
అనూజ వైద్య మరో రికార్డు సాధించింది. పర్వతారోహకురాలైన అనూజ వైద్య ఇప్పుడు కొత్త రికార్డుల కోసం నీటి మీద దృష్టి పెట్టారు. ఇంటర్నేషనల్ వాటర్ స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె.
గుజరాత్ రాష్ట్రం, సూరత్‌కు చెందిన అనూజవైద్య గత నెల (జూన్) 24 నుంచి 29 వరకు థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్ వాటర్ స్కీయింగ్ అండ్ వేక్ బోర్డింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. బాల్యం నుంచి అనూజ స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉండేవారు. ట్రెకింగ్, స్విమ్మింగ్‌తోపాటు తండ్రి ప్రోత్సాహంతో తాపి నదిలో వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ పొందారు. ఆమె తల్లి సొంతరాష్ట్రం ఉత్తరాఖండ్. తల్లి ప్రోత్సాహంతో అనూజ ఆమె చెల్లి అదితి ఇద్దరూ పర్వతారోహణ చేశారు.
ఎవరెస్ట్ పర్వతాన్ని 2019లో తొలి ప్రయత్నంలోనే అధిరోహించి ’ఎవరెస్ట్ సిస్టర్స్’ గా గుజరాత్ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు. ఈ సిస్టర్స్ ఉత్తరాఖండ్‌లో ‘గెట్ సెట్ అడ్వెంచర్స్’ పేరుతో అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ స్థాపించారు. ఇదిలా ఉండగా 27 ఏళ్ల అనూజ వైద్య తాజాగా వాటర్ స్కీయింగ్ స్పోర్ట్స్‌లో భారత్ తరఫున పాల్గొన్నారు. రికార్డుల్లో శిఖరాగ్రాన్ని చేరిన అనూజ ప్రస్తుతం నీటి/మీద రికార్డుల బాట పట్టారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ క్రీడ మనదేశ మహిళల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు.
వీరికంటే ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని హరియాణకు చెందిన తాషి, నున్‌గ్షి మాలిక్‌లు ఎవరెస్ట్‌ను (2023)అధిరోహించారు. సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేసిన తొలి సిస్టర్స్‌గా రికార్డు సొంతం చేసుకున్నారు. అనూజ వేసిన తొలి అడుగుతో కొత్తతరం క్రీడాకారిణులు ఆ దారిలో నడుస్తారని ఆశిద్దాం.
(చదవండి: ఐరన్ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..)