కూలీ కూతురు.. నూటికి నూరు మార్కులు

Anasuya Kushwa Got Cent Marks In CBSC - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో సీబీఎస్సీ క్లాస్‌ 12వ తరగతి ఎగ్జామ్‌ ఫలితాలను మొన్న శుక్రవారం ప్రకటించారు. ఇందులో బదేరా గ్రామంలో దినసరి కూలీ కూతురు అయిన అన్సూయ కుశ్వా నూటికి నూరు శాతం మార్కులు సాధించి అందరి ప్రశంసలూ అందుకుంటోంది. బలహీన వర్గాల ఆడపిల్లల విద్యకు ప్రేరణగా నిలిచింది. అన్సూయ ఉండే బదేరా గ్రామంలో ఎనిమిదవ తరగతి వరకే ఉంది. ‘మా ఊళ్లో అమ్మాయిల చదువు ఎనిమిదవ తరగతితోనే పూర్తవుతుంది. ఆపైన ఎవరూ చదువుకోరు’ అంటూ ఫలితాలు విడుదలైన తర్వాత తమ గ్రామ పరిస్థితి ని తెలియజేసింది 17 ఏళ్ల అన్సూయ. ఆర్థికంగా వెనుకబడిన అర్హులైన యువత కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ ద్వారా బులంద్‌ షహార్‌లోని విద్యాజ్ఞాన్‌లో చదువుకుంటోంది అన్సూయ. అందరిలో ఒకరిలా కాకుండా ‘వేరు’గా ఉండాలనేది అన్సూయ ఆలోచన. అందుకు సీబీఎస్సీ పరీక్ష లో వందకు వందమార్కులు తెచ్చుకోవాలనే ఆశయంతో సాధన మొదలుపెట్టి, విజయం సాధించింది.

సమస్యలకు సవాల్‌
కుటుంబ పరిస్థితులే కాదు కోవిడ్‌–19 కూడా చాలా మంది పిల్లలను చదువులో వెనుకంజ వేసేలా చేసింది. కానీ, ఆన్‌లైన్‌ ద్వారా చదువును కొనసాగిస్తూ తన గమ్యాన్ని చేరుకుంది అన్సూయ. ‘మా ఊళ్లో ఇంటర్‌నెట్‌ సదుపాయం లేదు. వైర్‌లెస్‌ నెట్‌వర్క్, కరెంట్‌ సమస్యలూ... ఈ సమయం చాలా కష్టమే అనిపించింది. మా స్కూల్‌ వాళ్లు వాట్సప్‌ లో స్టడీ మెటీరియల్‌ని పంపేవాళ్లు. నేను నెట్‌వర్క్‌ ఉన్నప్పుడు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని, చదువుకునేదాన్ని’ అంటూ ఆమె తన సాధనలో వచ్చిన సమస్యలను, వాటిని అధిగమించిన విధానాన్ని వివరించింది. 

ఎనిమిది తర్వాత చదువుకు ఫుల్‌స్టాప్‌
బదేరా గ్రామంలో ఆడపిల్లలకు ఎనిమిదవ తరగతి అయిపోగానే పెళ్లి కోసం తర్వాతి గృహజీవితం కోసం పెద్దలు తీర్చిదిద్దుతారని, అబ్బాయిలు తమ పెద్దవారితో కలిసి శారీరక శ్రమ ఉండే పొలం పనుల్లో చేరుతుంటారని ఈ సందర్భంగా ఆమె వివరించింది. 

గ్రామీణ యువతకు అవకాశం
ఏడుగురు తోబుట్టువుల్లో అన్సూయ ఒకరు. ఐఎఎస్‌ పూర్తి చేసి గ్రామీణ యువత జీవితాలను చక్కదిద్దాలనే ఆలోచనతో ఉన్నానని చెబుతూనే, గ్రామాల్లో యువత ఉన్నత చదువులు చదివే అవకాశాలను ప్రభుత్వాలు పెంచాలనీ కోరుకుంటున్నది. కుటుంబాలనే కాదు ఎవరికి వారు తమ జీవితాలనూ బాధ్యతగా తీసుకోవాలని తను సాధించిన విద్య ద్వారా చూపుతుంది అన్సూయ. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా చదువొక్కటే తన జీవితాన్ని చక్కదిద్దగలదనే నమ్మకంతో భావి జీవితానికి దారులు వేసుకుంటున్న అన్సూయ లాంటి అమ్మాయిలు మన మధ్యే ఉంటారు. వారికి తగినంత ప్రోత్సాహం ఇవ్వడమే సమాజ బాధ్యత. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top