మీరు అసహ్యకరమైన సూచనలు చేయద్దు..

Ashu Raised Some Voice Against Apartheid - Sakshi

వర్ణ వివక్ష 

‘నల్లగా ఉండటం నా తప్పా అంటూ..’ రంగు పట్ల ఉన్న వివక్ష గురించి ఒక పాటలా తనలాంటి వారి వేదనను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఐషు. నవ్వుతూ తన అభిప్రాయాన్ని తెలుపుతున్న ఐషు లాక్డౌన్‌ టైమ్‌ నుంచి తను చేస్తున్న డ్యాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తోంది. ఎనర్జిటిక్‌ డ్యాన్సింగ్‌ గర్ల్‌గా పేరుతెచ్చుకున్న ఐషు నలుపు–తెలుపు గురించి వాదించాల్సి వస్తోంది. తెల్లగా అవడానికి రకరకాల సూచనలు చేస్తున్నవారి సంఖ్య కొన్నాళ్లుగా పెరుగడమే అందుకు కారణం. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఐషు ఫొటోలు చూసి చాలామంది తెల్లగా అవడానికి రకరకాల సూచనలు చేస్తున్నారు. దీంతో ‘నల్లగా ఉన్నంత మాత్రానా అందం తగ్గదు. తెల్లగా ఉండకపోవడం నా తప్పు కాదు. నా చర్మం రంగు, తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి మీ అభిప్రాయాలను నేను అడగడం లేదు. నలుపు అందమైనది. సూర్యకాంతితో అది మరింత మెరుస్తుంది. కలర్‌ కోసం బ్లీచింగ్‌ క్రీమ్స్‌ వాడమంటూ మీరు అసహ్యకరమైన సూచనలు చేయద్దు..’ అంటూ పాట ద్వారా సున్నితంగా తెలియజేసింది ఐషు. అంతేకాదు ‘ఫ్రెండ్స్‌... ఈ వీడియో నా కోసం చేయడంలేదు. నాలాంటి వారికి ఇది సహాయంగా ఉంటుందనే నా ఆలోచన.

నేను చాలా సంవత్సరాలు ఈ సమస్యపై పోరాడాను. చిన్నప్పుడు నల్లగా ఉన్నానని అందరూ ఆటపట్టించేవారు. ఆ కారణంగా చాలా పిరికిదానిలా ఉండేదాన్ని. ఎవ్వరితోనూ కలిసేదాన్ని కాదు. దీని వల్ల నేను నా అందమైన బాల్యాన్ని కోల్పోయాను. నన్ను ఫెయిర్‌ క్రీములు వాడమని సలహా ఇచ్చేవారు. పసుపు ముద్ద పూసుకోమనేవారు. కొన్నాళ్లు ఎవరేం చెప్పినా అవన్నీ చేశాను. కానీ, ఓ దశలో నా మీద నేనే విశ్వాసాన్ని పెంచుకున్నాను.

జనాల మాటలు పట్టించుకోవడం మానేశాను. డ్యాన్స్‌ అంటే పిచ్చిగా ప్రేమించే నేను అక్కడ నుంచి రకరకాల యాక్టివిటీస్‌ పెంచుకున్నాను. నేటికీ వర్ణవివక్ష ఎదుర్కొంటున్న నాలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఈ వివక్ష మూలం మన సమాజంలో బాగా లోతుగా ఉంది. దీనికి వ్యతిరేకంగా నల్లగా ఉన్నవారు తమ గళాన్ని పెంచాల్సిన అవసరం ఉంది’ అంటూ తన పోస్టు ద్వారా నలుపు రంగు అమ్మాయిలకు తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలనే సలహా ఇస్తుంది ఐషు. ఈ అమ్మాయి మాటలకు సోషల్‌ మీడియాలో చాలా మంది మద్దతుగా నిలిచారు. ఆమె ఆలోచననూ ప్రశంసిస్తున్నారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top