wheeler  Tips To Avoid - Sakshi

సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్‌ వంటి అంశాల్లో కొన్ని నిర్ణీత ప్రమాణాలను  పాటిస్తుంటారు. బైక్‌ నడుపుతున్నప్పుడు ఆయా అవయవాలపై ఒత్తిడి పడకుండా ఉండేలాంటి  (ఎర్గానమిక్స్‌) జాగ్రత్తలతో వాటిని తయారు చేస్తుంటారు. దాంతో దాదాపుగా అవయవ సమస్యలు రావు. ఒకవేళ బైక్‌లోని హ్యాండిల్‌బార్, సీట్, ఫుట్‌రెస్ట్స్‌ వంటి వివిధ అంశాలు సరైన ప్రమాణాలతో లేకపోతే  నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలా బైక్‌ ఎర్గానమిక్స్‌ సరిగా లేక నడుమునొప్పి వస్తుందని అనుమానిస్తుంటే ఈ కింది జాగ్రత్తలు పాటించడం మంచిది. 

బైక్‌ల హ్యాండిల్స్‌ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్‌ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. 
మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్‌ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. అలాగని మరీ దగ్గరగా కూడా ఉండకూడదు. ఈ రెండు అంశాల్లో ఎక్కడ తేడా వచ్చినా నడుమునొప్పి రావచ్చు. 
బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్‌ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్‌ బైక్స్‌ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. 
బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్‌ (బ్యాక్‌ప్యాక్స్‌) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్‌ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి.  

నడుమునొప్పితో బాధపడేవారు తమ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, అలాగే వారు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. దాంతో నొప్పి తగ్గవచ్చు. ఈ జాగ్రత్తల తర్వాత కూడా నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడమే మంచిది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top